రాజ్ కెసిరెడ్డి వ్యాపార భాగస్వామి, అత్యంత దగ్గరి వాడుగా భావిస్తున్న విజయేందర్ కు చెందిన ఫాంహౌస్ లో 11 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం దోపిడీ సొత్తు దొరికిన వైనం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. వరుణ్ పురుషోత్తం ను మంగళవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బుధవారం తెల్లవారే సరికి మద్యం ముడుపుల సొమ్ము డంప్ ను కనిపెట్టి 11 కోట్లు స్వాధీనం చేసుకోవడం కేసులో చాలా కీలకమైన మలుపు. ఈ నేపథ్యంలో రాజ్ కెసిరెడ్డి మాత్రం అప్పుడే అలర్ట్ అయిపోయారు. సిట్ పోలీసులకు దొరికిన 11 కోట్ల రూపాయలతో తనకు సంబంధం లేదని ఆయన కోర్టులో అఫిడవిట్ వేశారు. ఎక్కడైతే 11 కోట్ల రూపాయలు దొరికాయో.. ఆ సులోచన ఫాంహౌస్ యజమాని విజయేందర్ కు అనేక వ్యాపారాలు ఉన్నాయని, ఆ డబ్బు ఆయనకు చెందినది అయి ఉండొచ్చునని తనకు మాత్రం సంబంధం లేదని రాజ్ కెసిరెడ్డి చెప్పడం గమనార్హం.
కాచారాంలోని ఫాంహౌస్ యజమాని విజయేందర్ రెడ్డికి ఇంజినీరింగ్ కాలేజీ, ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఉన్నాయని ఆ కంపెనీలకు వందలకోట్ల టర్నోవర్ ఉన్నదని రాజ్ కెసిరెడ్డి ఏసీబీ కోర్టులో వేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరు అనగానే.. భుజాలు తడుముకుననారనేది పాత సామెత. కానీ.. రాజ్ కెసిరెడ్డి వైఖరిని గమనిస్తోంటే.. గుమ్మడికాయల దొంగ అంటే.. మాయింట్లో గుమ్మడికాయ వండలేదు అని కన్ఫెషన్ చేస్తున్నట్టుగా ఉంది. ఆయన ప్రస్తుతానికి కంగారులో తన మెడకు ఆ వ్యవహారం చుట్టుకోకుండా ఉండడానికి కోర్టులో అఫిడవిట్ వేసి ఉండవచ్చు గానీ.. ఈ ఊబినుంచి బయటపడడం చాలా కష్టం అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎందుకంటే.. ఆయన చెబుతున్న విజయేందర్ రెడ్డికి అనేక వ్యాపారాలు ఉండవచ్చు గాక.. ఆ వ్యాపారాలన్నీ వందల కోట్ల టర్నోవర్ తో నడుస్తుండవచ్చు గాక.. కానీ, ఒకటీ రెండూ కాదు ఏకంగా 11 కోట్ల రూపాయలు తన సొమ్మే అని ఆయన ఒప్పుకోవాలి కదా అనేది కీలకం. 11 కోట్ల రూపాయలు ఇలా అట్టపెట్టెల్లో దాచి పెట్టారంటే.. అది బ్లాక్ మనీ అని తేలినట్టే. మరి విజయేందర్ కు అది తనదే అని ఒప్పుకునే ధైర్యమున్నదా? ఒప్పుకుంటే ప్రభుత్వం నుంచి రాగల అన్ని ఇబ్బందులను తట్టుకుని నిలబడే ఓపిక ఉన్నదా? అనే అంశాలన్నీ ప్రశ్నార్థకాలు గానే ఉన్నాయి.
అయినా.. ఆ సొమ్ముకు లిక్కర్ స్కామ్ కు సంబంధం లేకపోతే.. రాజ్ కెసిరెడ్డికి మిత్రుడైన లిక్కర్ లోని మరో నిందితుడు వరుణ్ పురుషోత్తం కు ఆయన రహస్యంగా దాచిపెట్టిన సంగతి ఎలా తెలిసింది? తెలంగాణలో వ్యాపారాలు చేసుకునే విజయేందర్ రెడ్డి అక్రమ సంపాదన గురించి ఏపీలో సిట్ పోలీసులకు ఎలా తెలిసే అవకాశం ఉంది? ఇవన్నీ కూడా ప్రశ్నలే. వరుణ్ పురుషోత్తం దుబాయి నుంచి దిగిన తర్వాత.. పోలీసులకు దొరికిన వెంటనే నేరం ఒప్పేసుకుని ఈ డంప్ సీక్రెట్ చెప్పేశాడు. డబ్బు దొరికిన తర్వాత.. విచారణ ఇన్నాళ్లూ సాగిన తీరు ఒక ఎత్తు.. ఇకమీదట సాగబోయే తీరు మరొక ఎత్తుగా ఉంటుందనే క్లారిటీ ఉన్నందువల్ల.. రాజ్ కెసిరెడ్డి ముందుజాగ్రత్తగా తనకు సంబంధం లేదని అఫిడవిట్ వేసినట్టు తెలుస్తోంది.
