షర్మిల అణచివేత వెనుక జగన్ హస్తం!

Wednesday, January 22, 2025

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో జగన్ కు అత్యంత సన్నిహిత సంబంధ బాంధవ్యాలున్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత.. తెలంగాణలో ఉన్న తన వందల కోట్ల ఆస్తులను పరిరక్షించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ తో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారని అనేక పుకార్లు వినిపించాయి. దానికి తగ్గట్టుగానే.. ఉభయ రాష్ట్రాలు కలిసి పరిష్కరించుకోవాల్సిన అనేక అంశాల విషయంలో ఏపీ ప్రభుత్వం మెతక ధోరణినే అవలంబించింది. హైదరాబాదులోని ఆస్తులను ఉభయ రాష్ట్రాలు పంచుకునే విషయంలో కూడా కేసీఆర్ ఇచ్చిందే మహాప్రసాదం అన్నట్టుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. తెలంగాణ సీఎం తో ఇంత చక్కటి, లోలోపలి సంబంధాలను కూడా కలిగి ఉన్న జగన్.. తన చెల్లెలు చేస్తున్న రాజకీయ ప్రయత్నం పట్ల ఆ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంటే ఎలా మిన్నకుంటున్నారు అనే ప్రశ్న పలువురికి కలుగుతోంది.
అదే సమయంలో.. షర్మిలతో విభేదాల వల్ల ఆమె రాజకీయాల గురించి తాను పట్టించుకోకుండా మిన్నకుండడం మాత్రమే కాదు. అసలు షర్మిల యాత్రను అనుమతించకుండా అణచివేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక జగన్ హస్తం ఉన్నదనే ప్రచారం కూడా ఇప్పుడిప్పుడే జరుగుతోంది. చెల్లెలి పట్ల అంత ఘోరం జరుగుతోంటే ఎందుకు స్పందించలేదని జగన్ ను ప్రధాని మోడీ అడిగినట్టుగా వార్తలు వచ్చాయి. స్పందించడం తర్వాత.. అన్నయ్యే స్వయంగా తెరవెనుక వ్యూహరచన చేస్తున్నారా? అనే సందేహం పుట్టేలా పరిస్థితులు తయారవుతున్నాయి.
షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా స్తంభింపజేయడం దగ్గరినుంచి చూద్దాం. ఈ పాదయాత్ర సుమారుగా మరో పదిరోజులు కొనసాగిందంటే.. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు బద్ధలవుతుంది. రాజకీయాల్లో తనను మించిన వారు లేరు. తాను చేసిన పాదయాత్రను మించినది లేదు.. అని చాటుకుంటున్న జగన్.. చెల్లెలు తన రికార్డును బద్దలు చేస్తే సహించలేకపోవచ్చు. అందుకు ఆమె పాదయాత్రను ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడుతుండవచ్చు అనేది పలువురిలో కలుగుతున్న ప్రాథమిక సందేహం.
మరో సందేహం కూడా ప్రజల్లో ఉంది. తెలంగాణలో, హైదరాబాదు పరిసరాల్లో వైఎస్ జగన్ కు వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. వాటిని పరిరక్షించుకోవడానికి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి.. కేసీఆర్ తో చీకటి ఒప్పందాలు చేసుకున్నారనే ప్రచారం కూడా ఉంది. ఒకవేళ తెలంగాణలో అధికారం మారి బిజెపి గద్దె ఎక్కినా సరే.. వారితో ఉండే స్నేహం కొద్దీ, వారి పట్ల చూపించే విధేయత కొద్దీ తన ఆస్తులకు నష్టం వాటిల్లకుండా జగన్ జాగ్రత్త పడతారు. అదే షర్మిల ప్రాబల్యం ఉండే ప్రభుత్వం ఏర్పడితే గనుక.. ఇప్పటికే వారి మధ్య విభేదాల నేపథ్యంలో జగన్ ఆస్తులకు కూడా గండమే. ఇలాంటి భయాలతోనే జగన్.. షర్మిల పాదయాత్ర కొనసాగకుండా, తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఎదగకుండా అడ్డు పడుతున్నారనే అనుమానాలు వినిపిస్తున్నాయి.
తన పాదయాత్ర అనుమతికోసం షర్మిల ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ నిర్ణయంతో ఇక్కడి పరిణామాలను ఆమె మరో మలుపు తిప్పుతారనేది గ్యారంటీ. కాకపోతే జగన్ ఎలా స్పందిస్తారనేదే వేచిచూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles