ఇప్పటికే ఎన్నికల సమరంలోకి దిగిన చంద్రబాబు నాయుడు ఏ ఊరిలో సభ పెట్టినా విపరీతమైన జన స్పందన లభిస్తోంది. ప్రతి చోటా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి పర్యటనలోనూ జగన్ ప్రభుత్వం పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత జనం వెల్లువ రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పూర్ రిజల్ట్ సాధించిన కర్నూలు జిల్లాలో కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పర్యటనలో వస్తున్న జనాన్ని గమనిస్తే తెలుగుదేశం నాయకుల్లో భవిష్యత్తు పట్ల ఆశలు పెరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడు కొత్తగా ఎత్తుకున్న నినాదం– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆ నినాదమే “లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి.”
దేశంలో అతి కొద్ది మంది రాజకీయ నాయకులకు మాత్రమే సొంతమైన సుదీర్ఘ పరిపాలన అనుభవం, రాజకీయ వ్యూహచాతుర్యం, కార్యకుశలత కలిగి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు! ఆయనలోని ఆ లక్షణాలను పార్టీ ఎమ్మెల్యేలు అందరూ నమ్మినందు వల్లనే ఆయన మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యారు. తన కార్య సమర్ధతను ప్రజల ఎదుట తిరుగులేని రీతిలో నిరూపించుకున్నందువల్లనే.. ఆయన మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గౌరవప్రదమైన దశకు, అభివృద్ధి స్థితికి తీసుకు వెళ్లడానికి తనకు ‘చిట్టచివరి అవకాశం ఇవ్వండి’ అని అభ్యర్థిస్తూ ఉండడం రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేస్తోంది. రాష్ట్రానికి స్పష్టమైన దశా దిశా నిర్దేశం కావాలంటే… చంద్రబాబు నాయుడు అడుగుతున్నట్లుగా ఆయనకు చిట్ట చివరి అవకాశం ఇచ్చి తీరాల్సిందే అనే అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు.
ఆయన వ్యతిరేకించే వారు ఎన్ని నిందలు వేసినప్పటికీ, బహిరంగంగా ఎలా మాట్లాడినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆధునిక అభివృద్ధిలో ఆయన ముద్ర తిరుగులేనిది అని కనీసం ప్రైవేటు సంభాషణల్లో ఒప్పుకుంటారు. హైదరాబాదు నగరం ఇవాళ ప్రపంచ పటంలో గణనీయమైన గుర్తింపును కలిగి ఉన్నదంటే ఆది చంద్రబాబు పుణ్యం అని ఎవరైనా ఒప్పుకుని తీరవలసిందే. అంతకు మించిన అభివృద్ధి బాటలను సరికొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తీర్చిదిద్దగలరనే నమ్మకంతోనే ప్రజలు 2014లో అధికారం అప్పగించారు. యావత్తు ప్రపంచము ఇటు తలతిప్పి చూసే ఒక అత్యద్భుతమైన రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానుకగా ఇవ్వాలని ఆయన సంకల్పం.. ప్రయత్న రూపంలో ఉండగానే అధికారం చేతులు మారింది. అధికార పార్టీ వాళ్లు అభివర్ణిస్తున్నట్లుగా ‘అద్భుత నగరం’ అనే స్వప్నాలను వారే సమాధుల్లాగా స్మశానం లాగా తయారు చేశారు. యావత్తు రాష్ట్రంలోని తెలుగు ప్రజల గుండెలను మండించిన వ్యవహారం ఇది.
అది మొదలుగా రాష్ట్రంలో పరిపాలన ఎంత ఘోరంగా దారితప్పిపోయిందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. దానికి తోడు రాష్ట్రానికి దిశా నిర్దేశం చేయడానికి ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అంటూ చంద్రబాబు నాయుడు ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ నినాదం రూపంలో ఆయన విజ్ఞప్తి ప్రజలను ఆలోచింపజేస్తోంది. కదిలిస్తోంది. ప్రజలు ఆలోచించే దశకు చేరుకోవడం తమకు ప్రమాదంగా భావించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. ఈ నినాదం వణుకు పుట్టిస్తోంది.