అనగనగా ఒక కథ చెప్పుకోవాలి. అడవిలో పిట్టలు పట్టి, పట్టణంలోని ప్రజలకు వాటిని పెంచుకోవడానికి అమ్మే ఒక చిన్న వేటగాడికి ఓ సందర్భంలో రెండు చిలుకలు దొరికాయి. వాటిని చిన్న చిన్న పంజరాల్లో పెట్టి పట్టణంవీధుల్లో అమ్ముకుంటూ తిరిగాడు. చివరికి ఒక చిలకను ఒక సాత్వికుడైన వ్యాపారి కొనుగోలు చేయగా, రెండో చిలకను కాస్త కోపధారి అయిన కసాయివాడు కొన్నాడు. ఆ చిలకలు వారి వద్దే పెరిగాయి. ఓ ఏడాది తర్వాత ఆ చిన్న వేటగాడు అదే పట్టణానికి మళ్లీ రావడం జరిగింది.
దారమ్మట వెళుతూ వ్యాపారి ఇంటి వద్ద ఆగాడు. వెంటనే పంజరంలోని చిలక ‘ఎవరో అతిథులు వచ్చారో.. తాగడానికి మంచినీళ్లు తీసుకురండి.. భోంచేశారో లేదో అడగండి’ అంటూ అరవపసాగింది. ఆ చిలకను చూసి అతడికి ముచ్చటేసింది. అలాగే తాను విక్రయించిన మరో చిలకను కూడా చూడాలనుకున్నాడు. కసాయి వాడి ఇంటికి వెళ్లాడు. వాకిలిలో అలికిడి వినిపించగానే ‘కత్తి తీసుకురండి.. నరకండి.. ముక్కలు చేయండి’ అని అరవసాగింది ఆ చిలక. ఆ వేటగాడు నివ్వెర పోయి.. యజమాని బుద్ధులే చిలకలకు కూడా వచ్చేలా ఉంది అనుకుంటూఅక్కడినుంచి వెళ్లిపోయాడు.
ఇప్పుడు ఏపీలో వర్తమాన రాజకీయ పరిస్థితులను గమనిస్తే ఈ కథ గుర్తుకు వస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాంటమ్ టెక్నాలజీ, ఏఐ, క్వాంటమ్ వేలీ లాంటి ఆధునిక సాంకేతిక పదాలను వాడుతున్నాడు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్ తాను కూడా హైటెక్ బాట పట్టకపోతే బాగుండదని పరువుపోతుందని అనుకున్నారేమో చివరికి పార్టీకోసం ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయం, ఈ పదం ఆయనే స్వయంగా ప్రకటించారు. దానికి ఒక యాప్ కూడా తయారు చేయిస్తామని అన్నారు.
డిజిటల్ లైబ్రరీ అనగానే మీ మనసులో ఏం మెదలుతుంది. ఏదో అత్యంత విలువైన పార్టీ వారికి, కార్యకర్తలకు, వారి కుటుంబాలకు, పిల్లలకు ఉపయోగపడే, వారి జ్ఞానాన్ని పెంచే వేలాది డిజిటల్ పుస్తకాలను ఆయన ఈ లైబ్రరీలో ఉంచుతారేమో.. వారి జీవితాలను మెరుగుపడేలా చేస్తారేమో అనిపిస్తుంది.
కానీ కసాయి ఇంట్లో పెరిగిన చిలక మాదిరిగా జగన్ కోటరీ వద్దకు వచ్చరేసరికి డిజిటల్ లైబ్రరీ అనే పదానికి కూడా అర్థం మారిపోతోంది. జగన్ ఏర్పాటు చేయదలచుకుంటున్నది అది కాదు. రాష్ట్రంలోని తమ పార్టీ కార్యకర్తలు అందరూ స్థానికంగా తమకు ఎవరి మీద కక్ష ఉన్నదో, ఎవరి మీద పగ పెంచుకున్నారో.. రాజకీయ ప్రత్యర్థుల వివరాలను ఆ యాప్ లో నమోదు చేయాలట. అదంతా పార్టీ నిర్వహించే సర్వర్లలో ఉండే డిజిటల్ లైబ్రరీలో నిక్షిప్తం అవుతుందిట. అలాగే తమ మాట వినని అధికారుల వివరాలు కూడా అందులోనే నమోదు చేయాలట.
వీలైతే ఆధారాలు కూడా జత చేయాలట. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే.. వారందరి మీద పగ తీర్చుకోవడం ప్రారంభిస్తారట. తమ కార్యకర్తల్లోని పగలను, కక్షలను చాలా జాగ్రత్తగా నిక్షిప్తం చేయడానికి, కాలక్రమంలో పగలను వారు మర్చిపోయినా సరే.. పదిలంగా భద్రపరచి.. భవిష్యత్తులో మళ్లీ గుర్తుచేసి.. ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలను సర్వనాశనం చేయడానికి జగన్ ఈ డిజిటల్ లైబ్రరీ అనే వ్యవస్థను రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇదే చంద్రబాబు తన పార్టీ కార్యకర్తల కోసం డిజిటల్ లైబ్రరీ అనే పదం వాడి ఉంటే దాని రూపురేఖలు మరోలా ఉండేవని.. జగన్ జమానాలో ఇంతకంటె మరోలా ఆశించలేం అని ప్రజలు అనుకుంటున్నారు.
రెడ్ బుక్ లో తమను వేధించిన వారి పేర్లు రాస్తాం అని లోకేష్ అన్న మాటలు పట్టుకుని ఇప్పటిదాకా విమర్శలు చేస్తూ భయపడుతున్నరు వైసీపీ నాయకులు. తమ పచ్చ బుక్, మరో బుక్ రాస్తా అంటూ జగన్ సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చారు. రెడ్ బుక్ తరహాలో బుక్ అనే పదం వాడాలంటే ఆయనకు సిగ్గుగా అనిపించిందేమో.. ఇప్పుడు యాప్.. డిజిటల్ లైబ్రరీ అనే ఆధునిక పదాలు వాడుతూ తమ పగలను అందులో భద్రపరుస్తాం అని సెలవిస్తున్నారు.
