కవిత రాజేసిన అగ్నిజ్వాల ఆమెనే దహించేస్తుందా?

Thursday, December 4, 2025

గులాబీ తనయ మీద ఇప్పుడు కత్తివేటు పడబోతున్నదా? పూర్తిస్థాయిలో పార్టీ పరువు తీసేలాగా హరీష్ రావు, సంతోష్ కుమార్ ల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చరేసిన కల్వకుంట్ల కవితకు ఇకపై ఆ పార్టీలో భవిష్యత్తు మిగిలిఉన్నదా? లేదా? అనే సందేహాలు ప్రస్తుతం వ్యాప్తి అవుతున్నాయి. తన తండ్రి మీద సీబీఐ విచారణ కావాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానించినందుకు వ్యతిరేకంగా ఈసరికే తెలంగాణ మొత్తం తగలెట్టేసి ఉండాలి కదా.. అని రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన కల్వకుంట్ల కవిత.. ఈ సందర్భాన్ని.. సొంత పార్టీలోనే తన శత్రువులను బద్నాం చేయడానికి చాలా బాగా వాడుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఆమె కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ధ్రువీకరించారు. ఆమె మాటలతో మరింతగా ఇరుకున పడిన భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. కన్న కూతురిమీద సస్పెన్షన్ వేటు వేయడానికి కసరత్తు చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆదివారం అర్ధరాత్రి దాకా జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశం కేసీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి గురించి పీసీ ఘోష్ క మిషన్ నివేదికపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించారు. హరీష్ రావు.. అసలు తప్పే జరగలేదని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. అర్ధరాత్రి దాటిన తర్వాత.. ఈ కేసులో రాష్ట్రప్రభుత్వ ప్రమేయం లేకుండా.. కేంద్ర సంస్థ సీబీఐతో దర్యాప్తు చేయించాలని తీర్మానిస్తూ శాసనసభను వాయిదా వేశారు. కేసీఆర్, హరీష్ రావు పాత్రల గురించి.. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ సోమవారం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ కూడా రాసింది.

దరిమిలా, ఈ అవకాశాన్ని కవిత  వాడుకున్నారు. తండ్రి మీద సీబీఐ విచారణ ఆదేశించడంతో కడుపుమండిపోతోందని అన్న ఆమె.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ధ్రువీకరించారు. అవినీతికి పాల్పడినందువల్ల మాత్రమే.. హరీష్ రావును తన తండ్రి కేసీఆర్ రెండో టర్మ్ ప్రభుత్వంలో దూరం పెట్టినట్టుగా ఆమె వివరించారు. హరీష్ రావు, సంతోష్ కుమార్ ఇద్దరూ తన తండ్రిమీద అవినీతి మరక పడడానికి ప్రధాన కారకులని ఆమె అన్నారు.

అయితే తండ్రిమీద కవిత చూపించిన ప్రేమ బెడిసి కొట్టింది. పార్టీ ఆమె వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. పార్టీ నేతలందరూ ఆమె ట్విటర్ ఖాతాను అన్ ఫాలో చేస్తున్నారు. ఆమె విమర్శలకు కౌంటర్ గా హరీష్ రావును ఆకాశానికెత్తేస్తూ భారాస అఫీషియల్ అకౌంట్ లో పోస్టు పెట్టింది. దానిని మరింతగా పొగుడుతూ కేటీఆర్ రీట్వీట్ చేశారు. కవిత మీద సస్పెన్షన్ వేటు వేయాలని కేసీఆర్ స్వయంగా కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఎపిసోడ్ తో భారత రాష్ట్ర సమితికి, కల్వకుంట్ల కవితకు బంధం తెగిపోయినట్టేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles