తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నదని వైసీపీ నాయకులకు స్పష్టంగా అర్థం అయింది. ఆ ప్రభుత్వాన్ని కుదురుగా పనిచేసుకోనివ్వకుండా అస్థిరతకు గురిచేయడానికి, ప్రజల్లో వారి పట్ల ఒక ద్వేషాన్ని పెంపొందింప చేయడానికి వారు ఇప్పటినుంచే తమ ముద్రగల కుట్రలను ప్రారంభించారు. వైసిపి కార్యకర్తలకు పసుపు కండువా తొడిగి తెలుగుదేశం కార్యకర్త అని భ్రమింప చేసేలా తయారు చేసి, అలాంటి వ్యక్తితో తప్పుడు ప్రకటనలు చేయించడం కులాల మధ్య స్నేహవాతావరణం చెడిపోయేలాగా మాట్లాడించడం ద్వారా తెలుగుదేశాన్ని భ్రష్టు పట్టించాలని వైసీపీ ప్రయత్నం చేస్తున్నది. ఇలాంటి కుట్రపూరితమైన వ్యవహారాలను కట్టడి చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనించాల్సిన సంగతి.
ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటే.. నిజానికి ఆ పార్టీ మురిసిపోవాలి. తమ పార్టీ కోసం అడగకుండానే ప్రచారం చేసే వ్యక్తి దొరికారు కదా అని సంతోషించాలి. కానీ అలా జరగడం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ ముసుగులో కొందరు మాట్లాడుతున్న తీరును గమనిస్తే పార్టీ భయంతో వణికి పోతుంది.
మన్విత్ కృష్ణారెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని వీడియోలు చేస్తూ ఒక వ్యూహం ప్రకారం ప్రచారం సాగిస్తున్నారు. అయితే ఈ కృష్ణారెడ్డి వీడియోలు కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా తయారవుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలను దూషిస్తూ కృష్ణారెడ్డి తెలుగుదేశం కండువాతో చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారం గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల రామయ్య తదితరులు డీఐజీ సెంథిల్ కుమార్ ప్రత్యేకంగా వినతిపత్రం సమర్పించారు. తెలుగుదేశం పార్టీని ప్రజల దృష్టిలో బదనాం చేయడానికి.. తమ పార్టీ కండువాతో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన్విత్ కృష్ణారెడ్డి కుట్రపూరితంగా ఈ వీడియోలు చేస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారాన్ని గమనిస్తే తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలలో ఒక వ్యతిరేకతను నాటడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారుడు ప్రయత్నాలను చేస్తున్నదో అర్థమవుతుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రజలలో అశాంతిని సృష్టించడానికి ఏ పార్టీ పడుతున్న తాపత్రయం తెలిసివస్తుంది.
వైసిపి: కుట్ర రాజకీయాలలో నయా ట్రెండ్!!
Wednesday, December 18, 2024