ట్వీట్ల నీటుగాడు.. నీచభాషలో పోటుగాడు!

Friday, November 15, 2024

ఆయన ట్వీట్ల కేటుగాడు. నిత్యం ట్వీట్లలో బతుకుతూ ఉంటాడు. రాజకీయంగా ఎంత నీచమైన దిగజారుడు హేయమైన ట్వీట్లు అయినా సరే.. ఆయన ట్విటర్ ఖాతాలో మనం చూడవచ్చు. ఒక మనిషి బహిరంగంగా మాట్లాడేప్పుడు.. ఇంత నీచంగా ప్రవర్తిస్తాడా.. ఇంత నీచమైన భాష వాడతాడా.. అని సోషల్ మీడియాలో బూతులు స్ప్రెడ్ చేసే కుర్రకారు కూడా విస్తుపోయేంత నీచమైన భాష వాడడం, నీచమైన పోస్టులు పెట్టడం ఆయన గొప్పతనం. 

ఆయనకు చెప్పుకోడానికి చాలా పెద్ద పదవులే ఉన్నాయి. హోదా పరంగా చాలా పెద్దవి. మనిషి కూడా చక్కగా, స్ఫురద్రూపంతో ఉంటాడు. మర్యాదస్తుడిలాగానే కనిపిస్తాడు. నీట్ గా తయారవుతాడు. చూడగానే గౌరవించాలని కొత్తవారికి అనిపిస్తుంది. మామూలు సంభాషణల్లో చాలా స్నేహశీలి.. ఆప్యాయంగానే మాట్లాడతారు. కానీ రాజకీయ ప్రత్యర్థుల మీద నిందలు వేయాలంటే మాత్రం.. ఆయనకు సభ్యత సంస్కారం తన హోదా, స్థాయి, వివేకం ఇవేమీ గుర్తుకు రావు. ఎడాపెడా చెలరేగిపోతాడు.

సాధారణంగా రాజకీయ నాయకుల సోషల్ మీడియా అకౌంట్లు వారు స్వయంగా పోస్టులు పెట్టరు. వారి తరఫున వారి అనుమతితో పోస్టులు పెట్టే దళాలు వేరే ఉంటాయి. చిన్న నాయకులనుంచి ప్రధాని వరకూ పరిస్థితి అంతే. అయితే.. ఢిల్లీలో సైతం తనదైన ముద్ర ఉన్న ఈ పెద్ద నాయకుడి ఖాతాను నిర్వహించే వారెవ్వరో గానీ.. పరమ గలీజుభాషను అక్షరాల్లో పెట్టడంలో సిద్ధహస్తులు. 

అసభ్యమైన అడ్డగోలు ఆరోపణలను ఎలాంటి ధ్రువీకరణలు లేకుండా జనం మీదికి వదిలేయడం అనేది ఒక స్థాయి గల వారికి తగదు. కానీ ఆయన తనకు ఒక స్థాయి మర్యాద ఉన్నాయని నమ్ముతారో లేదో గానీ.. నీచమైన భాషలోనే ప్రతి విషయాన్నీ ప్రస్తావిస్తూ ఉంటారు. 

తాజాగా కొన్ని ట్వీట్లతో ఆయన మరోసారి వార్తల్లోకి వచ్చారు. సాధారణంగా ఆయన ట్వీట్లలోని కంటెంట్.. ఆయన పార్టీ వారు అందిపుచ్చుకునేలా.. అదే లైన్స్ లో ప్రత్యర్థి పార్టీని దుమ్మెత్తి పోయడానికి వాడుకునేలా ఉంటుంది. కానీ.. తాజా సిరీస్ లో ఆయన ట్విటర్ ఖాతా చూసిన సొంత పార్టీ వారు కూడా మరీ ఇంత గలీజుమాటలా అని అసహ్యించుకుంటున్నారు. 

రాజకీయంగా విమర్శలు చేయడం, విధానాలను తప్పుపట్టడం, నిందలువేయడం.. ఒక్కోసారి హద్దు తప్పినా, దిగజారినా కూడా బాగానే ఉంటుంది. కానీ వ్యక్తిగత విషయాల్లోకి చొరబడి.. హేయమైన వ్యాఖ్యలు చేయడం, వ్యక్తులను కించపరిచేలా మాటలు రువ్వడం అసహ్యకరమైన విషయం. సదరు గొప్ప నాయకుడు.. అంతటి దిగజారుడు ట్వీట్లు కాకుండా.. ఆ విషయాలనే కాస్త హుందాగా కూడా చెప్పవచ్చు అనే అభిప్రాయం.. ఆయన పార్టీ వారిలో కూడా వ్యక్తమవుతూ ఉంటుంది. కానీ.. ఆయనకు చెప్పగలవారెవ్వరు? జనం అసహ్యించుకుంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లేదెవ్వరు? పిల్లి మెడలో గంటకట్టేదెవ్వరు?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles