పసుపురంగు కనపడగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కాళ్లు వణుకుతున్నాయా? జ్వరం వస్తోందా? డాక్టర్ను ఆశ్రయించాలనే అనిపిస్తుందా? లేదా, పోలీసులను ఆశ్రయిస్తే చాలునని ధైర్యం చిక్కబడుతెోందా? ప్రజలకు అర్థం కావడం లేదు! ఎందుకంటే ప్రైవేటు కార్యక్రమాలను నిర్వహించుకునే సందర్భాలలో కూడా పసుపు రంగు కనిపిస్తే చాలు వారు జడుసుకుంటున్నారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కేవలం పసుపు రంగు మాత్రమే కాదు, నందమూరి తారక రాముని బొమ్మ కనిపించినా కూడా వైసిపి నాయకుల్లో, ప్రభుత్వంలో జ్వరం మొదలవుతుంది.
ఇంతకు విషయం ఏమిటంటే ప్రకాశం జిల్లా సంగమేశ్వరంలో తెలుగుదేశం పార్టీ కార్తీక మాసం సందర్భంగా వనభోజనాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అదేమీ బహిరంగ సభకాదు. కార్తీకమాసంలో పార్టీలు, కుల సంఘాలు, మిత్రుల బృందాలు, వీలైనన్ని సమూహాలుగా వనభోజనాల కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం కలివిడిగా మెలగడం అనేది అత్యంత సాధారణమైన విషయం అదే మాదిరిగా.. చాలా రోజుల ముందుగానే అనుమతులు అన్నీ తీసుకుని తెలుగుదేశం పార్టీ ఈ కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని సంగమేశ్వరం ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసింది. అయితే ఆ రోజు నుంచి కూడా వైసీపీ నాయకులకు తెలుగుదేశం వారికి మధ్య ఈ వ్యవహారంలో మాటల యుద్ధం నడుస్తోంది. ఆలయం వద్ద పార్టీ కార్యక్రమం నిర్వహించనే కూడదు అంటూ వైసీపీ వారు రకరకాలుగా చిందులు తొక్కుతూ వచ్చారు.
తీరా కార్యక్రమం నిర్వహించే నాటికి వైసిపి దళాలు తెలుగుదేశం వారు అక్కడికి రాకుండానే అడ్డుకునే ప్రయత్నం చేశాయి. వారికి పోలీసుల అండ తోడు నీడ ఎటు ఉండనే ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి తదితర అనేకమంది తెలుగుదేశం నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ స్థానిక ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు తదితరులు తమ అనుచరులతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వీరి మధ్య వాగ్వాదాలు, ఘర్షణాత్మక వాతావరణం నేపథ్యంలోనే కార్యక్రమం ఏదోగా జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలు వేలాదిగా హాజరవ్వడంతో అడ్డుకునే వారు ఏమీ చేయలేకపోయారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే, పోలీసుల అతి ఇంకొక ఎత్తు. ముందే అనుమతులు తీసుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం వేదిక వద్ద ఎన్టీఆర్ మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. వాటిని కూడా పోలీసులు తొలగించారు. అవి తాత్కాలిక విగ్రహాలేనని, కార్యక్రమం కోసం పెట్టినవని తెలుగుదేశం నాయకులు ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా ఆ రెండు విగ్రహాలను పోలీసులు తొలగించడం గమనార్హం. ‘పోలీసుల అతి’ అనేది కేవలం విగ్రహాలతో ఆగలేదు కార్యక్రమం వేదిక వద్ద పసుపు రంగు కర్టెన్ కట్టి ఉంటే, ఆ కర్టను కూడా పోలీసులు తొలగించారు. వాళ్ళ దూకుడు గమనిస్తుంటే పసుపు రంగు కనిపిస్తేనే ప్రభుత్వానికి గానీ పోలీసులకు కానీ వెన్నుల్లో వణుకు మొదలవుతుందా అనే అభిప్రాయం కలుగుతుంది. పోలీసులు ఇలాంటి అతిశయమైన చేష్టలు ప్రభుత్వానికి పరువు తీస్తుంటాయి. అలాగే ప్రతిపక్షం తెలుగుదేశానికి ప్రజలలో గౌరవాన్ని పెంచుతూ ఉంటాయి. తమ చేతిలో అధికారం ఉన్నది కదా అని బలవంతంగా ఎంతగా తొక్కేయడానికి ప్రయత్నిస్తే ప్రజలు అంతగా ఆదరిస్తుంటారు.. అనేది పాలకులు తెలుసుకోవాలి!!