ఉన్నవి కూల్చడం..
లేనివి కట్టడం..
ఇదే ప్రస్తుత ప్రభుత్వం పాలన సిద్ధాంతం.!!
ఇంతకీ ఉన్నవి కూల్చడం అంటే ఏంటో ప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల ఇళ్లు కనిపిస్తే చాలు.. అడ్డగోలుగా వాటిని కూల్చేయడమే. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, వారి తప్పులను ఎత్తిచూపించిన టీడీపీ నాయకుల ఇళ్ల మీదకు అర్ధరాత్రి జేసీబీలను పంపడమే. జనసేన రాజకీయ సభ పెట్టుకోవడానికి సహకరిస్తే చాలు.. పేదలగుడిసెలను కూడా కూల్చేయడమే.. రాజనీతి!వైఎస్సార్ కాంగ్రెస్ సమాధి రాజకీయం!
మరి, ‘‘లేనివి కట్టడం’’ అంటే..!
సమాధులు కట్టడం. రాజకీయాల్లో నైతిక విలువలకు సమాధులు కట్టడం. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధ విధానాలకు సమాధి కట్టడం. మంచితనానికి సమాధి కట్టడం. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారికి సమాధి కట్టడం. ప్రభుత్వాన్ని కాదు.. ఆ పార్టీ ఛోటామోటా నాయకులకు గిట్టని వారికి కూడా సజీవంగానే సమాధి కట్టేయడం వారి వైఖరిగా మారిపోతున్నది!
తాజాగా ఉత్తరాంధ్రలో జరిగిన దుర్ఘటన విస్తుగొలిపేలా ఉంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం గ్రామంలో ఇద్దరు మహిళలను, న్యాయం కోసం పోరాడుతున్న తల్లీకూతుళ్లను సజీవంగా సమాధి చేయడానికి ప్రయత్నం జరిగింది. ఇందుకు తెగించిన వారు ఒక ఛోటా వైసీపీ నాయకుడి కుటుంబం. వైసీపీ అనే ముద్ర ఉంటే చాలు.. తమను ఎవ్వరూ ఏమీ చేయలేరని బరితెగించి.. పట్టపగలు.. అందరూ చూస్తుండగానే.. న్యాయం అడుగుతున్న ఇద్దరు మహిళలను సజీవంగానే సమాధిం చేయడానికి సాహసిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
హరిపురంలో దాలమ్మ భర్త నారాయణ మరణించాడు. భర్త కటుంబానికి చెందిన ఆస్తిలో ఆయన సోదరులతో సమానంగా తమ కుటుంబానికి వాటా దక్కాలని దాలమ్మ, ఆమె కుమార్తె 2019 నుంచి పోరాడుతున్నారు. దాలమ్మ మరుదుల కుమారులు కొట్ర రామారావు, ఆనందరావు, ప్రకాశరావు.. వారికి వాటా ఇవ్వకుండా అడ్డుతున్నారు. అయితే తమకు వాటా ఉన్న స్థలంలో వారు నిర్మాణం ప్రారంభిస్తే తల్లీకూతుళ్లు వెళ్లి నిలదీశారు. నేలపై బైఠాయించారు. అలా కూర్చున్న వారిపై ట్రాక్టరుతో మట్టిపోసి కప్పెట్టించేయడానికి ప్రయత్నించారు. తమ మీదనే ట్రాక్టరు మట్టి అన్ లోడ్ కావడంతో.. తల్లీకూతుళ్లు దాదాపుగా సమాధి అయ్యారు. ఈలోగా.. ఇదంతా చూస్తున్న స్థానిక యువకులు మట్టిలోంచి వారిని బయటకు తీసి కాపాడారు. వైసీపీ కార్యకర్త అయితే చాలు.. ఎదిరిస్తే, న్యాయం అడిగితే సమాధి కట్టేస్తాం అని హెచ్చరించే వైఖరికి ఇది నిదర్శనంగా కనిపిస్తోంది.
వైసీపీ మంత్రి పాత్ర ఎంత?
మంత్రి సీదిరి అప్పలరాజుకు ఈ సమాధి తెగింపు కలిగిఉన్న వైసీపీ నేత అనుచరుడు. గతంలో ఈ తల్లీకూతుళ్లు ఆస్తుల కోసం నిరాహార దీక్ష చేస్తే.. సదరు నాయకుడి తరఫున.. అప్పటి ఎమ్మెల్యే సీదిరి అప్పల రాజు జోక్యం చేసుకుని మీకు న్యాయం జరుగుతుందని మాట ఇచ్చి విరమింపజేశారు. ఆయన మంత్రి అయ్యాడు గానీ.. ఆ తల్లీకూతుళ్లకి న్యాయం జరగలేదు. వారిపట్ల దూకుడుగా ప్రవర్తించిన వాడు కాస్తా.. ఇప్పుడు సమాధి చేయడానికే తెగిస్తున్నాడు. ఇలాంటి వాడిని వైసీపీ మంత్రి ఇంకా కాపాడుతూ కూర్చుంటారో.. లేదా.. న్యాయం చేస్తారో చూడాలి.