అవినాష్ రెడ్డి అరెస్ట్ పై సీబీఐకి రహస్యం ఎందుకో!

Saturday, June 15, 2024

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే అని ఒక వంక హైకోర్టు, సుప్రీంకోర్టులలో స్పష్టం చేస్తున్నా, అరెస్ట్ కు అడ్డంకులు లేవని అత్యున్నత న్యాయస్థానాలు స్పష్టం చేస్తున్నా ముందస్తు బెయిల్ వచ్చే వరకు జాగారం చేసి, ఇప్పుడు అరెస్ట్ చేయడం, వెంటనే బెయిల్ పై విడుదల చేయడం అంతా రహస్యంగా పూర్తి చేయడం పలు అనుమానాలకు దారితీస్తుంది.

సీబీఐ అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసిన విషయం ఐదు రోజుల తర్వాత అప్పటి వరకు `సహనిందితుడు’గా పేర్కొన్న వ్యక్తిని `నిందితుడు నం 8’గా పేర్కొంటూ సిబిఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంటేగాని బైటకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గత రెండు నెలలుగా సీబీఐ అవినాష్ రెడ్డి అరెస్ట్ లో `దొంగాట’ ఆడుతోందని విమర్శలు చోటుచేసుకొంటున్నాయి.

ఇప్పుడు, ఆయనను నిందితుల జాబితాలో చేర్చి,  ఏ-8గా పేర్కొన్న సిబిఐ ఈనెల 3వ తేదీన జరిగిన ఈ అరెస్టు విషయాన్ని ప్రకటించకుండా గోప్యంగా వ్యవహరించింది. అవినాశ్‌కు ముందస్తు బెయిల్‌ ఇస్తూ తెలంగాణ హైకోర్టు మే 31న తీర్పు అనంతరం మూడు రోజులకు, ఆ తీర్పులోని అంశాల ఆధారంగా సీబీఐ అరెస్టు, విడుదల ప్రక్రియను ముగించడం గమనార్హం.

‘‘ఒకవేళ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయాల్సి వస్తే.. రూ.5 లక్షల వ్యక్తిగత బాండ్‌, సీబీఐ సంతృప్తి మేరకు తగిన మొత్తానికి రెండు పూచీకత్తులు తీసుకుని విడుదల చేయాలి’’ అని హైకోర్టు తన తీర్పులో ఆదేశించింది. అలాగే జూన్‌ నెల మొత్తం ప్రతి శనివారం సీబీఐ ఎదుట ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు హాజరుకావాలని పేర్కొంది.

తీర్పులోని ‘అరెస్టు.. విడుదల’ అనే సాంకేతిక అంశానికి అనుగుణంగా సీబీఐ ఆ ప్రక్రియను ముగించింది. అవినాశ్‌రెడ్డిని 8వ నిందితుడిగా (ఏ-8) చేరుస్తూ సీబీఐ తీసుకున్న నిర్ణయం గురువారం గాని వెలుగులోకి రాలేదు. అవినాశ్‌ తండ్రి భాస్కర్‌రెడ్డి బెయిల్‌ కోసం పెట్టుకున్న దరఖాస్తును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన అఫిడవిట్‌లో సీబీఐ తొలిసారి ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం.

ఇదంతా గమనిస్తుంటే, గత నెలలో కర్నూల్ ఆసుపత్రిలో  అనారోగ్యంతో చేరిన తల్లివద్ద ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సిబిఐ బృందం స్థానిక పోలీసులు శాంతిభద్రతల సమస్యలు తలెత్తవచ్చని చెప్పడంతో తిరిగి రావడం అంతా కూడబలుక్కొని జరిపిన తతంగంగా భావించాల్సి వస్తుంది.

ఉద్దేశ్యపూర్వకంగానే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకొనేవరకు, ఈ విషయమై హైకోర్టుకు, తర్వాత సుప్రీంకోర్టుకు, తిరిగి హైకోర్టుకు వెళ్లి, సాధించుకొనేవరకు సీబీఐ కాలయాపన చేస్తూ వచ్చిన్నట్లు స్పష్టం అవుతోంది. రాజకీయ వత్తిడుల కారణంగానే సిబిఐ ఈ విధంగా వ్యవహరించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై సిబిఐ ఇప్పటివరకు సుప్రీంకోర్టుకు వెళ్ళలేదు. కేవలం వివేకానందరెడ్డి కుమార్తె డా. సునీత వెళ్లారు. గతంలో కూడా ఆమె స్వయంగా సుప్రీంకోర్టు, హైకోర్టులకు వెడుతూ ఈ కేసులో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సిబిఐ అటువంటి చురుకుదనం ప్రదర్శించడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles