ఆర్ -5 జోన్ ఇళ్లపై `సుప్రీం’లో  ఏపీ సర్కార్ న్యాయపోరాటం

Thursday, June 20, 2024

రాజధాని అమరావతిలో ఆర్ -5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం  సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీన్ని అత్యున్నత న్యాయస్థానం స్వీకరించగా  ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు న్యాయస్థానం డైరీ నంబర్ కేటాయించింది. 

వచ్చే శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ వర్గాలు ఆశిస్తున్నాయి. లేనిపక్షంలో వచ్చే సోమవారం విచారణకు రావచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవంక,  రాజధానిలోని 9 గ్రామాల రైతులు కేవియట్ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. తమ వాదనలు కూడా వినాలని రాజధాని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు.

అమరావతి మాస్టర్‌ ప్లాన్ లో ఎలక్ట్రానిక్ సిటీగా పేర్కొన్న ప్రాంతంలో ఆర్‌ 5 జోన్‌ పేరిట పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలన్న ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలను హైకోర్టు తప్పు పట్టింది. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. అమరావతిలో 25 లే ఔట్లలో ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి మాత్రమే అనుమతించిన సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టు ఉత్తర్వులకు లోబడి తీర్పు ఉంటుందని స్పష్టం చేసిందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. మరోవైపు అమరావతిలో గత నెలలో 50వేల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఏపీ ప్రభుత్వం పనులు ప్రారంభించింది.

 విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన దాదాపు 50 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేసింది. అవే స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు జులై 24వ తేదీన ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన భూముల్లో రైతులకు చట్టబద్దంగా, వారి వాటాలు కేటాయించకుండా అవే భూముల్ని పేదలకు పెంచడాన్ని రైతులు సవాలు చేశారు. 

రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల్లో దాదాపు 28 వేల ఎకరాల భూమిని పేద, సన్నకారు రైతుల నుంచి సేకరించారని, ఈ నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను పట్టించుకోకుండా మాస్టర్‌ ప్లాన్‌ కు మార్పులు చేస్తూ కొత్తగా ఆర్‌5 జోన్ ఏర్పాటు చేసి అందులో ఇళ్ల స్థలాలు కేటాయించడాన్ని రైతులు తప్పు పట్టారు.

జస్టిస్‌ సోమయాజులు, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ, జస్టిస్‌ మానవేంద్రరాయ్‌‌లతో కూడిన ధర్మాసనం  ఇళ్ల స్థలాల కోసం 1402 ఎకరాల భూమి కేటాయింపును తప్పు పట్టింది. తక్షణం ఇళ్ల నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశించింది. 

రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆర్ -5 జోన్ ఏర్పాటుతో పాటు 1,402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు పిటిషన్లు దాఖలు చేయడంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సుప్రీంలో ఏపీ సర్కార్ కు ఊరట దొరుకుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles