ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తాయి అనే వాతావరణం చాలా కాలంగా ప్రచారంలో ఉంది. అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ గాలికి కొట్టుకుపోయేలాగా, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని, అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం జనసేన శ్రేణులలో ఉన్న డోలాయమాన పరిస్థితి తొలగిపోయింది. ప్రతి చోట తాము కలసికట్టుగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేయడానికి వారు ఇప్పుడు ఉద్యుక్తులవుతున్నారు. కొన్ని నెలల తర్వాత జరిగే అవకాశం ఉన్న ఈ పొత్తు ప్రకటన, చంద్రబాబు నాయుడు అరెస్టు వలన ముందే బయటకు వచ్చింది.
ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల గురించిన ఆలోచన చాలా కాలం నుంచి ఉంది. అయితే వారి మధ్య సీట్ల పంపకానికి సంబంధించి ఒప్పందం కుదరలేదు ఏమోగానీ.. ఈ రెండు పార్టీల పొత్తు గురించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడ లేదు. జనసేన ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో పొత్తులలో ఉన్న నేపథ్యంలో.. తెలుగుదేశంతో కొత్త బంధానికి వారి ఒప్పుకోలు కూడా అవసరమైన పరిస్థితి! పైగా బిజెపి తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిసి ఎన్నికలలో పోటీ చేయాలనేది.. తద్వారా జగన్ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చేరడానికి అవకాశం లేకుండా చూడాలనేది పవన్ కళ్యాణ్ లక్ష్యం. ఈ నేపథ్యంలో బిజెపి నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అటు నుంచి నరుక్కు వస్తూ ఈ పొత్తులకు సంబంధించిన ప్రకటన రాకుండా అడ్డుపడుతూ వచ్చారని అనుమానాలు కూడా పలువురిలో ఉన్నాయి. అయితే ఈ సైంధవ ప్రయత్నాలు అన్నింటినీ తుంగలో తొక్కుతూ తాజాగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతున్నట్లుగా జనసేనాని పవన్ కళ్యాణ్ విస్పష్టంగా ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో సొంతంగా ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని పరిస్థితులలో.. తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసే వాతావరణం తమకు ఎంతో ప్రమాదకరం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉంది. ఆ ఇద్దరూ కలవకుండా ఉండేందుకు వైసిపి దళాలు రకరకాల కుయుక్తులు, మాయోపాయాలు పన్నుతూ వచ్చాయి. ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని అటు చంద్రబాబును ఇటు పవన్ కళ్యాణ్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పవన్ అంటే ప్యాకేజీ స్టార్ అని నిందలు వేయడం ద్వారా పొత్తులు కుదరకుండా చూసేందుకు వైసిపి దళాలు కూహకాలు చేశాయి. అయితే పవన్ కళ్యాణ్ సంయమనం ముందు ఈ చిల్లర ఎత్తుగడలు పనిచేయలేదు. చంద్రబాబు నాయుడును అత్యంత పైశాచికంగా అరెస్టు చేసి, అమానవీయమైన రీతిలో జైల్లో పెట్టి హింసిస్తున్న తీరుపట్ల క్రుద్ధుడైన పవన్ కళ్యాణ్.. ఆయనతో ములాఖత్ అయినా వెంటనే పొత్తు ప్రకటన చేశారు. తమ దూకుడు వలననే ఆ రెండు పార్టీల పొత్తు ప్రకటన ఇప్పుడే వచ్చింది అని వైసిపి నాయకులు కుమిలిపోతున్నారు. చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరుకు వైసిపి చెల్లిస్తున్న తొలి మూల్యం ఇది అని ప్రజలు భావిస్తున్నారు.