అంత పెద్ద సజ్జలకు ఆ మాత్రం తెలియదా?

Monday, July 22, 2024

ఆ నలుగురే హత్య చేశారని వాచ్ మెన్ రంగన్న స్పష్టంగా సాక్ష్యం చెప్పాడు. ఆ నలుగరూ హత్య చేసినట్టు తేలిపోయింది. హత్యలో స్వయంగా పాల్గొన్న ఒకరిని అప్రూవర్ గా మార్చడం ఎలా కుదురుతుంది? అనే ప్రశ్న అవినాష్ రెడ్డి నిరపరాధి అని నమ్ముతున్న, ఆయన మాటలను సమర్థిస్తున్న వారినుంచి తరచుగా వినిపిస్తూ ఉంది. ఏదో సాధారణ వ్యక్తులు ఇలాంటి అవకతవక వాదనను తెరపైకి తెస్తే పరవాలేదు. కానీ జర్నలిస్టుగా ఎంతో సుదీర్ఘమైన అనుభవం ఉన్న మేధావి, ప్రభుత్వానికి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇంత కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడితే ఎలా? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
నేరస్తుల్లో ఒకడైన దస్తగిరి అప్రూవర్ గా ఎలా మారుస్తారు? అని సజ్జల కూడా ప్రశ్నిస్తున్నారు. నేరస్తులు- అసలు నిజాలు వెల్లడించడానికి సిద్ధపడితేనే కదా వారిని ‘అప్రూవర్’ అని అంటారు. అప్రూవర్ అనే పదానికి అర్థమే అది కదా! అనేది సామాన్యుల సందేహం.
మామూలుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఏ విషయం మీదనైనా సరే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారంటే దాని అర్థం జగన్ స్వరాన్ని ఆయన వినిపిస్తున్నారని. రాష్ట్రంలో రాజకీయంగా గానీ, ఇతరత్రా గానీ.. స్వయంగా ముఖ్యమంత్రి స్పందించాల్సినంతటి అత్యంత కీలక పరిణామం ఉన్నప్పుడు.. దీనిపై ముఖ్యమంత్రి తన అభిప్రాయం ఏమిటో చెప్పాల్సిందే అని రాష్ట్రం ఎదురుచూస్తున్నప్పుడు.. జగన్ కు బదులుగా రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు రావడాన్ని ప్రజలు నాలుగేళ్లుగా గమనిస్తూనే ఉన్నారు. సజ్జల మీడియా ముందుకు వచ్చి ఒక మాట చెబితే.. అది సీఎం మనోభిప్రాయంగానే పరిగణిస్తున్నారు.
వివేకా హత్య కేసు, భాస్కర రెడ్డి అరెస్టు, అవినాష్ రెడ్డి విచారణ పర్వాన్ని ఎదుర్కోవాల్సి ఉండడం ఈ నేపథ్యంలో సజ్జల మీడియా ముందు సుదీర్ఘమైన ప్రసంగంలో అనేక అడ్డగోలు ప్రస్తావనలు తెచ్చారు. చంద్రబాబునాయుడు స్కెచ్ మేరకే సీబీఐ పనిచేస్తున్నది అనేది కూడా ఆ ఆరోపణల్లో ఒకటి!
ఎల్లో మీడియా మొత్తం విలువలు వదిలేసి, వలువలు వదిలేసి వ్యవహరిస్తున్నదని సజ్జల ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. వివేకా హత్య కేసు వివరాల్లో ప్రజలకు ఏం ఇంటరెస్టు ఉంటుందని,వాటిని పతాక శీర్షికల్లోకి తెస్తున్నారంటూ ఈ కురువృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు ప్రశ్నిస్తున్నారు. నిందితుల్లో ఒకడైన దస్తగిరి మాటలను పతాక శీర్షికల్లో వేయడం తప్పని అంటున్నారు. దస్తగిరిని నెత్తిన పెట్టుకోవడమే ఎల్లో మీడియా చవకబారుతనం అని విమర్శిస్తున్న సజ్జల.. దస్తగిరినే టార్గెట్ చేస్తూ, దస్తగిరి రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారనే పెద్దపదాలు వాడుతూ తనకు తెలియకుండానే దస్తగిరిని హీరో చేస్తున్నారు. అంతటి సీనియారిటీ మేధస్సు ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇంత సులువుగా ట్రాప్ లో పడిపోయినట్లుగా దస్తగిరి విషయంలో అర్థం పర్థంలేకుండా మాట్లాడుతుండడం వారిలోని కంగారును బయటపెడుతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles