తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి గొడవ చేస్తే మూడు రాజధానులు వస్తాయా? ఆ మాత్రం వివేచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదా? చంద్రబాబు నాయుడు ఉన్న పార్టీ కార్యాలయం మీదికి దండయాత్ర లాగా వెళ్లి, నానా గొడవ చేసినంత మాత్రాన మూడు రాజధానులు వస్తాయని వారు ఎలా అనుకున్నారో తెలియదు కానీ.. కర్నూలులో వైసీపీ కార్యకర్తలు చేసిన రభసకు పోలీసులు సాక్షీభూతులుగా నిలవడం.. నిష్క్రియాపరత్వంతో చేతకాని వాళ్ళ లాగా చూస్తూ ఉండిపోవడం శోచనీయం.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అనేది ఒక ముగిసిపోయిన ఎపిసోడ్. హైకోర్టు ఇచ్చిన విస్పష్టమైన తీర్పుతోనే ఆ విషయం ఏనాడో తేలిపోయింది. తమకు చిత్తమొచ్చిన రీతిగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారి అవసరాలకు ప్రయోజనాలకు తగినట్లుగా రాజధానిని మార్చుకుంటూ పోతాం అంటే అది కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పుకు ముందే జడిసి రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న, మడమతిప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. త్వరలోనే మరింత పటిష్టమైన వికేంద్రీకరణ బిల్లు పెడతామని జనాంతికంగా ఒక మాట చెప్పి ఇప్పటిదాకా అతిగతి లేకుండా పట్టించుకోకుండా వదిలేశారు.
తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ.. వైసీపీ నాయకులు, మంత్రులు అడపాదడపా “త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన” అంటూ సోది ప్రకటనలు చేయడం తప్ప, మూడు రాజధానులు అనే ఆలోచన ఏనాడో మంటగలిసిపోయింది. వాస్తవం ఇది కాగా, చంద్రబాబు నాయుడు ఉన్న చోటికి వైసిపి నాయకులు వచ్చి తమకు మూడు రాజధానులు కావాలంటూ నానా రభస చేసినంత మాత్రాలను ఏం ఒరుగుతుంది?
కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు చేసిన రచ్చ చూస్తుంటే వారి అంతరంగం చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. వైసీపీ నాయకులకు మూడు రాజధానులు గాని, రాష్ట్ర అభివృద్ధి గాని, సంక్షేమంగానీ ఏదీ అక్కర్లేదు. కేవలం నానా రచ్చ చేస్తూ విపక్షం మీద దుడుకుగా వ్యవహరిస్తూ రభస చేయాలంతే. శోచనీయమైన విషయం ఏమిటంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం. రాష్ట్రంలో చాలా చాలా సంఘటనల్లో వైసిపి నాయకులకు మరొక పార్టీ నాయకులకు మధ్య ఘర్షణాత్మక వైఖరి తలెత్తినప్పుడు.. పోలీసులు ఏకపక్షంగా ప్రతిపక్షాల మీద మాత్రమే కేసులు నమోదు చేయడం చాలా రివాజుగా మారిపోయింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ మీద దాడి లాగా దూసుకు వెళ్లిన వైసిపి నాయకులు విషయంలో పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తూ ఊరుకోవడం కూడా చర్చనీయాంశం అవుతుంది. ఘర్షణలు జరిగితే ప్రతిపక్షం మీద పెద్ద సంఖ్యలో కేసులు పెట్టాలని వేచి చూస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. చంద్రబాబు నాయుడు ఎక్కడ పర్యటిస్తుంటే అక్కడ.. ఆయన పట్ల వ్యక్తం అవుతున్న ప్రజాదరణ గుర్తింపు లోకి రాకుండా ఉండడానికి.. నానా రచ్చ చేయాలని సరికొత్త స్కెచ్ తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నట్లుగా అభిప్రాయం ఏర్పడుతోంది.