భీమిలి సముద్రతీరంలో విచ్చలవిడిగా సాగిస్తున్న అక్రమ నిర్మాణాల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చినీయాంశం అవుతోంది. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఈ వ్యవహారంలో అలుపెరగని పోరాటం సాగిస్తుండగా హైకోర్టు కూడా ఆయన పిటిషన్లను గట్టిగానే విచారిస్తోంది. కేవలం హైకోర్టు ఆదేశాల పుణ్యమాని ఏకంగా సముద్రతీరాన్ని కూడా కబ్జా చేసేస్తూ నిర్మించిన కాంక్రీటు నిర్మాణలను అధికారులు ఇంకా తొలగిస్తున్నారు. అయితే ఈ నిర్మాణాల తొలగింపు, కోర్టు విచారణ క్రమంలో.. ఈ యావత్తు దందా వెనుక మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పాత్ర కూడా త్వరలోనే బయటకు రావడం గ్యారంటీ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
భీమిలిలో ఇప్పుడు ఏ అక్రమ కాంక్రీటు నిర్మాణాలనైతే అధికారులు కూల్చివేస్తున్నారో.. అవన్నీ కూడా విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి కంపెనీకి చెందినవి. తమ దృష్టికి ఈ సంగతి వచ్చిన తర్వాత.. కోర్టు కూల్చివేతలకు ఆదేశిస్తే అధికారులు వాటిని పైపైన కూల్చేసి చేతులు దులుపుకున్నారు. కోర్టులో మళ్లీ ఒక పిటిషన్ దాఖలైంది.. చాలా సీరియస్ అయిన హైకోర్టు పునాదులతో సహా కుళ్లగించి ఆ కాంక్రీటు నిర్మాణాలను తొలగించి చూపించాలని అధికారులమీద ఆగ్రహం వ్యక్తించేసింది. అధికారులకు పాపం తప్పలేదు. కొంతవరకు పునాదులతో సహా తొలగించిన తర్వాత.. కోర్టు విచారణలో భాగంగా ఆ ఫోటోలను కూడా పరిశీలించింది. విస్మయానికి గురైంది. ఇలాంటి నిర్మాణాలు జరగడం వలన పర్యావరణ నష్టమెంతో తేల్చాలని ఆదేశించింది. అదే సమయంలో.. అప్పటి నిర్మాణాలను ఉపేక్షించిన అధికారులపేర్లు తమకు ఇవ్వాలని వారి మీద కూడ చర్యలకు ఉపక్రమిస్తామని కోర్టు అంటోంది. ఇక్కడే అసలు గొడవ మొదలయ్యే ప్రమాదం ఉంది.
అధికారులను హైకోర్టు విచారిస్తే గనుక.. వారు తాము ఆ నిర్మాణాల పట్ల ఎందుకు ఉపేక్ష ధోరణి అనుభవించవలసి వచ్చిందో.. ఎందుకు మౌనంగా చూస్తూ ఊరుకున్నారో చెప్పి తీరాలి. వాస్తవాలు మాట్లాడకపోతే.. వారికే ప్రమాదం. వారి మీద అసలే గుర్రుగా ఉన్న న్యాయస్థానం.. వారు కోర్టులో కూడా డొంకతిరుగుడు మాటలు చెబితే మరింత సీరియస్ అవుతుందనేది గ్యారంటీ! ఈ నేపథ్యంలో అధికారులు కోర్టు ఎదుటకు రావాల్సిన పరిస్థితే వస్తే గనుక.. తమ మీద విజయసాయిరెడ్డి ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పేఅవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. విజయసాయి మాత్రం.. నా కూతురు, అల్లుడు వ్యాపారాలతో నాకు ఏమాత్రం సంబంధంలేదు అని అంటుంటారు. కానీ.. ఇంత భారీ ఉల్లంఘనలు.. మామూలు వ్యాపారులు చేసుకోగలిగేవి కాదు. కోర్టు ఈ ఆదేశాల వలన.. అధికారుల ద్వారా.. విజయసాయి పాత్ర బయటకు వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.