గ్రామాల్లో ఇన్నాళ్లూ ఒక రకమైన సెటప్ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. కేవలం పార్టీ నాయకుల సిఫారసులతో.. పార్టీకి అనుకూలమైనవ్యక్తులను, పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా ప్రభుత్వోద్యోగాల్లోకి తీసుకున్నారు. గ్రామంలో ప్రతి యాభై ఇళ్లకు అనుసంధానంగా ఒక వాలంటీరు పనిచేస్తారు. ఆ ఇళ్లకు అందే సమస్త ప్రభుత్వ పథకాల బాధ్యతను వారే చూస్తుంటారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య కిందిస్థాయిలో అనుసంధాన బాధ్యతను వారు నిర్వహిస్తుంటారు.
ఈ వాలంటీర్ల వ్యవస్థలోకి ప్రభుత్వం ఇచ్చే వేతనాలతో 2.6 లక్షల మంది పార్టీ కార్యకర్తలను చొరబెట్టారు. రేషన్ ఇచ్చినా, పెన్షన్లు ఇచ్చినా వీరిద్వారా ఇంటింటికీ క్యాష్ రూపంలో పంపుతూ.. జగన్ గురించి వారితో భజన చేయిస్తూ, జగన్ ప్రభుత్వం లేకపోతే ఈ పెన్షన్లు రావు అని ప్రజలను భయపెడుతూ రకరకాలుగా వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ అనుకూల వైఖరిని ప్రజల్లోకి బలవంతంగా చొప్పించడానికి వాడుకుంటున్నారు. ఈ క్రమంలో పెన్షన్లు అందించడం తదితర వ్యవహారాల్లో వాలంటీర్లు తమ చేతివాటం ప్రదర్శించడం కూడా మామూలు విషయం అయిపోయింది. ప్రతి పెన్షనులో కొంత ముడుపు పుచ్చుకుని అందిస్తున్నారు. ఉచితంగా వచ్చే డబ్బులే గనుక.. జనం ఎంతో కొంత వారికి ఇవ్వడానికి మొహమాటపడడం లేదు.
అయితే ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద ఇంకో పార్టీ యంత్రాంగాన్ని ఇప్పుడు జగన్ రెడీ చేస్తున్నారు. వాలంటీర్లు ఇన్నాళ్లుగా ప్రభుత్వ జీతం తీసుకుంటున్నప్పటికీ చేస్తున్నది పార్టీ పనే. అయినా వారికి చెక్ పాయింట్ అన్నట్టుగా పార్టీ తరఫున గృహసారథులు అనే వ్యవస్థను తీసుకువస్తున్నారు. ప్రతి యాభై ఇళ్లకు అంటే ఒక్కో వాలంటీరు పరిధిలో పార్టీ తరఫున ఒక మగ, ఒక ఆడ కార్యకర్త ఈ హోదాతో ఉంటారు. వారు అన్ని ఇళ్లవారితోనూ అనుబంధం కొనసాగిస్తూ వారికి ప్రభుత్వ పరంగా ఏం కావాలో తెలుసుకుంటూ.. వాలంటీర్ల ద్వారా ఆ పని ప్రభుత్వంలో జరిగేలా పనిచేస్తుంటారు. వాలంటీర్లను ఎన్నికల సమయంలో పార్టీకి అడ్డగోలుగా వాడుకోవడానికి కుదురుతుందో లేదో అనే భయంతో జగన్ అదే లెవెల్లో గృహసారథుల ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వీళ్లు వాలంటీర్ల మీద పెత్తనం చేస్తూ జనంతో టచ్ లో ఉంటారన్నమాట. వీరు పూర్తిగా పార్టీ కార్యకర్తలు. పార్టీ వీరికి బీమా చేయిస్తుంది. వీరి దెబ్బకు వాలంటీర్ల ఆమ్యామ్యా యవ్వారాలకు కూడా గండిపడుతుంది. వాలంటీర్లు క్షేత్రస్థాయిలో జనం మీద పెత్తనం చేసే వారుగా ఇన్నాళ్లూ నడుస్తోంది. ఇప్పుడు వారి మీద పెత్తనం చేయడానికి గృహసారథులు వస్తున్నారు. జగన్ లేకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయి.. మీకు పెన్షన్లు రావు అని నిత్యం ప్రతి లబ్ధి దారుడినీ బెదిరించడానికి, భయపెట్టి తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి ఒక్క వాలంటీరు వ్యవస్థ చాలడం లేదని.. అదనంగా ఈ వ్యవస్థను జగన్ తెచ్చినట్టుగా కనిపిస్తోంది.