వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తరచుగా ప్రెస్మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుతూ ఉంటారు. అంతకంటె తరచుగా ట్వీట్లు చేస్తూ ఉంటారు. అరుదుగా మాత్రం మాత్రం యాత్రలు నిర్వహించి.. శాంతిభద్రతలను నాశనం చేయడానికి తన వంతు కృషి చేస్తుంటారు. జగన్ ఈ పనుల్లో బిజీగా ఉండగా.. ఆయన పార్టీలోని నాయకులందరూ కూడా.. ఆయన మాటలకు వంతపాడడంలో బిజీగా గడుపుతుంటారు.
వారికి కూడా స్పష్టమైన అంశాలే ఉంటాయి. జగనన్నకు భద్రత కల్పించడంలేదు. ఆయన యాత్రల్ని చూసి ప్రభుత్వం భయపడుతోంది.. ఇలాంటి సోదితప్ప వారికి ఇంకో ఎజెండా ఉండదు. జగన్ భజన, జగన్ గురించి ఆవేదన, జగన్ మీద సానుభూతి.. వైసీపీలో మిగిలి ఉన్న నాయకులకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్లే సూచనలు అవే! అక్కడనుంచి వచ్చిన స్క్రిప్టు ప్రకారం నాలుగుమూలలా ప్రెస్మీట్లు పెట్టడం వారికి అసైన్మెంటు అన్నమాట.
అయితే.. జగన్ చెబుతున్న పనులకు, పెడుతున్న సమావేశాలకు ఆ పార్టీలోని సీనియర్లు రావడం లేదని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంటున్నారు.
ప్రజలు తన పార్టీని అత్యంత దారుణంగా ఓడించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మీద కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని నల్లమిల్లి అంటున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని జగన్ కుట్రలు చేస్తున్నారని నల్లమిల్లి అంటున్నారు. లిక్కర్ కుంభకోణంలో జగన్ అరెస్టు కావడం కూడా ఖాయమని ఎమ్మెల్యే నల్లమిల్లి అనడం గమనించాల్సిన సంగతి.
ఈ కారణాల చేత ఆయన సూత్రీకరిస్తున్నది ఏంటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని.. అందుకే ఆ పార్టీ కార్యక్రమాల్లో సీనియర్లు పాల్గొనడం లేదని అంటున్నారు. గమనిస్తే నల్లమిల్లి మాటల్లోని ఆంతర్యం కూడా అర్థమవుతోంది. నిజంగానే.. చాలా మంది సీనియర్ నాయకులు ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. జగన్ స్క్రిప్టుల ప్రకారం మాట్లాడేవాళ్లు ఒక గుంపు మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలో ఏ ఇష్యూ తెరపైకి వచ్చినా.. ప్రతిసారీ మాట్లాడేది వారు మాత్రమే.
చాలా మంది సీనియర్ నాయకులు, నిజంగా తమ రాజకీయ భవిష్యత్తు స్థిరంగా ఉండాలని కోరుకునే వారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్న లేకపోయినా.. తమకు రాజకీయ జీవితం కోరుకునే వారు, వైసీపీ మీద జగన్ మీద పరాన్నభుక్కులుగా ఆధారపడిన వారు కాకుండా.. తమకంటూ స్వతంత్రధోరణి ఉన్నవాళ్లు ఎవ్వరూ కూడా అర్థంపర్థంలేకుండా జగన్ ఆదేశాలకు తలొగ్గడానికి ముందుకు రావడం లేదు. నిజం చెప్పాలంటే.. జగన్ కు కూడా వేరే గతిలేదు. పార్టీకి ఇంపార్టెంట్ అయిన నాయకులు సీనియర్లు తనను పట్టించుకోకపోయినా.. తన ఆదేశాల ప్రకారం.. కూటమిని తిట్టడానికి తరచూ మీడియా ముందుకు రాకపోయినా.. వారి జోలికి పోకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ ఈ పోకడ పార్టీలోని బలహీనతల్ని బయటపెడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
