అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని.. అక్కడ భూములను త్యాగం చేసిన రైతులను వంచించడం కరెక్ట్ కాదని.. పేర్కొంటూ రైతులు అరసవెల్లి దాకా పాదయాత్ర చేయదలుచుకుంటే రకరకాల దుర్మార్గమైన చర్యలతో దానిని అడ్డుకొని ఆపివేయించారు. దానికి పోటీగానే అన్నట్లు అధికార వికేంద్రీకరణకు మూడు రాజధానులకు మద్దతుగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో సభలు కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు! అయితే ఒంగోలులో జరిగిన ఇలాంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రెండు రకాల బలహీనతల్ని బయటపెట్టింది. రెండు కారణాల చేత ఆ పార్టీ సిగ్గుపడవలసిన అవసరాన్ని కూడా ఈ ఒంగోలు సమావేశం తెలియజేబుతోంది.
ఒంగోలులో నిర్వహించిన అధికార వికేంద్రీకరణ మద్దతు సభకు ప్రధానంగా డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించారు. ఈ కార్యక్రమానికి హాజరు కాకపోతే ప్రభుత్వ పథకాలు అందవని డ్వాక్రా మహిళలకు రుణాలు రావని, ఏ రకమైన లబ్ధి ఉండదని బెదిరించి మరి వారిని బలవంతంగా రప్పించారు. ఫోన్లో ఇలాంటి బెదిరింపు సందేశాలతో మొత్తానికి జనాన్ని పోగేశారు. అయితే ఒత్తిడి మీద వచ్చిన డ్వాక్రా మహిళలు మంత్రుల ప్రసంగాలు మొదలవుతున్న దగ్గర నుంచే వెళ్ళిపోవడం ప్రారంభమైంది. వెళ్లిపోతున్న వారిని అడ్డుకుంటూ రిసోర్స్ పర్సన్స్ నానా కష్టాలు పడ్డారు. అంతో ఇంతో ఉన్న డ్వాక్రా మహిళలు కూడా వెళ్ళిపోతే సభ పేలవంగా తయారవుతుందని వారు భయపడ్డారు. ఇలా బలవంతంగా మహిళలను లాక్కొచ్చి అధికార వికేంద్రీకరణకు మద్దతు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజలను భ్రమ పెట్టడానికి చూస్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. ఇది మొదటి కారణం!
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఇన్చార్జి మంత్రి మేరుగు నాగార్జున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మేయర్ గంగాధర్ సుజాత, డిసిసిబి చైర్మన్ వెంకయ్య, కార్పొరేటర్లు ఇలాంటి వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇందరు మహానాయకులు పాల్గొన్న కార్యక్రమానికి స్వయంగా పార్టీ కార్యకర్తలని పోగు చేసే సత్తా వారికి లేకుండా పోయిందా? ఎంతో ప్రభావశీలమైన నాయకుడు బాలినేని, ఇన్చార్జి మంత్రి వస్తే కూడా కార్యకర్తలు రావడానికి దిక్కు లేకుండా పోయిందా? అందుకే బలవంతంగా డ్వాక్రా మహిళలను లాక్కునివస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక్కడ రెండు రకాల సంభావ్యతలు ఉన్నాయి! ఒకటి– అసలు ప్రకాశం జిల్లాలో మంత్రి వచ్చినా, బాలినేని వచ్చినా, మరొకరు వచ్చినా పార్టీ కార్యక్రమాలకు రావడానికి కార్యకర్తలు అభిమానులు సంఖ్య పూర్తిగా పల్చబడిపోయి ఉండాలి. రెండు– ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులలో, శ్రేణుల్లో అధికార వికేంద్రీకరణకి అనుకూల వైఖరి లేదు. అమరావతి రాజధానిని మాత్రమే వారు కోరుకుంటున్నారు.. అని అర్థం చేసుకోవాలి! ఇలా తమకు బలం లేకపోవడం అనేది వైసీపీ సిగ్గుపడవలసిన రెండో కారణం!!
తెలుగుజాతి ఒక మంచి రాజధానిగా, రాష్ట్ర ప్రతిష్ట పెంచే రాజధానిగా అమరావతిని కోరుకుంది. తమ స్వార్థం కోసం తమలోని ద్వేషాన్ని చల్లార్చుకోవడం కోసం బలవంతంగా అధికార వికేంద్రీకరణ పేరిట ఒక కుట్రపూరితమైన డ్రామాలను అధికార పార్టీ నడిపిస్తున్నారు. వారు ఎంతో బలమైన ప్రాంతంగా భావించే ప్రకాశం జిల్లాలోనే ఇంత తీసికట్టుగా కార్యక్రమాన్ని నిర్వహించడం చూసి ముఖ్యమంత్రి కనీసం తమ ఆలోచన మార్చుకోవాలి. ప్రజలకు మేలు చేయాలి. రాజధానిగా అమరావతిని నిలబెట్టాలి!