వైసీపీ మంచి చేయదు.. కూటమిని చేయనివ్వదు!!

Thursday, December 4, 2025

గూగుల్ వంటి అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక సంస్థ తమ కార్యకలాపాలను ఏపీలో ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు ఎన్నెన్ని పాట్లు పడ్డారో ప్రజలకు, ఆ రంగంలోని నిపుణులకు తెలుసు. చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ పలు విడతలుగా గూగుల్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపి, మొత్తానికి విశాఖలో వారు కార్యాలయాలు ప్రారంభించేలా ఒప్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద డేటాసెంటర్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడంతో.. ఏకంగా 200 ఎకరాలు భూమిని అందించడానికి ప్రభుత్వం అంగీకరించింది కూడా.

ఇందుకోసం భూసమీకరణ ప్రారంభించినప్పుడు.. గతంలో కొన్ని గ్రామాల రైతుల నుంచి డిపట్టా భూములను కొనడానికి.. చట్టవ్యతిరేకమైన ఒప్పందాలు చేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రైతులతో చేసుకున్న అగ్రిమెంట్లు తమ వద్ద ఉన్నాయి గనుక.. అదే రైతులతో కోర్టుల్లో కేసులు వేయించడం ద్వారా.. గూగుల్ సంస్థకు భూసమీకరణ పూర్తికాకుండా వారు అడ్డుకుంటున్నారు. వీరి కుట్రలను గమనించిన ప్రజలు మాత్రం వైసీపీ విశాఖకు మేలు చేయదు.. కూటమి ప్రభుత్వం చేస్తుండగా చేయనివ్వదు.. అని ఈసడించుకుంటున్నారు.

విశాఖ పరిసరాల్లోని ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, భీమిలి మండలాల పరిధిలో గత జగన్ పాలన కాలంలో వైకాపా పెద్దలు, కొందరు ఐఎఎస్ అధికారులు.. తమ అరాచకాల ముద్ర చూపించారు. తమ బినామీలతో పెద్ద ఎత్తున నిరుపేదలు, దళితుల డిపట్టా భూములను కొనడానికి అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలోనే ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ కోసం 200 ఎకరాల భూములను సేకరించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

గూగుల్ సంస్థ గనుక.. విశాఖ కేంద్రంగా తమ సంస్థ కార్యకలాపాలను ప్రారంభిస్తే.. కూటమి ప్రభుత్వానికి దక్కగల మంచిపేరు గురించి.. వైసీపీ వర్గాల్లో , జగన్ దళాల్లో అప్పుడే వణుకు మొదలైంది. ఎటూ అక్కడి భూములతో తాము గతంలో ఒప్పందాలు చేసుకుని ఉన్నాం గనుక.. అక్కడి రైతులకు కొంత చెల్లించి ఉన్నాం గనుక.. రైతుల ద్వారానే మోకాలడ్డడానికి కుట్రలు ప్రారంభించారు.

నిజానికి వైసీపీనేతలు ఎకరా 7 లక్షలకు కొనేలా అగ్రిమెంటు చేసుకుని 3.5 లక్షలు మాత్రం చెల్లించి ఏడాదిన్నర దాటిపోయింది. వందరోజుల్లో కొనుగోలు పూర్తిచేస్తామని అగ్రిమెంట్లలో రాసుకున్నారు గానీ.. ఇప్పటిదాకా అతీగతీ లేదు. కానీ ఆ అగ్రిమెంట్లను అడ్డుపెట్టుకుని, ఇప్పుడు ప్రభుత్వం ఆ రైతులకు ఎకరాకు రూ.19.55 లక్షలు ఇవ్వజూపుతున్నప్పటికీ.. భూములు ఇవ్వబోం అంటూ.. కోర్టులో కేసులు వేయిస్తున్నారు. విశాఖ నగరానికి చేటు చేయడం మాత్రమే కాదు కదా.. ఆ డిపట్టా భూముల ఒరిజినల్ యజమానులు అయిన పేదలకు మంచి ధర కిట్టుబాటు అవుతోంటే కూడా.. అగ్రిమెంట్లను అడ్డుపెట్టుకుని. వైసీపీ నేతలు చెలరేగుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles