ఆదివారం మధ్యాహ్నమే ఆగిపోయిన డబ్బు పంపకాలు!
మిగిలింది దాచుకుందాం అనే ధోరణిలోకి వైసీపీ శ్రేణులు!
పంచితే మొత్తం క్షవరమే అని భయం!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎక్కడికక్కడ జాగ్రత్త పడ్డారు. పోలింగ్ వరకు ఆగాల్సిన అవసరం లేకుండా.. ప్రజల స్పందన, మొగ్గు ఎటువైపు ఉన్నదో స్పష్టంగా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో చివరి నిమిషంలో ఓటర్లకు డబ్బు పంచడం కూడా మానేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో అదే పరిస్థితి. ఖర్చు పెట్టిన కాడికి పెట్టాము.. ఇక ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే నష్టం. కనీసం ఇప్పుడైనా తెలివితెచ్చుకోవాలి.. అని వైసీపీ అభ్యర్థులు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. పోలింగుకు ముందే ఎన్నికలు ఏకపక్షంగా మారినట్లుగా వాతావరణం తయారైంది.
ఏపీలో ఎన్నికల సందర్భంగా.. కూటమి అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. జనం వారికి నీరాజనం పట్టారు. ప్రత్యేకించి చంద్రబాబునాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు , జనసేన పార్టీ జోడించిన షణ్ముఖ వ్యూహం హామీలు ఇవన్నీ ప్రజల మీద పనిచేశాయి. చంద్రబాబునాయుడుకు చెప్పిన మాట నిలబెట్టుకునే అలవాటు లేదు.. ఆయనను నమ్మకండి అనే ఒకే ఒక మాట తప్ప.. జగన్మోహన్ రెడ్డి వద్ద కూటమి హామీలను తిప్పికొట్టడానికి వేరే దారి లేకుండాపోయింది. పైగా జగన్ సర్కారు రాష్ట్ర వనరులను అపరిమితంగా దోచుకున్నదని ప్రజలందరూ కూడా గుర్తించారు. ప్రధాని మోడీ కూడా చాలా స్ట్రెయిట్ గా భూమాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియాలను తుదముట్టించాలంటూ పిలుపు ఇచ్చిన వైనం ప్రజలను ఆలోచింపజేసింది. మొత్తానికి పోలింగుకు చాలా ముందుగానే.. ప్రజలు కూటమికి అనుకూలంగా డిసైడ్ అయ్యారు.
వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు మిగిలిన ఒకే ఒక్క ఆశ డబ్బు పంచి గెలవడం. డబ్బు పంపిణీ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ తీసుకుంటున్నారు తప్ప.. ప్రమాణం చేయమంటే చేయకుండా తిరస్కరించిన వారు అనేకులు. అసలు మాకు డబ్బే వద్దు అంటూ తిరస్కరించిన వారు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా వైసీపీ అభ్యర్థులకు స్పష్టత ఇచ్చాయి. ఖర్చు- పెట్టిన కాడికి పెట్టాం.. ఎటూ గెలిచేది లేదు. ఇక డబ్బు పంచకుండా దాచుకుంటే అంతవరకైనా మిగులుతుంది. ఇదికూడా పంచితే.. మొత్తం తిరుక్షవరం అవుతుంది అని వారు భయపడ్డారు. ఇలాంటి నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం తర్వాతినుంచే వైసీపీ డబ్బు పంపకాలు చాలా నియోజకవర్గాల్లో ఆగిపోయాయి. అభ్యర్థులంతా పోలింగుకు ముందే చేతులెత్తేసారు. కూటమి విజయం ఏకపక్షంగా మారిపోయింది.