రాజకీయ సందేశం లోపించిన చంద్రబాబు మేనిఫెస్టో!

Tuesday, October 22, 2024

రాజమహేంద్రవరంలో గతవారం రెండు రోజుల పాటు జరిగిన టిడిపి మహానాడులో 2024 ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టమైన రాజకీయ సందేశం ఇస్తారని అందరూ భావించారు.  ముఖ్యంగా ఎన్నికల్లో పొత్తుల విషయం, ఏపీ పట్ల వివక్షత చూపుతున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల వైఖరి, వెనుకబడిన రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ ప్రణాళిక వంటి అంశాలపై స్పష్టత ఇస్తారని ఎదురు చూశారు.

కానీ అవేమీ లేకుండా, కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలకు పరిమితమై, ఆరు కొత్త పథకాలతో కూడిన మినీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టో సహితం `చంద్రబాబు మార్క్’ సందేశం ఇవ్వలేకపోయింది. కేవలం వైఎస్ జగన్ ప్రస్తుతం అమలు పరుస్తున్న `నవరత్నాలు’ నగదు బదిలీ పధకాలను అధికారంలోకి వస్తే ఆపివేయమని, మరింత ఎక్కువ నగదు బదిలీచేస్తూ అమలు పరుస్తామని భరోసా ఇచ్చిన్నట్లు ప్రయత్నించారని పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ జగన్ `నవరత్నాలు’ ప్రకటించినప్పుడు హడావుడిగా చంద్రబాబు ఎన్నికల ముందు పలు కొత్త సంక్షేమ పధకాలు తీసుకొచ్చి అమలు పరిచే ప్రయత్నం చేశారు. అయినా జనం వాటిని విశ్వసించలేదు. అందుకనే టిడిపి ఓటమి పాలయింది. ఇప్పుడు జగన్ అమలు పరుస్తున్న `నగదు బదిలీ’ పధకాలను ప్రభుత్వం మారినంత మాత్రంచేత ఆపివేస్తారనే భయం వాటి లబ్ధిదారులతో ఎక్కడ కనిపించడం లేదు.

పైగా, నగదు బదిలీ చేస్తున్నారులే అని ప్రస్తుత ప్రభుత్వనికి తిరిగి ఓటు వేసే పరిస్థితి కూడా లేదు. “ఎవ్వరి కోసం మాకు ఇస్తారు?” అనే ప్రశ్నలు వస్తున్నాయి. అందుకనే ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న  అరాచక విధానాలు, ఆగిపోయిన పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ కల్పన వంటి అంశాలపై నిర్దుష్టమైన పధకాలను చంద్రబాబు నుండి ప్రజలు ఎదురు చూస్తున్నారు.

కానీ, గతంలో మాదిరిగా చంద్రబాబు జగన్ ట్రాప్ లో పడిపోయి, తన దారి తప్పుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడే జగన్ రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని అంటున్నారు. మరి ఆర్ధిక పరిస్థితిని ఏ విధంగా గాడిలో పెడతారు? అనే ప్రశ్నలకు టిడిపి నేతల నుండి జవాబు లేదు.

2019 ఎన్నికలలో టీడీపీ – వైసీపీల మధ్య 10 శాతం వరకు తేడా ఉంది. గత ఎన్నికలలో పార్టీకి దూరమైన వర్గాలను దగ్గరకు తెచ్చుకునేందుకు పార్టీ వద్ద వ్యూహాలు ఉన్నాయా?  జగన్ పాలనా పట్ల తీవ్ర అసమ్మతితో ఉన్న ఉద్యోగులఅను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారా?

2014లో అధికారంలోకి వచ్చినప్పుడు సహితం ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేక పోయింది. నిరుద్యోగభృతి, మహిళలకు మొబైల్ ఫోన్లు వంటి హామీలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ నుండి అవినీతి సొమ్ముని తిరిగి జప్తు చేస్తాం అంటున్నారు. ఏ విధంగా చేస్తారో చెప్పకుండా ప్రజలు నమ్మే అవకాశం ఉండదు.

టిడిపి హయాంలో సహితం పార్టీ ఎమ్యెల్యేలు, మంత్రులు పలువురిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అటువంటి వారి పట్ల ఏ విధంగా వ్యవహరించారు?  ముందు ప్రత్యేక హోదా అన్నారు. తర్వాత ప్రత్యేక ప్యాకేజితో సరిపుచ్చుకున్నారు. ఆ తర్వాత కాదు హోదా కావాలి అన్నారు. ఈ విషయంలో టిడిపి వైఖరి ఏమిటి?

పధకాల విషయంలో జగన్ తో పోటీ పడే ప్రయత్నం చేస్తే జగన్ విజేతగా మిగిలే ప్రమాదం ఉంది. జగన్ తో సంబంధం లేకుండా టిడిపి అధికారంలోకి వస్తే ఏవిధంగా భిన్నమైన పాలన అందిస్తుందో  ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం చేయాలి.  సృజనాత్మక విధానాలను రూపొందించాలి. ఆ దిశలో టిడిపి కృషి చేస్తున్నట్లు కనిపించడం లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles