అధికారం తమను రక్షణ కవచంలా కాపాడుతోందని, గొడుగులా నీడ ఇస్తోందని తమ పాపం ఎప్పటికీ పండదని విర్రవీగుతున్న వారు ఉలికిపడవలసిన తీర్పు ఇది. ఈ తీర్పు వలన శిక్ష పడడంలో జాప్యం కొంత జరగవచ్చు గానీ.. హంతకులకు అరదండాలు పడడం మాత్రం పక్కా! వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్యచేసిన నిందితులు ఇక స్థిమితంగా ఉండలేరు. ఎందుకంటే.. కేసు విచారణను కడప కోర్టు నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఏ కడపలో అయితే.. అణువణువునా గాలి తాము చెప్పినట్లే వీస్తుందని, పిట్టలు తాము చెప్పినప్పుడే ఎగురుతాయని నిందితులు విర్రీవగుతూ ఉంటారో.. ఏ కడపలో అయితే సాక్షులు చిలకల్లాగా తాము నేర్పిన పలుకులు మాత్రమే పలుకుతారో.. సీబీఐ ఎదుట ఒక మాట చెప్పి, కోర్టులోకి వచ్చి ‘తూచ్ అదంతా మేం చెప్పింది కాదు’ అంటూ తమ మాట మీరకుండా, మాట మారుస్తారో… ఏ కడపలో అయితే దర్యాప్తు సాగిస్తున్న సీబీఐ అధికారిని సైతం ‘చంపగలం’ అనే బెదిరింపు ధమ్కీ ఇచ్చి తాము ఆ దర్యాప్తు దూకుడుకు బ్రేకులు వేయగలమో.. ఆ కడపలో వివేకానందరెడ్డి హత్య కేసు ఇక విచారణ జరగబోవడం లేదు. ఇప్పటిదాకా విచారిస్తున్న కడపలోని సీబీఐ ప్రత్యేక కోర్టునుంచి, నిష్పాక్షిక విచారణకు అవకాశం కల్పించడానికి సుప్రీం ధర్మాసనం దీనిని తెలంగాణకు బదిలీచేసింది. వివేకానందరెడ్డి భార్య, కూతురు విజ్ఞప్తి మేరకు సుప్రీం ఈ నిర్ణయం తీసుకుంది.
వివేకానందరెడ్డిని గంగిరెడ్డి, శివశంకరరెడ్డి తదితరులు కలిసి హత్య చేయించారని.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ హత్యకు ప్రధాన సూత్రధారి అని తొలినాటినుంచి వినిపిస్తున్న ఆరోపణ. కడప జిల్లాలను కంటిచూపుతో శాసించగల వైఎస్ఆర్ అంతటి నాయకుడికి తమ్ముడు వివేకానందరెడ్డినే ఆయన సొంత ఇంటిలో గొడ్డలితో నరికి హత్య చేశారంటే.. వారెంతటి కరుడుగట్టిన నేరగాళ్లో అర్థమవుతుంది. తీరిగ్గా రక్తపు మరకలు కడిగేసి, ఇల్లు శుభ్రం చేసి ఆ తర్వాత పోలీసులను పిలిచి, మొత్తానికి గుండెపోటుతో చనిపోయాడని బయటకు చెప్పారంటే వారెంతటి ప్లాన్ తో ఉన్నారో కూడా అర్థమవుతుంది. అదేమీ క్షణికావేశంలో జరిగినది కాదు, ప్లాన్డ్ గా చేశారు. అయితే ఎంపీ అవినాష్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారనేది సర్వత్రా వినిపిస్తున్న ఆరోపణ. ఈకేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి నిందితులతో తన సంబంధాన్ని దాచుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం విశేషం. కోర్టు విచారణ సమయాల్లో ఆయన కోర్టు వద్దకు వచ్చి అక్కడ సాక్షులతో మాట్లాడడం హల్ చల్ చేయడం కూడా చేశాం. కడపజిల్లాలో లోకల్ ఎంపీ తన మందీ మార్బలంతో కోర్టు వద్దకు వచ్చి బీభత్సం సృష్టిస్తూ ఉంటే.. ఏ సాక్షులు మాత్రం ఎలా నోరు విప్పగలరు. నిజాలను ఎలా చెప్పగలరు?
కానీ, సుప్రీం తీర్పు ద్వారా ఇప్పుడు నిజాలు వెలికి వచ్చే అకాశం ఉంది. వివేకా హత్యకు సంబంధించిన సమస్త వివరాలుర, చార్జిషీట్లు , సప్లిమెంటరీ చార్జిషీట్లు అన్నీ తెలంగాణకు తక్షణం పంపాలని సుప్రీం చెప్పింది. కొత్తగా తెలంగాణలో ఏర్పాటు కాబోయే కోర్టు.. మళ్లీ అన్నీ వినాల్సి రావొచ్చు. దీనివలన విచారణలో కొంత జాప్యం జరుగుతుంది. కానీ.. వివేకాను హత్య చేసిన వాళ్లు చట్టంనుంచి తప్పించుకోలేరు. వారికి, వారి వెనుక నుంచి హత్య చేయించిన వారికి, హంతకులను కాపాడడమే పరమోన్నత కర్తవ్యంగా తరించినపోతున్న వారికి శిక్షలు తప్పకుండా పడతాయి.
కానూన్ కా హాథ్ బహుత్ లంబా హై..!