మాజీ మంత్రి చంద్రశేఖర్ ను బుజ్జగించిన ఈటెల రాజేందర్

Thursday, December 26, 2024

బిజెపి రాష్త్ర అధ్యక్షునిగా బండి సంజయ్ ను మార్చగానే ఆయన వర్గంగా పేరొందిన ఇతర పార్టీల నుండి వచ్చిన కొందరు నేతలు బీజేపీలో తమ భవిష్యత్ గురించి కలవరం చెందుతున్నారు. తాము కూడా వేరే పార్టీని చూసుకొంటే మంచిదనే ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తున్నది. అటువంటి వారిలో ముఖ్యుడిగా భావిస్తున్న మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడనే ప్రచారం జరుగుతుంది.

పైగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనలో సహితం ఆయన ఎక్కడా కనిపించలేదు. కనీసం హైదరాబాద్ లో ప్రధానికి స్వాగతం చెప్పేందుకు కూడా రాలేదు. దానితో బండి సంజయ్ కు సన్నిహితంగా ఉంది, ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్న నేతలను బుజ్జగించే ప్రయత్నం బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ చేపట్టారు. 

ఆయన ఆదివారం చంద్రశేఖర్ ఇన్నిటికి వెళ్లి, కలిసి తొందరపడి పార్టీ మారే నిర్ణయం తీసుకోవద్దని వారించారు. అయితే, పార్టీలో చేరి రెండున్నర సంవత్సరాలు అయినా తనకు ఎలాంటి పదవి ఇవ్వలేదని, ఎటువంటి గుర్తింపు కలిగించడం లేదంటూ చంద్రశేఖర్ ఈటలకు వివరించినట్లు తెలుస్తోంది.ఐదు సార్లు ఎమ్యెల్యేగా, మూడు సార్లు మంత్రిగా పనిచేసిన తనను పట్టించుకోకుండా, కేవలం ఒక సారి ఎంపీగా గెలిచినా వివేక్ వెంకటస్వామికి విశేష ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారని చెబుతున్నారు.

చంద్రశేఖర్ తో భేటీ అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ చంద్రశేఖర్, తాను తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశామని చెప్పారు. కేసీఆర్ ను గద్దె దించేందుకు మరోసారి కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. తమకు ఉమ్మడి ఎజెండా ఉందని చెబుతూ వరంగల్ రీజియన్ వరకే ప్రధాని మోదీ మీటింగ్‌ పరిమితం అవ్వడంతో చంద్రశేఖర్‌కు పాస్‌ రాలేదని చెప్పారు. అంతే తప్ప మరొ ఉద్దేశం లేదన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు మాజీ మంత్రి చంద్రశేఖర్ తెలిపారు.

అయితే ఈటెల వచ్చి కలవడానికి కొంచెం ముందు చంద్రశేఖర్  ప్రధాని మోదీ వరంగల్ పర్యటనలో చెప్పిన మాటలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్ దని అంటున్న ప్రధాని అవినీతి జరిగితే చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రజలు అడుగుతున్నారని ప్రశ్నించారు.

కేసీఆర్ ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటేనే బీజేపీని ప్రజలు నమ్ముతారని తేల్చి చెప్పారు. దిల్లీ లిక్కర్ స్కాంలో అందర్నీ అరెస్ట్ చేసి ఒకరిద్దరిని ఎందుకు వదిలేశారని చంద్రశేఖర్ ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు విషయంలో అధిష్ఠానం తప్పుచేసిందని విమర్శించారు. బండి సంజయ్ పాదయాత్రతోనే బీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం అని ప్రజలు నమ్మారని చెప్పారు.

గతంలో ఏ అధ్యక్షుడు చేయని విధంగా బండి సంజయ్ పార్టీని బలోపేతం చేశారని కొనియాడారు. కానీ ఎన్నికల ముందు బండి సంజయ్ ను తప్పించటం ఏంటని ఆయన ప్రశ్నించారు. లేని పదవిని సృష్టించి ఈటల రాజేందర్‌ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని పార్టీ అధిష్ఠానంను నిలదీశారు.

అయితే, రాజేందర్ బుజ్జగింపులతో చంద్రశేఖర్ మెత్తబడ్డారా? కాంగ్రెస్ లో చేరే విషయం పునరాలోచిస్తారా? బీజేపీలో ఆయనకు కూడా తగు ప్రాధాన్యత ఇస్తారా? చూడాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles