రాష్ట్రానికి ఒక చోట రాజధాని ఉంటే, దానివలన పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయా? ఎలాంటి అవకాశాలు ఏర్పడతాయి? రాజధానితో ముడిపడి రాదగ ఉద్యోగాలు ఎలాంటివి? అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది. విజయదశమి నాటికి.. ఏపీ రాజధానిని విశాఖకు తరలించేయాలని చూస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం.. రాజధాని రావడం వలన విశాఖలో చాలా పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయనే మాట చెబుతున్నారు. ఇంతకూ రాజధానికి ఉద్యోగాలకు లంకె ఏమిటో మాత్రం చెప్పడం లేదు.
టీటీడీ ఛైర్మన్ పదవిని రెండు దఫాలు నిర్వర్తించిన తరువాత.. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా.. రాజధాని తరలింపు బాధ్యతను మొత్తం తన భుజస్కంధాల మీద మోస్తున్న వైవీ సుబ్బారెడ్డి తాజాగా విశాఖలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. త్వరలోనే విశాఖలో ఇన్పోసిస్ తమ కార్యాలయం ప్రారంభించనున్నట్టు చెప్పారు. అది నిజమైతే గనుక మంచిదే. కానీ, ఇక్కడ సమస్య ఏంటంటే.. ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ఎన్ని ఏర్పాటైనా.. నూరుశాతం ఉద్యోగావకాశాలను స్థానికులకు ఇస్తాయని అనుకోవడం భ్రమ. సాఫ్ట్ వేర్ కంపెనీల్లో సాధారణంగా దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు పనిచేస్తుంటారు. ఏపీకి చెందిన యువతరం హైదరాబాదు, బెంగుళూరు ల్లో ఐటీ ఇండస్ట్రీని శాసిస్తున్నదంటే అదే కారణం. మరి అలాంటిప్పుడు ఇన్ఫోసిస్ ద్వారా క్రియేట్ కాగల ఉద్యోగావకాశాలపై ఆశపెట్టడం భ్రమ.
ఇకపోతే ఒక ప్రాంతంలో రాజదాని ఏర్పాటైతే.. హాస్పటాలిటీ రంగం వర్ధిల్లుతుంది. ఈ రంగంలో కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పాటు అవుతాయి. అయితే ఇవన్నీ కూడా.. హోటల్ సర్వర్లు, అందులో పనిచేసే ఇతర ఉద్యోగాలు వంటి చిల్లర కొలువులే. ఈ హాస్పిటాలిటీ రంగమే ఉద్యోగావకాశాలు అని చెప్పేట్లయితే అది కేవలం ప్రజలను వంచించడమే. కొత్త పరిశ్రమలు తీసుకురాకుండా.. రాజధాని వల్ల ఉద్యోగాలు వొస్తాయని వైసీపీ అనడం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే అని పలువురు విశ్లేషిస్తున్నారు.