విశాఖ ఉక్కు పరిశ్రమను మోడీ సర్కారు ప్రెవేటీకరించాలని ఆలోచిస్తున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. సహజంగానే.. ఎన్నో పోరాటాల తర్వాత సాధించుకున్న ఉక్కు పరిశ్రమ ప్రెవేటుపరం కాకుండా ఉండేందుకు ప్రజాందోళనలు ప్రారంభం అయ్యాయి. విశాఖలో పెద్ద ఎత్తున దీక్ష్లలు కూడా జరిగాయి. అయితే అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ దీని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం ఆందోళన చేస్తున్న వారిని పలకరించను కూడా లేదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తనను తాను సీఐడీ, ఈడీ కేసుల నుంచి కాపాడుకోవడానికిక మోడీ ఎదుట సాగిలపడుతూ ఉండేవారు. విశాఖ ఉక్కు కోసం పల్లెత్తు మాట అనలేదు. అయితే ఆ రోజుల్లోనే.. తాను ఎన్డీయే భాగస్వామి పార్టీకి సారథి అయినప్పటికి పవన్ కల్యాణ్ విశాఖ వెళ్లి ఆందోళనలు చేస్తున్న వారిని పరామర్శించారు. వారికి తాను అండగా నిలబడతానని చెప్పారు. పరిశ్రమ ప్రెవేటు పరం కాకుండా ఢిల్లీ పెద్దలతో మాట్లాడతానని కూడా చెప్పారు. అంతే తప్ప జగన్ సర్కారులో కించిత్తు చలనం రాలేదు.
తీరా రాష్ట్రంలో అధికారం కూడా మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా డబల్ ఇంజిన్ సర్కారు నడుస్తోంది. రాష్ట్రానికే చెందిన బిజెపి ఎంపీ శ్రీనివాసవర్మ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి కూడా అయ్యారు.
ఈలోగా వైసీపీ దళాలు విశాఖ ఉక్కుకోసం మొసలి కన్నీరు కార్చడం ప్రారంభించాయి. పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాలకు కోఆర్డినేటర్ గా నియమితులైన విజయసాయిరెడ్డి విశాఖ ఉక్కు ప్రెవేటీకరణ జరగకుండా పోరాడుతానని అంటున్నారు. లేని సమస్య కోసం యుద్ధం చేయడం ఆయనకే చెల్లిందని జనం నవ్వుతున్నారు. కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, సహాయమంత్రి శ్రీనివాస వర్మ ఇద్దరూ అసలు ప్రెవేటీకరణ ఆలోచనే లేదని అంటుండగా.. ఇప్పటికైనా విజయసాయి అండ్ కో విశాఖ ఉక్కు కోసం విలపిస్తున్నట్టుగా తమ డ్రామాలు కట్టిపెట్టాలని ప్రజలు అంటున్నారు.