బూత్‌ల మార్పుపై వైసీపీ వణుకుతున్నది ఎందుకు?

Friday, December 5, 2025

ఎన్నికలలో పోలింగ్ బూత్ లను ఒక చోట నుంచి మరొక చోటకు మార్చడం అనేది చాలా తరచుగానే జరిగే సంగతి. ఇది పెద్ద అభ్యంతరకరమైన వ్యవహారంగా ఎన్నడూ నమోదు కాలేదు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా- సౌలభ్యాన్ని బట్టి మాత్రమే కాకుండా అనేక కారణాలను దృష్టిలో ఉంచుకొని ఇలా పోలింగ్ కేంద్రాల మార్పు జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు కడప జిల్లా పులివెందుల జెడ్పిటిసి స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆరు పోలింగ్ కేంద్రాలను అటు ఇటుగా మార్చడం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచితమైన ఆందోళన చేస్తోంది. కొన్ని రోజులుగా ఈ విషయంలో నానా రాద్ధాంతం జరుగుతూ ఉండగా, తాజాగా హైకోర్టును ఆశ్రయించి కూడా వారు భంగపడ్డారు. హైకోర్టులో ఈ విషయంపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా వారికి ఎదురుదెబ్బ తప్పలేదు.

పులివెందుల మండలంలో నల్లగొండ పల్లె తదితర ప్రాంతాలలో ఆరు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం మార్చింది. పులివెందుల నియోజకవర్గం మొత్తం తమకు తిరుగులేదని, తమ అడ్డా అని చాటుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళాలు ఈ చిన్నమార్పును మాత్రం సహించలేకపోతున్నాయి. పదివేల మంది ఓటర్లు ఉన్న మండలంలో ఆరు పోలింగ్ కేంద్రాలను అటు ఇటుగా మార్చడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి జరుగుతున్న అతిపెద్ద కుట్రగా వారు అభివర్ణించడం కామెడీగా ధ్వనిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. మంగళవారం నాడు పోలింగ్ జరగబోతుండగా సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.

కొన్ని గంటల వ్యవధిలో ఎన్నికల ప్రక్రియ మొదలు కాబోతున్న సమయంలో ఇప్పటికిప్పుడు పోలింగ్ కేంద్రాల మార్పు విషయంలో తాము జోక్యం చేసుకోలేం అని హైకోర్టు వీరి విజ్ఞప్తిని తిరస్కరించింది. కాస్త లోతుల్లోకి వెళ్లి గమనిస్తే ఈ ఆరు పోలింగ్ కేంద్రాల పరిధిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లోనూ విచ్చలవిడి రిగ్గింగ్ కు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలను మార్చడం వల్ల తమ ఆటలు సాగవని, నిబంధనలకు నియమాలకు కట్టుబడి ఉండాల్సి వస్తుందని, అది ఇష్టం లేకనే ఈ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని స్థానికంగా విమర్శలు వస్తున్నాయి.

అదే సమయంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులలో ఓటమి భయం మొదలైందని అందుకు కారణాలను ఈసీ మీదకు నెట్టేసే కుట్రలో భాగంగానే పోలింగ్ కేంద్రాల మార్పు వ్యవహారంపై రచ్చ చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. అయితే పులివెందుల  మండలంలో ఎన్నికలు ప్రశాంతవాతావరణం మధ్య జరగాలంటే, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదంటే.. ఈ పోలింగ్ కేంద్రాల మార్పు తప్పనిసరి అనే అభిప్రాయం అధికార వర్గాలనుంచి వ్యక్తం అవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles