మంత్రి పదవి కోరుకొంటే బండి సంజయ్ కు పార్టీ పదవి!

Friday, July 26, 2024

ఎన్నికల ముందు చెప్పా పెట్టకుండా కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించడంతో ఖంగు తిని ఇంకా కోలుకొని బండి సంజయ్ కనీసం కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ఎదురు చూస్తుంటే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో దిగాలు పడినట్లు కనిపిస్తున్నది. ఆ విధంగా నియమించడం ద్వారా పరోక్షంగా తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని వారించినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడంతో కిషన్ రెడ్డి కోల్పోయే మంత్రి పదవి తనకు ఇస్తారని ఎదురు చూసారు. ఇప్పుడు తెలంగాణాలో మరో ఎంపీకి ఇస్తే తన ప్రాధాన్యత మరింతగా తగ్గుతుందని మదనపడుతున్నారు. తెలంగాణ నుండే డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నా, ఏపీ నుండి మొన్నటి వరకు డి పురందేశ్వరి ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ ఉత్సవ విగ్రహాలుగానే మిగిలి పోయారు.

ప్రధాన కార్యదర్శిని సాధారణంగా ఏదో ఒక రాష్త్రానికి ఇన్ ఛార్జ్ గా నియమిస్తారు. సంజయ్ కు హిందీ భాషలో పట్టు లేకపోవడంతో కీలకమైన ఉత్తరాది రాస్త్రాలలో ఎక్కడకు పంపే అవకాశం లేదు. కనీసం ఇంగ్లీష్ కూడా రాకపోవడంతొ దక్షిణాది రాస్త్రాలలో కూడా నెగ్గుకు రాలేరు. చివరకు నోటా కన్నా తక్కువగా ఓట్లున్న ఆంధ్ర ప్రదేశ్ కు ఇన్ ఛార్జ్ గా నియమించే అవకాశాలున్నాయి.

ఇప్పటికే ఆ రాష్త్ర ఇన్ ఛార్జ్ గా ఉన్న కేంద్ర మంత్రి మురళీధరన్ పనితీరు పట్ల పార్టీ అగ్రనాయకత్వం సంతృప్తికరంగా లేదు. సహా ఇన్ ఛార్జ్ గా ఉంటూ, అక్కడే మకాం వేసి పెత్తనం వేస్తున్న జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ పై అనేక ఆరోపణలు రావడం, అక్కడ పార్టీలో ఓ `ముఠా నాయకుడు’గా వ్యవహరిస్తూ ఉండడంతో ఆయనను కార్యదర్శి పదవి నుండే తొలగించారు.

దానితో ఎంపికి కొత్తగా సంజయ్ ను ఇన్ ఛార్జ్ గా నియమించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆ రాష్ట్రంకు ఇన్ ఛార్జ్ గా వెళ్లే చేసెడిది ఏమీ ఉండబోదని సంజయ్ మద్దతుదారులు పెదవి విరుస్తున్నారు. పైగా, ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి బి-టీం గా బీజేపీ ఖ్యాతి పొందింది. అందువల్లననే ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాజయం ఎదురైందని ఆ పార్టీ సీనియర్ నేతలే వ్యాఖ్యానించారు.

ఇప్పటికే తెలంగాణ బిజెపిపై తన మార్క్ వేసుకునేందుకు బండి సంజయ్ తో సన్నిహితంగా వ్యవహరించిన నాయకులు అందరూ తన వైపుకు రావడమో లేదా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే చేయాల్సిందే అనే పరోక్ష సంకేతాన్ని కిషన్ రెడ్డి ఇచ్చారు. అందుకనే విజయశాంతి, జితేంద్రారెడ్డి వంటి వారు ఇప్పుడు ప్రముఖంగా పార్టీ కార్యక్రమాలలో కనిపించడం లేదు.

మరోవంక, సంజయ్  హయాంలో పార్టీ కార్యాలయంపై సహితం దూరంగా ఉంటూవస్తున్న ఈటెల రాజేందర్, డి అరవింద్, రఘునందన్ రావు వంటి వారికి పార్టీ వ్యవహారాలలో కీలక పాత్ర కల్పిస్తున్నారు. జిట్టా బాలకృష్ణరెడ్డిని అయితే ఏకంగా పార్టీ నుండి సస్పెండ్ చేశారు. తాజాగా కొందరు కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కిషన్ తన ప్రాబల్యాన్ని పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

మొదటిసారిగా, ఈటెల రవీందర్ కరీంనగర్ జిల్లాలో పర్యటనలు జరపడం ద్వారా బండి సంజయ్ వ్యతిరేకులను దగ్గరకు చేర్చుకొని ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం మంత్రిగా అయినా ఉంటె ఇటువంటి పరిణామాలను ఎదుర్కోవచ్చనుకున్న సంజయ్ కు పార్టీలో కీలక పదవి ఇచ్చినా రాజకీయంగా అవరోధంగా మారవచ్చని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles