మసిగుడ్డ కాల్చి మొహాన పారేస్తే సరిపోతుంది.. కడుక్కోవడం అనేది అవతలి వాడి ఖర్మ అనే దుర్మార్గమైన వైఖరి ఒకటి ఉంటుంది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు అనుసరిస్తున్న ధోరణులు కూడా ఇంచుమించు అదేమాదిరిగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెద్ద పెద్ద నిందలు వేసేస్తారు.. కేసులుపెట్టేస్తారు.. అరెస్టులు కూడా చేసేసి చేయగలిగినంత హింస చేసేస్తారు. ఆ తర్వాత విచారణ సందర్భంగా అంతే గట్టిగా నిలబడరు. వారి మీద బురదచల్లడంతో తమ పని అయిపోయిందని, తృప్తిగా ఉండిపోతారు. నిందలు వేసిన తర్వాత.. ఆధారాలు ఉంటేచూపించాలని సవాలు చేసినా కూడా స్పందించరు. నింద వేయడం వరకే తమ డ్యూటీ, బురద చల్లడం మాత్రమే తమ లక్ష్యం అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వైసీపీ వారి వ్యవహార సరళిని ఎండగడుతున్నారు నారా లోకేష్.
నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి తనపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఏం ఉన్నా సరే.. 24 గంటల్లోగా బయటపెట్టాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వారికి సవాలు విసిరారు. ఆరోపణలు చేసి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డికి పరిపాలన చేతకాక.. ప్రజల దృష్టి మరల్చేందుకు నా మీద ఆరోపణలు చేస్తున్నారు అని లోకేష్ అంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటినుంచి లోకేష్ అవినీతి గురించి అనేకానేక ఆరోపణలు గుప్పించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి ఆరోపణలు చేశారు. అందులో వేర్వేరు వ్యక్తులను అరెస్టు చేసి.. కుంభకోణాలు జరిగినట్టుగా నిరూపించే ప్రయత్నం చేశారు. ఆ కుంభకోణాలను లోకేశ్ కు ముడిపెట్టే ప్రయత్నం చేశారు. కానీ.. అవేవీ కూడా ఒక కొలిక్కి రాలేదు. వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇలాంటి నేపథ్యంలో లోకేషే స్వయంగా ప్రభుత్వం మీద ఎదురుదాడికి దిగడం గమనార్హం.
మరో నెలరోజుల్లో లోకేష్ రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ ను నైతికంగా దెబ్బతీయడానికి, లోకేష్ నిజాయితీ పట్ల ప్రజల్లో అనుమానాలు పుట్టించడానికి వైసీపీ మైండ్ గేమ్ ఆడడం చాలా సహజం. సరికొత్త ఆరోపణలను పుట్టించి వాటిని లోకేష్ మీదకు సంధించి.. అలాంటి ప్రయత్నం చేస్తారు. అలాంటి మైండ్ గేమ్ నాటకానికి తెరలేపడమే ఈ ప్రయత్నంగా కనిపిస్తోంది. అందుకే తన మీద వైసీపీ వారు చేస్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్, ఫైబర్ గ్రిడ్, ఐటీ కంపెనీలకు రాయితీలు ఇలాంటి అంశాల్లో ఆరోపణలు తెరమీదికి తెస్తుండగా, అన్నింటికీ కలిపి లోకేష్ ఒకే ఒక సవాలు విసురుతున్నారు. 24 గంటలు టైమిస్తున్నా.. ఈ ఆరోపణలపై ఆధారాలు చూపించండి అని అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అయింది. లోకేష్ సారథ్యంలో అవినీతి జరిగి ఉంటే ఇన్నాళ్ల వ్యవధిలో ఆధారాలు దొరకకుండా ఉండడం అసాధ్యం. దొరికిఉంటే వారు విడిచిపెట్టరు. ఆ నమ్మకంతోనే లోకేష్ ఆధారాలు చూపించాలని ధైర్యంగా సవాలు విసురుతుంటారు. మరి ఈ సవాలును వారు స్వీకరిస్తారో లేక సైలెంట్ అయిపోతారో చూడాలి.
నిందలు వేస్తారు.. సవాళ్లకు స్పందించరు!
Sunday, January 19, 2025