తెగేదాకా లాగకూడదని అంటారు పెద్దలు. సహజంగా మనిషికి బ్రేకింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడిదాకా రెచ్చగొడితే అనుచితమైన ప్రతిస్పందనలే వస్తాయి. ఒక అబద్ధాన్ని నిజంగా ప్రజలతో నమ్మించడానికి.. పదేపదే బురద చల్లే తప్పుడు ప్రచారాన్ని భరించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ప్రజలకు మేలు చేసే మంచి పనిని అమలు చేస్తున్నప్పుడు.. దానిమీద కూడా ప్రజల బుర్రల్లోకి విషాన్ని ఎక్కించడానికి ప్రయత్నించే కుటిలత్వం పట్ల కలకాలం సహనం నిలబడదు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అదే జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు ఏ స్థాయిలో విషం కక్కుతున్నారో అందరికీ తెలుసు. ఈ దుష్ప్రచారం మీద సహనం కోల్పోయిన మంత్రి అచ్చెన్నాయుడు… వారిని చాలా ఘాటుగా ఓ ఆటాడుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చీర కట్టుకుని వస్తే.. బస్సు ప్రయాణం ఉచితమో కాదో వారికి అర్థమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు.
ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వానికి నూటికి రెండొందల మార్కులకు పైగా వేయాల్సిందే. ఎందుకంటే.. ఎన్నికలకు ముందే.. హామీ ఇచ్చిన ప్రకారం.. మహిళలకు వారి సొంత జిల్లా వరకు మాత్రమే ఉచిత అవకాశం కల్పించాలి. కానీ.. స్త్రీశక్తి పథకాన్ని అమలు చేసే సమయానికి మొత్తం రాష్ట్రమంతా కూడా పర్యటించడానికి అవకాశం కల్పిస్తూ చంద్రబాబునాయుడు ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ పథకం లబ్ధిని అనుభవిస్తున్న మహిళలకు కూడా అది అనూహ్యమైన నిర్ణయం. లగ్జరీ బస్సులు, ఏసీలు, నాన్ స్టాప్ లు లాంటి వాటిల్లో ఉచిత ప్రయాణం అనుమతించడం అనేది దేశంలోనే కాదు కదా.. ఉచిత అవకాశం కల్పించే ఏ దేశంలోనూ కూడా అమల్లో లేని సంగతి. అప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 11 వేల బస్సులుండగా.. దాదాపు 9 వేల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు.
అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ పథకం గురించి తప్పుడు వివరాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు అవకాశమే కల్పించడం లేదని, కేవలం కొన్ని బస్సుల్లో మాత్రం అంటున్నారని.. అది కూడా రాష్ట్రమంతా లేదంటున్నారని రకరకాల తప్పుడు వ్యాఖ్యల్ని ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇలాంటి తప్పుడు ప్రచారంపై మంత్రి అచ్చెన్నాయుడుకు కడుపుమండినట్టుగా ఉంది. అందుకే.. వైసీపీ నేతలు చీరలు కట్టుకుని వస్తే.. బస్సుల్లో ఉచితం ఉన్నదో లేదో అర్థమవుతుందని ఎద్దేవా చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలను, వెటకారాన్ని గమనించిన ప్రజలు మాత్రం.. వైసీపీ నేతలకు అచ్చెన్నే చీరలను కానుకగా ఇస్తే సరిపోతుంది కదా.. అని నవ్వుకుంటున్నారు.
