వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి అనుచరులు ఎన్నికల పోలింగ్ నాడు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారో ప్రజలందరికీ తెలుసు. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పోలింగ్ ఏజెంట్ల మీద దాడులకు తెగబడుతూ ఓటర్లను భీతావహులను చేసి బెదరగొట్టేశారు. పోలీసులు మీద కూడా దాడులు చేశారు. పోలింగ్ నాడు జరిగిన హింసకు సంబంధించి వైసీపీ గూండాయిజం మీద ఇప్పటికీ పదుల సంఖ్యలో కేసులు పెండింగులో ఉన్నాయి. అయితే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కూడా ఇదే తరహా వ్యూహాన్ని అనుసరించడం ద్వారా తిమ్మిని బమ్మిని చేసైనా సరే ఎన్నికలలో నెగ్గుకు రావాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళాలు సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి.
చెదురుమదురు సంఘటనలే అయినప్పటికీ.. రాష్ట్రంలో పలుచోట్ల చిన్నచిన్న దాడులు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున పోలింగ్ ఏజంట్లుగా కూర్చున్న వారిమీద దాడులు జరుగుతున్నాయి. తలలు పగులుతున్నాయి. గాయాలు అవుతున్నాయి. అయితే పెద్దగీత పక్కన చిన్న గీత గీసిన చందంగా.. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి దాడుల వ్యవహారాల ఉధృతిలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న చాలా సంఘటనలు ప్రముఖంగా ప్రస్తావనకు రావడం లేదు. అయితే తెలుగుదేశం కీలక కార్యకర్తల మీద ఎడాపెడా దాడులు జరుగుతున్న మాట మాత్రం వాస్తవం.
ఇదే అధికార పార్టీ కౌంటింగ్ వ్యూహం అని ప్రజలు అనుమానిస్తున్నారు. తెలుగుదేశం కీలక కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే వారం రోజుల్లో దాడులను పెంచడం ద్వారా.. అసలు కార్యకర్తలు తెలుగుదేశం తరఫున కౌంటింగ్ కు రావాలంటేనే భయపడిపోయే వాతావరణం క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. తెలుగుదేశం ఏజంట్లు కౌంటింగ్ కు రావడానికే భయపడేలా చేయడం, వచ్చినా సరే కిక్కురుమనకుండా కూర్చుని ఉండడం అనే ఉభయ లక్ష్యాలతో ముందుగానే వారి మీద ఎడాపెడా దాడులు జరుగుతున్నట్టుగా అనుమానిస్తున్నారు. వైసీపీలో రాష్ట్రవ్యాప్తంగా ఓటమి భయం పుష్కలంగా ఉన్న నేపథ్యంలోనే.. ఇలా తెగించి తెలుగుదేశం వారిని భయపెట్టి కౌంటింగ్ నాడు అరాచకాలకు పాల్పడాలని అనుకుంటున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు.
కౌంటింగ్ కు వైసీపీ ప్రధాన వ్యూహం ఇదే !!
Tuesday, January 21, 2025