జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగుదేశానికి చెందిన అనేక మంది నాయకుల మీద పర్సనల్ గా కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తూ వారి మీదకు ప్రభుత్వ విభాగాలను ఉసిగొల్పుతూ ఉంటుందనే సంగతి ఇప్పటికే బహుధా ప్రచారంలో ఉంది. తెలుగుదేశం నాయకులు దూకుడు మాట్లాడేవాళ్లుగానీ.. సోషల్ మీడియాలో నోరుజారే వాళ్లుగానీ అయితే.. వాళ్ల మీదకు సీఐడీని ఉసిగొల్పుతారు. అదే సమయంలో.. అలాంటి పనులేమీ చేయని వారైతే.. వారి ఆస్తులను దుర్భిణిలోంచి చూసి.. ఆ భవనాలను కూలగొట్టడానికి, మరో రకంగా చికాకు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా అనేకానేక సంఘటనలు ప్రతినిత్యం జరుగుతూనే ఉన్నాయి. s
అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్నపాత్రుడు, సబ్బం హరి, నారాయణ, దారపనేని నరేంద్ర .. ఇలా ఒకరూ ఇద్దరూ కాదు. తెలుగుదేశానికి చెందిన అనేక మంది నాయకులను టార్గెట్ చేసి మరీ.. వారిని ఏదో ఒకరకంగా వేధించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. తమ వేధింపుల జోన్ లోంచి హైకోర్టు తీర్పు ద్వారా తప్పించుకున్నందుకు మాజీ మంత్రి నారాయణపై సుప్రీం కోర్టుకు వెళ్లి భంగపడి వచ్చింది. వేధింపుల జోన్ లోకి అయ్యన్నపాత్రుడిని లాక్కు రావాలని ప్రయత్నించి, హైకోర్టు చొరవ వలన భంగపడింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
అయితే.. వైసీపీ సర్కారు వారికి టీడీపీలో నెక్ట్స్ టార్గెట్ ఎవరు? ఎవరిని టార్గెట్ చేసి.. తమ ప్రభుత్వ విభాగాలను ఉసిగొల్పడానికి ప్రభుత్వం ప్రస్తుతం ఆలోచిస్తున్నది అనే అంశం కూడా కీలకమైనది. ఈ కోణంలోంచి చూసినప్పుడు.. తెలుగుదేశానికి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది.
ఎందుకంటే.. ఆయన తాజాగా విశాఖ రుషికొండ ప్రాంతంలోని రేడియంట్ భూములకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి.. ఆ భూముల కబ్జా పర్వం ఏ రకంగా కొనసాగుతున్నదో లోతుగా వివరించారు. రేడియంట్ వారితో వీపీఆర్ సంస్థ తరఫు.. వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి చేసుకున్న అనుచిత ఒప్పందం గురించి వెల్లడించారు. వారి రహస్య ఒప్పందాలు బయటపెట్టారు. అయితే కేవలం వీపీఆర్ మీద నిందలు వేసినందుకు బండారు సత్యనారాయణమూర్తిను ప్రభుత్వం టార్గెట్ చేసేది కాదేమో. కానీ.. ఈ కుంభకోణంలోకి ఆయన, ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతిని కూడా లాక్కొచ్చారు. జగన్ భార్య భారతి, జగన్ సోదరుడు అనిల్ రెడ్డి జోక్యం చేసుకుని.. రేడింట్ భూముల కబ్జా పర్వం నడిపించారనేది ప్రధాన ఆరోపణ.
మొత్తం పార్టీ నాయకులందరినీ నిందించిన జగన్ పట్టించుకుంటారో లేదో గానీ.. తన భార్య విషయానికి వస్తే సీరియస్ అవుతారని పార్టీ నాయకులే అంటుంటారు. అలాంటి ఇప్పుడు బండారు సత్యనారాయణ మూర్తి.. భారతి ప్రమేయంతోనే రేడియంట్ భూముల వ్యవహారం చోటుచేసుకుందని అంటున్నారు. ఆయన టార్గెట్ గా ఏ రకంగా వేధించడానికి వీలవుతుందో ఇప్పుడు వైసీపీ పెద్దలు మార్గాలు వెతుకుంటారని ప్రజలు తలపోస్తున్నారు.