ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ‘‘నౌ ఆర్ నెవర్’’ (చేస్తే ఇప్పుడే చేయాలి.. లేకపోతే మరెప్పటికీ సాధ్యంకాదు) అనే తీవ్రమైన కాంక్షతో రగిలిపోతున్నారు. మామూలు పరిస్థితుల్లో అయితే ఈ ‘నౌ ఆర్ నెవర్’ అనే మాట పట్టుదలతో పనులు పూర్తిచేయడానికి సంబంధించి పాజిటివ్ అర్థంలో వాడుతుంటారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన ప్రత్యర్థుల మీద పగ సాధించడానికి, కక్ష తీర్చుకోవడానికి ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ అవకాశం రాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఒక్క చాన్స్ అంటూ సీఎంగా అధికారంలోకి వచ్చిన జగన్ తన రాజకీయ, వ్యక్తిగత, వ్యాపార ప్రత్యర్థులు అందరినీ దెబ్బతీయడానికి దక్కిన అవకాశంగా ఈ అధికారాన్ని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరో రకంగా చూసినప్పుడు.. ప్రజలు మరోసారి తనకు అధికారం ఇస్తారో లేదో, సీఎం కుర్చీలో కూర్చోబెడతారో లేదో.. మళ్లీ ప్రజల తీర్పు కోసం ఎదురుచూసే బదులు.. ఇప్పుడు దక్కిన అధికారం ఇంకా ఒక ఏడాది నిక్షేపంగా ఉంటుంది గనుక.. ఈ లోగా తన ప్రత్యర్థులు అందరినీ చావు దెబ్బ కొట్టాలని ఆయన డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. ప్రత్యర్థుల ఆర్థికమూలాలను దెబ్బకొట్టడమూ, ప్రతిష్టను దెబ్బకొట్టడమూ రెండూ సమాంతరంగా ఆయన లక్ష్యిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ లక్ష్యాలను పూర్తిచేసుకోవడానికి ఆయన తొందరపడుతున్నారు.
అలాంటి ప్రయత్నాల్లో భాగమే.. మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద జరుగుతున్న వరుస దాడులు తనిఖీలు, అరెస్టులు, అలాగే ఏకంగా రామోజీరావును, ఆయన కోడలు శైలజను సీఐడీ విచారించడం ఈ పరిణామాలు అన్నీ కనిపిస్తున్నాయి.
రామోజీరావు మీద ఇప్పుడు ఏ1 అనే ముద్ర వేశారు. ఆయన కోడలు శైలజ మీద ఏ2 అనే ముద్ర కూడా వేశారు. రామోజీరావును సీఐడీ అధికారులు విచారించారు. ఇక్కడితో రామోజీ మీద జగన్ పగ చల్లారినట్టేనా కాదా అనే సందేహం ప్రజల్లో మెదలుతోంది. ఆయనను ఏ1 అని వ్యవహరించడంతో జగన్ సంతృప్తి చెందుతారా? లేదా, రామోజీరావును జెయిల్లో పెట్టేదాకా తన వంతు కృషి చేస్తారా? అనేది ప్రజలకు అర్థం కావడం లేదు.
ప్రజలనుంచి, చిట్ కస్టమర్ల నుంచి, డిపాజిటర్లనుంచి ఒక్క కంప్లయింటు లేకపోయినా కూడా.. చెల్లింపుల్లో ఒక్క జాప్యం, తప్పు లేకపోయినా కూడా.. మార్గదర్శి చిట్స్ ఆఫీసులపై జగన్ సర్కారు చేయిస్తున్న దాడులు ఆ ప్రభుత్వం పరువు తీస్తున్నాయి. ప్రజల కోసం పనిచేసే సర్కారు లాగా కాకుండా, ప్రత్యర్థుల మీద కక్ష తీసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చే సర్కారుగా ఒక అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది. అయినా ఇలాంటి జనాభిప్రాయాల్ని జగన్మోహన్ రెడ్డి ఖాతరు చేసే అవకాశం లేదు.ముందే అనుకున్నట్టు.. నౌ ఆర్ నెవర్ అన్నట్టుగా.. అందరి పనిపట్టే పనిలో బిజీగా ఉన్నట్టున్నారు.
రామోజీపై జగన్ పగ చల్లారిందా? ఇంకా ఉందా?
Sunday, December 22, 2024