ఆ కుర్రవాడు జగన్ భక్తుడు. జగనన్నతో దిగిన ఫోటోలను ఫ్లెక్సిలు వేయించుకునేంత వీరభక్తుడు. ‘ఒక్క చాన్స్ ఇవ్వండి’ అంటూ ఆరాటపడిపోతున్న జగనన్న ముఖ్యమంత్రి కావడానికి తన శక్తిమేరకు ఏమైనా చేయాలనుకున్నాడు.
అసలే సినిమాలు మనకు చాలా నేర్పుతున్నాయి. చాలా చాలా విషయాల్లో స్ఫూర్తి ఇస్తున్నాయి. వెంటనే ఆ కుర్రవాడికి ‘అతడు’ సినిమా గుర్తుకు వచ్చింది. ఆ సినిమా అప్పటి పరిస్థితులకు మ్యాచ్ అవుతున్నట్టుగా కనిపించింది. షాయాజీ షిండే ప్రతిపక్షంలో ఉన్నాడు. అధికారంలోకి రావాలంటే.. అతనికి ఉన్న చరిష్మాకి కాస్తంత సానుభూతి, జాలి జత చేయాలి. అదే తరహాలో జగనన్న సీఎం కావడానికి తన వంతుగా కొంత సానుభూతిని జత చేద్దాం అనుకున్నాడు. జగన్ మీద చిన్న హత్యాయత్నం అనేది జరిగితే.. తాను మహేష్ బాబు అయిపోతానని కూడా అనుకుని ఉండవచ్చు. కానీ మహేష్ బాబు లాగా కోటిన్నర డిమాండ్ చేయకుండా, జగనన్న మీద ప్రేమతో ఉచితంగా చేయాలనుకున్నాడు. ఆ కోరికే అతనితో కోడికత్తిని పట్టుకునేలా చేసింది.
జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి ఇచ్చిన వాంగ్మూలంలో కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ చెప్పిన వివరాలను గమనిస్తే ఎవ్వరికైనా సరే ఇలాగే అనిపిస్తుంది.
జగన్ కు ప్రాణహాని జరగకూడదనే ఉద్దేశంతోనే అతని భుజంపై పొడవాలని ముందుగానే నిర్ణయించుకున్నట్టు శ్రీనివాస్ వెల్లడించాడు. కోడికత్తి కారణంగా నొప్పి ఉండకూడదనే ఉద్దేశంతో.. దాన్ని ముందుగా స్టెరిలైజ్ కూడా చేశాడట. దాడికి కొన్ని క్షణాల ముందు ‘అన్నా మీరు 160 సీట్లు గెలుచుకుంటారు అని కూడా చెప్పాడట. అలాగే.. పొడిచిన తర్వాత.. ‘అన్నా ఏమీ కాదు పర్వాలేదు’ అని కూడా చెప్పాడట. ఎన్ఐఏ వాంగ్మూలంలో శ్రీనివాస్ ఈ మాటలు చెప్పారు.
జగన్ తో ఆ శ్రీనివాస్ ఈ మాటలన్నీ చెప్పాడో లేదో జగన్ కూడా కోర్టు పిలుపు మేరకు స్వయంగా విచారణకు హాజరై ఉంటే బాగా వెల్లడయ్యేది. ఆయన తాను వెళ్లకుండా.. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయండి.. అని ఒక మాట చెప్పి ఊరుకున్నారు.
కానీ పాపం వైఎస్సార్ భక్తుడిగా తన రాజకీయ ఆసక్తిని ప్రారంభించి, తర్వాత జగన్ భక్తుడిగా మారి.. జగనన్న పాలన వస్తే తప్ప రాష్ట్ర ప్రజలకు కష్టాలు తీరవనే ఉద్దేశంతో శ్రీనివాస్.. తాను ఈ పనిచేసినట్టుగా చెబుతున్నారు. నిజానిజాలు- నేర ధ్రువీకరణలు- శిక్షలు ఎప్పటికి తేలుతాయో మరి!
కోడికత్తి డ్రామా.. ‘అతడు’ సినిమా..!
Thursday, December 26, 2024