మహిళా బిల్లు: నిజం కాబోతున్న ముప్ఫయ్యేళ్ల కల!

Sunday, December 22, 2024

 చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రూపొందించిన మహిళా బిల్లును ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం ఆమోదించింది.  ఈ బిల్లు ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో లోక్సభలో ఓటింగుకు రానుంది.  సభ ఆమోదం కూడా పొందుతుంది.  బహుశా ఈ ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల  సమయానికే మహిళా రిజర్వేషన్ అమలులోకి రావచ్చు.  దీని ద్వారా అసెంబ్లీలోనూ,  పార్లమెంటులోనూ ఖచ్చితంగా  కనీసం 33 శాతం మంది మహిళలు ఉండే అవకాశం ఏర్పడుతుంది.  ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వుడు సీట్లు మారుతూ ఉండడం అనే అంశం కూడా ఆమోదం పొందితే కనుక..  క్రమక్రమంగా చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.

 మహిళా బిల్లు సాకారం కావడం అనేది  వర్తమాన ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప పరిణామం.  అయితే దీనిని ఎంత మేరకు మహిళా సమాజం సద్వినియోగం చేసుకుంటుంది అనేది ప్రధానంగా పరిగణించాలి.  ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలవుతోంది.  అయితే ఈ రిజర్వేషన్లు నిజంగా ఉపయోగించుకొని రాజకీయంగా ఎదుగుతున్న మహిళలు చాలా చాలా తక్కువ.  సాధారణంగా వారి భర్తల చేతిలోనే పెత్తనం ఉంటుంది.  సర్పంచులుగా,  మునిసిపల్ చైర్మన్గా రికార్డులలో మహిళలు ఉంటున్నప్పటికీ..  అధికారిక సమావేశాలతో సహా వారి భర్తలు స్వయంగా హాజరై  అధికారం చలాయించడం జరుగుతూ వస్తోంది.  మహిళా రిజర్వేషన్ తో పాటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉండే స్థానిక సంస్థల విషయంలో పరిస్థితి మరీ ఘోరం.  అలాంటి అనేక చోట్ల పెత్తందారులు తమ ఇంట్లోని పని మనుషులను ప్రజాప్రతినిధులుగా ఎన్నిక చేయించి..  వారిని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని అధికారం చెలాయించడం జరుగుతోంది. 

 కానీ ప్రాక్టికల్ గా చూసినప్పుడు..  స్థానిక సంస్థలలో మహిళల ప్రాతినిధ్యం ఉండడం వేరు- చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం ఉండడం వేరు! ఒకసారి ఎన్నికైన తర్వాత వారికి ఉండగల అపరిమిత అధికారాలను రుచి చూస్తూ..  మన్నుతున్న పాముల్లా ఉంటారని అనుకోవడం భ్రమ.  అలాగే ఒకసారి అధికారం దక్కిన తర్వాత మహిళలు స్వతంత్రంగా,  నిజాయితీగా పని చేస్తూ మళ్ళీ మళ్ళీ అదే నియోజకవర్గాల నుంచి గెలవగల స్థాయిలో పునాదులను పటిష్టం చేసుకోగలిగితే రాజకీయంగా ఇంకా అద్భుతాలు జరుగుతాయి.  మొత్తానికి మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాలుస్తుండడం ఒక అంకం మాత్రమేనని..  ఇది పూర్తిగా సద్వినియోగమైన నాడే  అసలు లక్ష్యం నెరవేరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles