పోలింగ్ నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయి. ఓటమి గురించిన అసహనంతో చెలరేగుతున్న వారు.. యథేచ్ఛగా దాడులకు కూడా పాల్పడుతున్నారు. దాడులు చేయడంలో అవతలి పార్టీ అభ్యర్థిని కొడుతున్నామా.. ఓటు వేయడానికి వచ్చిన ఓటరును కొడుతున్నామా.. భద్రత నిమిత్తం వచ్చిన పోలీసు ఎస్పీని కొడుతున్నామా.. అనేది వారు పట్టించుకోవడం లేదు. విచ్చలవిడిగా ఎవరు తమకు అడ్డు చెబితే వారిని కొట్టేస్తున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎస్పీ వాహనం మీదనే వైసీపీ వారు దాడి చేయడం జరిగింది. అక్కడ ఒకే పోలింగ్ బూత్ లో సిటింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పెద్దారెడ్డి, తెలుగుదేశం అభ్యర్థి అస్మిత్ రెడ్డి పరస్పరం ఎదురుపడ్డారు. దీంతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. పరస్పరం రాళ్లు, కట్టెలతో కొట్టుకున్నారు. ఈలోగా వైసీపీ వాళ్లు కొట్టడంలో ఒక పోలీసు గాయపడ్డారు. ఎస్పీ వాహనం మీద కూడా దాడిచేసి ధ్వంసం చేశారు. ఘర్షణలు ముదరకుండా అస్మిత్ రెడ్డి అక్కడినుంచి వెళ్లిపోయినా.. పెద్దారెడ్డి అక్కడే ఉండి దాడులను ప్రోత్సహించినట్టు తేలడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
తెనాలిలో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ దాదాగిరీ చేశారు. ఎమ్మెల్యేను కూడా క్యూలో రావాలని చెప్పినందుకు లైన్లోని ఒక ఓటరును చెంపదెబ్బ కొట్టారు. ఓటరు కూడా ఎమ్మెల్యేను తిరిగి చెంపదెబ్బ కొట్టారు. దీంతో ఎమ్మెల్యే అనుచర గూండాలు ఒక్కసారిగా ఆ ఓటరు మీద పడి కుళ్లబొడిచారు.ఈ వీడియో మొత్తం వైరల్ అయింది. దీంతో ఈసీ ఆగ్రహించి శివకుమార్ ను సాయంత్రం పోలింగు ముగిసే దాకా గృహనిర్భంధంలో ఉంచాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించింది.
గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య ఏకంగా తనను ఏదో ప్రశ్నించిన ముస్లిం మహిళల మీదకి కారు పోనివ్వడానికి ప్రయత్నించడం, వారిమీద దాడి చేయాల్సిందిగా అనుచరులను పురమాయించడం ఇంకో వివాదంగా మారింది. నరసరావుపేట, మాచర్ల ప్రాంతాల్లో ఇరువర్గాల ఘర్షణలు జరుగుతున్నాయి. తెలుగుదేశం బ్రహ్మారెడ్డి మీద దాడిచేయడం జరిగింది.
పోలీసులకు కూడా రక్షణ లేనంతగా పోలింగు నాడు వైసీపీ వారి అరాచకాలు మిన్నంటుతున్నాయంటూ చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. ఈ కుట్రలను ప్రజలే తిప్పికొట్టాలని, ప్రజలందరూ నిర్భయంగా తరలివచ్చి ఓటు వేయాలని.. అధిక ఓటుశాతంతో హింసా రాజకీయాలకు ముగింపు పలకాలని పిలుపు ఇచ్చారు.
వైసీపీ దాడులకు ఓటరైనా, ఎస్పీ అయినా అంతా ఒక్కటే!
Wednesday, January 22, 2025