వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ ముఠా కుమ్ములాటలతో సతమతం అవుతున్న సంగతి అందరికీ అర్థమవుతున్నదే. ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకోవడంలోనే నాయకులు నిత్యం చాలా బిజీబిజీగా గడుపుతున్నారు. పైగా ఇలాంటి ముఠా తగాదాలను సర్దడం పట్ల ముఖ్యమంత్రి జగన్ పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శలున్నాయి. ఆ బాధ్యతను సెకండ్ గ్రేడ్ అధిష్ఠానానికి అప్పగించేస్తున్నారు. దాంతో ముఠాలు మరింత పెరుగుతున్నాయే తప్ప.. తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా మరో ముసలం బయటపడింది. అయితే ఈ ముసలం బయటపడడానికి అనేక కారణాలున్నాయి.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన తండ్రి టీడీపీ హయాంలో మంత్రిగా చేసిన వసంత నాగేశ్వరరావు అమరావతి రాజధానిని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండించడమే కొడుకు కృష్ణప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం. తండ్రి అమరావతిని సమర్థించిన వెంటనే.. కృష్ణప్రసాద్ కు హైకమాండ్ నుంచి క్లాస్ పీకి ఉంటారని, ఆయన హడావుడిగా ఆ ప్రెస్మీట్ పెట్టి ఖండించారని, తండ్రి వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని, తాను వాటితో ఏకీభవించడం లేదని ప్రకటించారని ఎవరైనా ఊహించుకోవచ్చు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చడాన్ని కూడా వసంత నాగేశ్వరరావు తప్పుపట్టగా.. దానిని కూడా కొడుకు ఖండించారు. ఇక్కడ చిన్న ట్విస్టు ఏంటంటే.. రాజధాని విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి నిర్ణయం శిరోధార్యం అని వెల్లడించారు. అంటే విభేదిస్తున్నారనే అర్థమే వస్తుంది. అయితే.. ఇలా తండ్రి మాటలను ఖండించే వ్యాఖ్యలన్నీ ఆయన పార్టీ అధిష్ఠానం ఒత్తిడి మేరకే చేశారా అనే అభిప్రాయం కలిగేలాగా మరో మాట కూడా చెప్పారు. ఎప్పుడూ ఎవరో ఒకరిని ఇరకాటంలో పెట్టడం తండ్రికి అలవాటని అన్నారు. ఆయన మాటలతో ఇప్పుడు తాను ఇరుకులోపడ్డానని చెప్పకనే చెప్పారు.
వసంత అసంతృప్తి పర్వంలో ఇదంతా ఒక భాగం మాత్రమే. 2024 ఎన్నికల్లో సీఎం పోటీచేయమంటేనే చేస్తా.. లేకుంటే పార్టీకోసం పనిచేస్తా లాంటి డైలాగుల ద్వారా.. మైలవరం సీటు విషయంలోను, వసంత నాగేశ్వరరావు చుట్టూ పార్టీలో జరుగుతున్న కుట్ర విషయంలోనూ రకరకాల అనుమానాలు కలిగే వాతావరణం కల్పించారు ఆయన. తాను పార్టీలో చేర్పించిన వారు కూడా తన వెనుక గోతులు తవ్వుతున్నారని అనడం విశేషం. జోగి రమేష్ తో విభేదాల గురించి కూడా మాట్లాడారు. ఆ విభేదాలను ముందు పార్టీ హైకమాండ్ కు చెప్పవలసి ఉందన్నారు. చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వసంత కృష్ణప్రసాద్.. అందుకు అనారోగ్యం కారణం అంటున్నారు. మైలవరంలో అభ్యర్థిని మారిస్తే.. పార్టీకోసం పనిచేస్తానని అంటున్నారు.
ఇలాంటి నర్మగర్భ వ్యాఖ్యలు విన్నప్పుడు.. వైసీపీ పార్టీలో, కనీసం మైలవరం నియోజకవర్గానికి సంబంధించి.. ఏదో ముసలం పుట్టి ముదురుతున్నదని ప్రజలు అనుకుంటున్నారు.
వైసీపీలో ఇంకో ముసలం బయటపడింది!
Thursday, January 23, 2025