వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మధనం జరుగుతోంది. ‘తాము తప్పు చేస్తున్నాం’ అనే భావన మాత్రమే కాదు, తప్పులు చేయడంలో హద్దు, అదుపు ఏమీ లేకుండా వ్యవహరించడం వలన.. తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నాం అని కూడా ఆ పార్టీ సీనియర్ నాయకులు భయపడుతున్నారు. బుర్ర తక్కువగా ఉంటూ, తమ పార్టీ, ప్రభుత్వం ఏ పని చేసినా సరే అడ్డగోలుగా దానిని సమర్ధించుకుంటూ ఉండే అణాకానీ నాయకులకు ఇలాంటి భావన లేదు గానీ, కాస్త ఆలోచన ఉండే సీనియర్లు మాత్రం అంతర్మధనానికి గురవుతున్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు.. ప్రదర్శిస్తున్న దూకుడు కలిపి తమ పార్టీకి చేటు చేయకుండా వదలవు అనే భావన వారిని వెంటాడుతోంది!
రాజకీయంగా తమ విపక్ష పార్టీలకు చెందిన నేతలను వేధిస్తూ ఉంటే.. అరెస్టు చేసి వెంటాడుతూ ఉంటే.. అందరి మీద కేసులు పెట్టి జైలు పాల్జేస్తూ ఉంటే.. నిజానికి వైసీపీ నాయకులు ఒక దశ వరకు అలాంటి శాడిజాన్ని ఎంజాయ్ చేశారు. కానీ.. నెమ్మదిగా శాడిజం అనేది ప్రత్యర్థి పార్టీ నాయకుల మీదినుంచి ప్రజల మీదకు కూడా మళ్లుతుండేసరికి వారికి భయం వేస్తోంది. ఇప్పటం గ్రామంలో కూల్చివేతలు అనేది ఆ పార్టీ నాయకులకే జీర్ణం కావడం లేదు.
ఒకవైపు తమ వేధింపులు ఎదుర్కొంటున్న తెలుగుదేశం, జనసేన నాయకులకు ప్రజల్లో ఆదరణ, మైలేజీ పెరుగుతోంది. పవన్ కల్యాణ్ ను విశాఖలో నిర్బంధిస్తే.. ఆ తర్వాత ఆయనకు ఎంతటి ప్రజాస్పందన పెరిగిందో వారు ప్రత్యక్షంగా గమనించారు. అలాగే.. అయ్యన్నను చాలా అసహ్యకరమైన రీతిలో అరెస్టుచేసిన తర్వాత వారికి ఇంకా భయం మొదలైంది. రిమాండుకు పంపడానికి కూడా అవకాశం లేనంత చెత్త కేసులను పెట్టించి.. అరెస్టులు తప్ప వేరే జీవితాశయమే లేనట్టుగా వ్యవహరిస్తున్న తీరు సొంత పార్టీ వారికి కూడా మింగుడుపడడం లేదు. సాయంత్రానికి కోర్టు కూడా ఇంటికి పంపేసిన అయ్యన్న పాత్రుడుకు కూడా ఇతర పార్టీల వారినుంచి కూడా మద్దతు వెల్లువెత్తింది. ఈ అరెస్టులతో తాము కక్ష తీర్చుకుంటూ ఉండవచ్చు గానీ.. ప్రత్యర్థి పార్టీ నాయకుల హీరోయిజాన్ని మరింతగా పెంచిపోషిస్తున్నామనే భయం వైసీపీ సీనియర్లలో ఏర్పడుతోంది.
ఇప్పటం విషయంలో పార్టీచేసిన దాన్ని ప్రెవేటు సంభాషణల్లో వారే ఖండిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని వేధించినంత కాలమూ.. ప్రజలు కూడా ఆ శాడిజాన్ని పట్టించుకోరని.. కానీ ప్రజల జోలికే వెళితే, ప్రజలనే టార్గెట్ చేస్తే.. ప్రజల స్పందన ఇంకో తీరుగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఎంతగా అంతర్మధనం చెందినా, తాము చేస్తున్నది తప్పు అని గుర్తించినా.. అధినేతకు చెప్పే అంతటి వారు ఎవ్వరూ లేరు. అదే తమ పార్టీకి పెద్ద మైనస్ అని కూడా అనుకుంటున్నారు.