రేవంత్, సంజయ్  నాయకత్వాలపై అసమ్మతి సెగలు

Tuesday, May 21, 2024

తెలంగాణాలో కేసీఆర్ ను తామే గద్దె దించుతామని ప్రగల్భాలు పలుకుతూ వస్తున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ల నాయకత్వం పట్ల వారి పార్టీలలోని అసమ్మతి రాజుకొంటుంది. వారిద్దరూ తాజాగా పరస్పరం దాడులకు దిగడం ద్వారా తమ దివాళాకోరుతనంను బైట పెట్టుకొంటున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణాలో బిజెపికి భవిష్యత్ లేదన్నట్లు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బాంబు పేల్చడంతో ఆ పార్టీ నేతలు షాక్ లకు గురవుతున్నారు. కర్ణాటక ఫలితాలు తెలంగాణపై ఉండవని చెప్పుకొనేందుకు బిఆర్ఎస్, ఒక వర్గం మీడియా చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ కు ఊపిరి పోసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ సంజయ్ చేస్తున్న ఆరోపణలు బిజెపి నేతలను ఒక విధంగా నవ్వులపాలు చేస్తున్నాయి.

బండికి పార్టీని నడిపే నాయకత్వ లక్షణాలు లేవని రేవంత్‌రెడ్డి విమర్శిస్తే, అవును నిజమే, ఓటుకు నోటు పంచడం తనకు చేతకాదని బండి తిప్పికొట్టారు. పార్టీని నడిపించటం రేవంత్‌రెడ్డికి ఏ మేరకు చేతనవుతుందో ఆ పార్టీ సీనియర్‌ నాయకులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డిని అడిగితే చెబుతారని చురక అంటించారు. బీఆర్‌ఎస్‌ను గద్దె దింపటం బీజేపీతో అయ్యేపని కాదంటూ పొంగులేటి శ్రీనివాస్‌రె డ్డి, జూపల్లి కృష్ణారావు తనతో అన్నారని ఈటెల పేల్చిన బాంబు బిజెపి నేతలను ఆత్మరక్షణలో పడేసింది.

. పైగా బీఆర్‌ఎస్‌ను గద్దె దింపటం మీ జేజమ్మలు దిగివచ్చి నా కానీ పనంటూ పొంగులేటి, జూపల్లి తన కు రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చినట్టు ఈటల బయటపెట్టటంతో బీజేపీ నాయకత్వానికి దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయినంత పని అయింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేళ్లు అవుతున్న సందర్భంగా నెలరోజులపాటు జరుపుతున్న సంబరాలలో భాగంగా ఈ నెలలో ప్రధాని మోదీ, అమిత్ షా, జెపి నడ్డలను తెలంగాణకు తీసుకువచ్చి మూడు చోట్ల భారీ బహిరంగసభలు జరిపేందుకు బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సభలలో అయినా ఎవరైన ప్రముఖులను బీజేపీలో చేర్పించడం ద్వారా పార్టీ శ్రేణులలో జోష్ నింపేందుకు బిజెపి నేతలు తంటాలు పడుతున్నారు. అయితే ఆ పార్టీ నేతలలో ఎక్కడ ఉత్సాహం కనిపించడం లేదు. తెలంగాణ అవతరణ ఉత్సవాలు సహితం కేంద్ర ప్రభుత్వం పక్షాన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనదైన రీతిలో అధికారులతో జరుపుతుంటే, మరోవంక బండి సంజయ్ అప్పటికప్పుడు పార్టీ పక్షాన 21 రోజుల పాటు నిరసన వ్రతం మాదిరిగా జరిపేందుకు కార్యాచరణ ప్రకటించారు.

మరోవంక, రేవంత్ రెడ్డి సామర్థ్యం మీదనే నమ్మకం లేకపోవడంతో వైఎస్ షర్మిల వంటి వారిని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం డీకే శివకుమార్ ద్వారా చేస్తున్న ప్రయత్నాలు రేవంత్ కు షాక్ ఇచ్చినట్లుగానే స్పష్టం అవుతుంది.  ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలలో క్రమంగా రేవంత్ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.

షర్మిలను చేర్చుకోవడం రేవంత్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదని తెలుస్తున్నది. ఆమెకు మీడియా హైప్ మాత్రమే గాని క్షేత్రస్థాయిలో ఏమాత్రం మద్దతు లేదని చెబుతున్నారు. ఆమెను చేర్చుకొంటే కాంగ్రెస్ కు బలమైన పలు సీట్లను ఆమె సూచించిన అభ్యర్థులకు ఇవ్వాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles