తమ సీక్రెట్ బయటపెట్టేస్తాడని ఇన్నాళ్లూ సాక్షి పత్రిక బృందాలన్నీ వణుకుతూ ఉన్నాయేూమో తెలియదు గానీ.. పోసాని కృష్ణ మురళి అరెస్టు వ్యవహారానికి సంబంధించి తమ పత్రికలోనూ, చానెల్ లోనూ టాప్ ప్రయారిటీ ఇస్తూ వచ్చాయి. పోసాని కృష్ణమురళిని వేధించేస్తున్నారని.. వార్ధక్యం వచ్చిన వ్యక్తిని, గుండె ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని హింసించేస్తున్నారని.. పాపం.. కంటికి కడివెడుగా ఆ మీడియా సంస్లలు విలపించాయి. తీరా.. రెండు కేసుల విచారణ దశలు దాటి.. సీఐడీ పోలీసుల దాకా వచ్చేసరికి.. పోసాని కృష్ణమురళి అస్త్రశస్త్రాలన్నీ వారి మీదికే ఎక్కుపెట్లారు. సాక్షి పత్రిక వారు ఇచ్చినది మాత్రమే తాను మాట్లాడానని, వారు ఇచ్చినవి మాత్రమే తాను చూపించానని బాంబు పేల్చారు పోసాని కృష్ణమురళి.
నాటకీయంగా మాట్లాడుతూ రక్తికట్టించడంలో మొనగాడు అయిన పోసాని కృష్ణమురళిని.. వైఎస్సార్ సీపీ గత అయిదేళ్ల కాలంలో బాగానే వాడుకుంది. జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడడానికి, ప్రత్యర్థులను చెడామడా తిట్టించడానికి.. పోసాని కృష్ణమురళి నాటకీయ ప్రసంగాలను ఒక అస్త్రంగా ప్రయోగించారు. ఆయనతో బూతులు తిట్టించారు. అసభ్యభాషణలు చేయించారు. మార్ఫింగో ఫోటోలను ప్రదర్శింపజేశారు. అప్పట్లో రెచ్చిపోయి ఈ పనులన్నీ చేసిన పోసాని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అరెస్టు అయ్యారు. రెండు కేసుల్లో రెండు జైళ్లలో గడిపిన తర్వాత.. బెయిలు వచ్చినా సరే.. గుంటూరులో సీఐడీ వద్ద నమోదైన మరో కేసులో పీటీవారెంటుపై అరెస్టు అయి మళ్లీ జైలుకు వెళ్లారు. తాజాగా ఆయనను ఒకరోజు కస్టడీకి తీసుకుని విచారించిన సీఐడీ పోలీసులకు ఆయన అనేక విషయాలు వెల్లడించినట్టుగా, సాక్షి పత్రికమీదనే ప్రధానంగా ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తోంది.
పోసానిని సీఐడీ పోలీసులు మొత్తం 32 ప్రశ్నలు అడగ్గా.. కొన్నింటికి మాత్రం ఆయన స్పష్టమైన సమాధానాలు చెప్పినట్టు సమాచారం. మిగిలిన వాటికి అలవాటు ప్రకారం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా వంటి సమాధానాలతో నెట్టేశారు. ప్రధానంగా తన ప్రెస్ మీట్ల వెనుక సాక్షి పత్రిక వారే ఉన్నట్టుగా పోసాని వెల్లడించడం గమనార్హం. ప్రెస్ మీట్ పెట్టాలని సాక్షివారే చెప్పేవారని, పేర్లు తెలియదుగానీ.. వారు రాసిచ్చిందే మాట్లాడేవాడినని పోసాని చెప్పారు. ఒక్కోసారి రెండు గంటల ముందే సమాచారం చెప్పి, స్క్రిప్టు ఇస్తే అదే మాట్లాడేవాడినని అన్నారు.
అయితే చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను తిట్టే విషయంలో మాత్రం తానే సొంతంగతా స్పందించానని అనడం గమనార్హం. నా కుటుంబ సభ్యులను తిట్టడం వల్లనే అలా స్పందించానని అన్నట్టుగా తెలుస్తోంది. గతంలో పోలీసులు విచారించినప్పుడు.. సజ్జల రామక్రిష్ణారెడ్డి స్క్రిప్టు రాసి ఇస్తే అదే చదివినట్టుగా పోసాని చెప్పిన మాటలను సీఐడీ అధికారులు గుర్తుచేయగా.. ప్రెస్ మీట్ల విషయంలో ఆయన ఎన్నడూ స్వయంగా స్క్రిప్టు పంపలేదని చెప్పడం గమనార్హం. తను ప్రదర్శించిన వీడియోలు, ఫోటోలు అన్నీ కూడా సాక్షివాళ్లే ఇచ్చారని.. తన దగ్గర అసలు ఎలాంటి వీడియోలు లేవని కూడా పోసాని చెప్పినట్టుగా తెలుస్తోందతి. ఫోటోలను మార్ఫింగ్ చేసి తప్పుడు సమాచారంతో ప్రచారం చేసినందుకే ఆయన కేసు ఎదుర్కొంటున్నారు. కాగా, ఆ పర్వం వెనుక మొత్తం సాక్షి పత్రికే ఉన్నది వెల్లడించడం ఎటు దారితీస్తుందోచూడాలి.
సాక్షి పత్రిక మొహం ఎక్కడ పెట్టుకుంటుందో?
Saturday, April 26, 2025
