బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదని పాత సామెత. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి ఆగడాలను గమనిస్తే.. బిడ్డ చచ్చిన తర్వాత కూడా వారు బారసాల చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రెండో జడ్పీటీసీ స్థానాల్లో అత్యంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా.. ఇది ఓటమి కానే కాదని, మోసం అని చాటుకోవడానికి వారు ఇప్పటికీ కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట లలో పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లతో ఎన్నికలు నిర్వహణకు పూనుకున్నప్పుడే.. తాము అలవాటుగా బెదిరింపులతో ఏకగ్రీవాలు చేసే చోట ఏకంగా 11 నామినేషన్లు నమోదు అయినప్పుడే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి తాము ఓడిపోతున్నామనే సంగతి అర్థమైంది. అది మొదలుగా.. ఏదో ఒక కుంటిసాకులు చెబుతూ వారు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులుచేస్తూ వచ్చారు.
తాజాగా ఓడిపోయిన తర్వాత కూడా అలాంటి వికటప్రయత్నం చేస్తున్నారు. తమది ఓటమి కాదు అని- అన్యాయానికి గురయ్యామని చాటుకోవడానికి.. నిబంధనల ప్రకారం ఏదైతే సాధ్యం కాదో.. అలాంటి డిమాండ్లతో వైసీపీ నాయకులు ఎన్నికల కమిషన్ కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉంటోంది.
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి.. రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఈసీకి రెండు లేఖలు రాశారు.
అందులో మొత్తం ఏడు డిమాండ్లను ఆయన వారి ముందుంచారు. అవేంటో తెలుసా..? పోలింగ్ స్టేషన్లు ఆయా ప్రాంగణాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ఫుటేజీలు, వీడియో కవరేజీలు, పోలింగ్ కు సంబంధించి ఏర్పాటుచేసిన వెబ్ కాస్టింగ్, ఆరోజు పోలింగులో కూర్చున్న ఏజంట్ల జాబితాలు, పోలింగ్ ఆఫీసర్ డైరీ, ఫార్మ్ 12, ఫార్మ్ 32 లను పూర్తి వివరాలతో మకు ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
అయితే ఇలాంటి లేఖ రాయడం కేవలం ఒక డ్రామా మాత్రమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. వీరి కోరికల్లో కొన్ని నిబంధనల ప్రకారం ఇవ్వడానికి వీల్లేనివి. కొన్ని వీరికి హక్కుగా దక్కేవే గానీ.. వీరు పలాయనం చిత్తగించడం వలన మిస్సయినవి.
ఫరెగ్జాంపుల్.. పోలింగ్ ముగిసిన తర్వాత ఫార్మ్ 32 అనేది పోలింగ్ ఏజంట్లకు ఇచ్చేది. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏజంట్లు అసలు పోలింగ్ కేంద్రాలకే వెళ్లకుండా.. బయట ఉండి గోల చేశారు. లోనికి వెళ్లకుండా తమను లోనికి రానివ్వడం లేదంటూ నానా యాగీ చేశారు. ఆ క్రమంలో పోలింగ్ ముగిసిన తర్వాత హక్కుగా వారి పార్టీ ఏజంట్లకు ఇచ్చే ఫార్మ్ 32ను తీసుకోనేలేదు. ఇప్పుడు ఆ ఫార్మ్ కావాలని డ్రామా ఆడుతున్నారు.
అలాగే కొన్ని సాధ్యం కానివి అడుగుతున్నారు. వెబ్ కాస్టింగ్, సీసీ టీవీల ఫుటేజీని ఇవ్వడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదు. కానీ అవి కావాలని అడుగుతున్నారు. ఒకవేళ అవి వారికి కావాలంటే గనుక.. కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకోవాలి. అప్పటికీ, ఆ ఫుటేజీలను చూడడానికి అనుమతిస్తారు తప్ప.. బయటకు ఇచ్చేయడం సాధ్యం కాదు.
ఒక న్యాయమూర్తి సమక్షంలోనే తాము ఆ ఫుటేజీలు చూస్తామని అక్రమాలు నిగ్గు తేల్చాలని కోరుతూ వారు కోర్టులో కేసు వేయవచ్చు. కానీ.. కోర్టు దగ్గరకు వచ్చేసరికి సాధ్యమయ్యే విషయం గురించి మాట్లాడరు. ‘ఎన్నికలు రద్దు చేయండి.. మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వండి’ అంటూ ఏదైతే కోర్టు పరిధిలో లేదో దాని గురించి అడుగుతారు. ఈసీ దగ్గరకు వచ్చేసరికి ఏదైతే సాధ్యం కాదో అది అడుగుతారు.. ఇలా చేస్తున్న వైసీపీ నేతలు.. ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని.. తాము కోరినాకూడా వివరాలు ఇవ్వలేదని ఆరోపించడానికి దీనిని వాడుకోగలరు తప్ప.. సాధించేదేమీ లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
