సొంతడబ్బా కొట్టుకోవడం అవసరమే. కానీ అది మరీ అతిగా ఉండకూడదు. ప్రజలకు, వింటున్న వారికి వెగటు పుట్టించకూడదు. కానీ ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు , అత్యంత నీచంగా వెగటుగా ధ్వనిస్తున్నాయి. జగన్ మేనమామ, కడప జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అయిన రవీంద్రనాధరెడ్డి మాటలను గమనించి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన చెబుతున్నది ఏంటంటే.. ‘‘గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ కనీసం నామినేషన్లు వేయగలిగారంటే.. అది కేవలం జగన్మోహన్ రెడ్డి దయపెట్టడం వల్లనేనట. జగన్ గనుక వారిని టార్గెట్ చేయాలని తలచుకుని ఉంటే.. వారు నామినేషన్లు కూడా వేసి ఉండేవారు కాదట’’! ఈ స్థాయిలో ఆయన ప్రగల్భాలను గమనించి.. జనం ఈసడించుకుంటున్నారు.
రవీంద్రనాధరెడ్డి.. తిరుమల వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన వెలుపలికి వచ్చి.. మీడియాతో మాట్లాడారు. మీడియాతో పూర్తిగా రాజకీయ విషయాలే మాట్లాడారు. బిఆర్ నాయుడు తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అయిన తర్వాత.. తిరుమలలో ఓ కొత్త నిబంధన పెట్టారు. రాజకీయ నాయకులు దర్శనానికి వచ్చిన ప్రతిసందర్భంలోనూ రాజకీయ నాన్సెన్సికల్ సంగతులు మాట్లాడడం అనేది చాలా పరిపాటి అయిపోయింది.
ఆ చండాలాన్ని కట్టడి చేయడానికి తిరుమలలో రాజకీయ కార్యకలాపాలు, భేటీలు, ప్రసంగాలు నిషేధం అని తితిదే బోర్డు తీర్మానించింది. అప్పటినుంచి చాలా స్ట్రిక్టుగా దీనిని అమలు చేస్తున్నారు. నాయకులు కూడా అందరూ ఈ మర్యాదను పాటిస్తున్నారు. గతంలో ఓ సందర్భంలో అంబటి రాంబాబు.. జగన్ మరియు నవరత్నాల స్టిక్కర్ ఉన్న చొక్కా ధరించి దైవదర్శనానికి వచ్చి ఒక వివాదం సృష్టించారు. ఇప్పుడు రవీంద్రనాధ రెడ్డి.. దర్శనానంతరం అచ్చంగా రాజకీయ బురద చల్లుడే తన పనిగా పెట్టుకున్నారు. కడపలో జరుగుతున్న జడ్పీటీసీ ఎన్నికల గురించి నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు కూడా పండడం లేదని, హామీలు నెరవేర్చలేదని, జగన్ ను మళ్లీ గెలిపించడానికి జనం డిసైడ్ అయిపోయారని నానా కారుకూతలు కూశారు.
అయితే వీటి మధ్యలో ట్విస్టు ఏంటంటే.. కడప ఎన్నికల్లో దారుణాలు జరుగుతున్నాయని.. తమను వేధిస్తున్నారని అంటూ.. వైఎస్ జగన్ గతంలో ఇలాగే అనుకుని ఉంటే చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ బయట తిరిగేవాళ్లేనా అని ప్రశ్నిస్తున్నారు. నామినేషన్లు కూడా వేసి ఉండేవారు కాదు అని చెబుతున్నారు. అక్కడికేదో సార్వత్రిక ఎన్నికలు కూడా జగన్ దయతోనే జరుగుతున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఎన్నికలప్పుడు.. పరిపాలన మొత్తం ఎన్నికల కమిషన్ ఆధీనంలోకి వస్తుందని, డీజీపీతో సహా మార్చేశారని కూడా ఈ మాజీ ఎమ్మెల్యేకు తెలిసినట్టు లేదు. ఇలాంటి చవకబారు మాటలతో జగన్ మేనమామ మాత్రమే కాదు, వైసీపీ నాయకులు కూడా తమ పార్టీ పరువు తామే తీసుకుంటున్నట్టుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.
