విశాఖను రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర మొత్తం గంపగుత్తగా అభివృద్ధి చెందిపోతుందని వైసీపీ నాయకులు అంటూ ఉంటారు. బహుశా ఇంతకు మించిన రెండు నాల్కల మాట మరొకటి ఉండకపోవచ్చు. ఎందుకంటే.. అమరావతిలో రాజధాని నిర్మిస్తే మాత్రం.. కేవలం 29 గ్రామాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయని సెలవిచ్చే ఈ నాయకులు.. అదే విశాఖలో పెడితే మాత్రం.. యావత్ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఎలా నమ్మబలుకుతారో అర్థం కాదు. అదంతా ఒక ఎత్తు అయితే.. రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా.. విశాఖలోనే రాజధాని అంటూ నమ్మబలికే మాటలతో వైసీపీ నాయకులు పదేపదే ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తుండడం విశేషం.
వారికి తోచినప్పుడెల్లా.. విజయదశమి నుంచి విశాఖ రాజధాని, దీపావళి నుంచి ఇదే రాజధాని.. అంటూ రకరకాల ప్రచారాలను ప్రజల్లోకి వదులుతుంటారు. అక్కడికేదో ఉత్తరాంధ్రప్రజలను ఉద్ధరించేస్తున్నట్టుగా చెబుతుంటారు. ఉత్తరాంధ్ర నిరసన స్వరాల పేరిట ధర్మాన ప్రసాదరావు లాంటి మేధావులు.. చాలా చాలా శ్రమ తీసుకుని కార్యక్రమాలు నిర్వహించినా.. రాజీనామాలు కూడా చేసేస్తాం అని బెదిరించినా ప్రజలు ఖాతరు చేయలేదు. నిజానికి రాజధానికి 500 ఎకరాలు చాలుకదా అనే చెప్పే నాయకులు.. ఆ 500 ఎకరాల్లో భవనాలు కడతారు తప్ప.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతా అభివృద్ధి ఎలా వస్తుంది.. అనే సంగతి ప్రజలకు తెలుసు. కేవలం రియల్ ఎస్టేట్ దందాను విశాఖలో తమ ఇష్టరాజ్యంగా నడిపించుకోవడానికే ఈ మాటెత్తుతున్నారని కూడా ఉత్తరాంధ్రప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అయితే.. వైసీపీ నాయకులు మాత్రం చాలా తరచుగా.. అదిగదిగో అయిపోయింది.. అప్పటినుంచే విశాఖనుంచి పాలన అంటూ లీకులు వదలడం చాలా సాధారణంగా జరుగుతోంది.
తాజాగా ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ కూడా ఇలాంటి లీకులు వదిలారు. దసరా, దీపావళి అయిపోయాయి.. ముందుముందు క్రిస్ మస్, సంక్రాంతి ఉన్నాయి.. అయినా ధర్మశ్రీ మాత్రం ఓ అడుగు ముందుకు వేసి.. మార్చి నెల నుంచి విశాఖ రాజధానిగా ప్రభుత్వ కార్యకలాపాలు మొదలువతాయని సెలవివ్వడం విశేషం.
ప్రభుత్వంలో నిర్ణయాత్మక శక్తి ఎవరో వారు మాత్రం విశాఖ రాజధాని గురించి పెదవి విప్పరు. మౌనంగా తాను చేయదలచుకుంది చేసుకుంటూ పోతారు. వందిమాగధులు మాత్రం పదేపదే విశాఖనుంచి రాజధాని.. నేడే విడుదల, ఎల్లుండి విడుదల అంటూ హడావుడి చేస్తుంటారు.
అయితే వైసీపీ నాయకులు ఇలాంటి ప్రకటనలు చేయడం అనేది పూర్తిగా వారి వారి వ్యక్తిగత ఆసక్తులు ఉన్న రియల్ ఎస్టేట్ దందాలతో ముడిపడి ఉన్న వ్యవహారం అని ప్రజలు అంటున్నారు. వైసీపీ నాయకులంతా విశాఖలో రియల్ ఎస్టేట్ చేయడానికి భూములు కొన్నారని.. కోర్టు తీర్పు తర్వాత.. ఇక రాజధాని వచ్చే అవకాశం లేదని.. వచ్చినంత లాభాలకు అమ్మేయాలని అనుకుంటున్నారని సమాచారం. ఆ నేపథ్యంలో విశాఖలో భూమి ధరలు కాస్త డ్రాప్ అయినప్పుడెల్లా.. ప్రభుత్వం నుంచి ఎవరో ఒక నాయకుడితో.. అదిగదిగో రాజధాని వచ్చేస్తోంది.. అని ప్రకటన చేయించడం.. దానిని చూపించి.. అయినంత ధరలు పెంచేసి, అమ్మేసి చేతులు దులుపుకోవడం అనేది వాళ్ల అలవాటుగా సాగుతోందని ప్రజలు భావిస్తున్నారు.
తమ రియల్ దందాల కోసం.. మాటిమాటికి రాజధాని ఊసు ఎత్తుతూ.. ఉత్తరాంధ్ర ప్రజలను వైసీపీ నాయకులు ఈ రకంగా కూడా వంచిస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.