పైకి ఎంతటి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులలో ప్రజా వ్యతిరేకత అనే భయం దోబూచులాడుతోంది. వారు దానిని ఎంతగా దాచిపెట్టుకొనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అడపాదడపా మాటల సందర్భంలో బయటకు వచ్చేస్తోంది. మాజీ మంత్రులు మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా తమకు ప్రజా వ్యతిరేకత తప్పదనే భయాన్ని వ్యక్తం చేస్తూఉన్నారు. ప్రతిపక్షాలు కూడా గట్టిగా పని చేస్తుండడం, సంక్షేమం ముసుగులో జరుగుతున్న మోసాలను ఎండగడుతుండడం, ఎప్పటికప్పుడు ప్రజల కళ్ళు తెరిపిస్తుండడంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విపరీతంగా చేస్తున్న సంక్షేమ పథకాలు ఫలితం ఇస్తాయని.. ఆయనను 30 ఏళ్ల పాటు నిరాటంకంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతాయని ఆ పార్టీ నాయకులు పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాస్తవంలో పరిస్థితి అలా లేదని సంగతి వారికి స్పష్టంగానే అర్థమవుతోంది. గడపగడపకూ కార్యక్రమంలో ప్రతి ఇంటికీ తిరిగి తీరాల్సిందే అని ముఖ్యమంత్రి ఎంత ఘాటుగా చెబుతున్నా చాలామంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారంటే అసలు భయం ఈ వ్యతిరేకతే! వ్యతిరేకత గురించి నేరుగా ముఖ్యమంత్రికి నివేదిస్తే అది పార్టీ ఖాతాలోనో, ప్రభుత్వం ఖాతాలోనో కాకుండా.. తమ వ్యక్తిగత ఖాతాలో రికార్డు చేసి ఎక్కడ టికెట్ నిరాకరిస్తారో అనేది ఎమ్మెల్యేల భయం. అందుకే మారుమాట్లాడకుండా ఉంటున్నారు. గడపగడపకు కార్యక్రమంలో వ్యక్తమయ్యే ప్రజావ్యతిరేకతను మీడియా చాటుతోంటే అదంతా కుట్రపూరితంగా చేస్తున్న ప్రచారమని ద్వేష వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి మాటలతో ఎంత కాలం వాస్తవాన్ని కప్పిపెడతారు. వారి మాటల్లోనే ప్రజావ్యతిరేకత అనేక సందర్భాల్లో బయటపడుతోంది.
ఒకవైపు మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రజలకు సంక్షేమం అంటే ఏమిటో అర్థం కావడం లేదని, అందుకే ఎంతటి సంక్షేమ పథకాలు చేపడుతున్నప్పటికీ ప్రజలలో వ్యతిరేకత వస్తోందని వ్యాఖ్యానించడం విశేషం. ఇక్కడ ఎంతో మేధావి అయిన సదరు మంత్రిగారు, తెలుసుకోవాల్సిన అసలు సంగతి ఏమిటంటే ప్రజలకే అర్థం కాని సంక్షేమాన్ని ప్రభుత్వం చేపట్టడం ఎందుకు? ఎవరి లబ్ధి కోసం అలాంటి సంక్షేమాన్ని అమలు చేయాలి? ఇప్పుడు సంధి యుగంలో ఉన్నామని ఈ సంక్షేమం ప్రజలకు అర్థమయ్యే నాటికి వ్యతిరేకత తొలగిపోతుందని ధర్మాన ప్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈలోగా జగన్ సర్కారు కూలిపోవడం మాత్రం గ్యారెంటీ అనే సంగతి ఆయన గుర్తించడం లేదు.
అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో తమ పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్నదీ అంటే అది కేవలం అధికారుల వల్లనే అని నెపం వాళ్ళ మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీలోని అందరూ దానికి పూచీ తమది కాదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఆ వ్యతిరేకతను తగ్గించుకోవడం ఎలాగా అనే కసరత్తు జరగడం లేదు. ధర్మాన లాంటి వాళ్ళు ప్రజలకు తెలివితేటలు, అవగాహన సామర్ధ్యం లేదని అంటారు. అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి లాంటివాళ్ళు అధికారుల మీద నెట్టేసి చోద్యం చూస్తారు. కానీ అంతిమంగా దెబ్బ పడేది మాత్రం ప్రభుత్వానికి! సరైన చర్యలు తీసుకోకుండా గుడ్డిగా ముందుకు పోయిందంటే ఈ వ్యతిరేకత ధాటికి తాళలేక ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం అని ప్రజలు అంచనా వేస్తున్నారు.