ఒక పెద్ద నేరంలో నీకుకూడా భాగం ఉందని అనుమానంగా ఉంది.. స్టేషనుకు వచ్చి సంజాయిషీ చెప్పు.. అని నోటీసు వస్తే.. కరడుగట్టిన నేరగాళ్లు తప్ప ఎంతటి వారైనా కంగారు పడతారు. అసలు నేరంతో సంబంధం లేని వారికి ఈ కంగారు మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డి సర్కారులో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగిన నారాయణస్వామి పరిస్థితి అలాగే ఉంది. నాకేంటీ ఖర్మ.. అంటూ ఆయన తన సన్నిహితుల వద్ద విలపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో ఆయన విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడమే అందుకు కారణం.
నారాయణస్వామి జగన్ జమానాలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ దేశంలో ఏ రాష్ట్ర రాజకీయాలను గమనించినా సరే.. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఎంత ఘోరంగా డమ్మీగా ఉండగలడో తెలుసుకోవడానికి నారాయణస్వామి ఒక ఉదాహరణగా నిలిచారు.
కానీ ఆయన జగన్ సర్కారులో ఎక్సైజ్ శాఖ మంత్రి. ఎక్సైజ్ శాఖలో తాను గరిష్టంగా దోచుకోదలచుకున్నాడు గనుక.. జగన్ అత్యంత గొప్ప డమ్మీ కి ఆ శాఖను అప్పగించినట్టుగా ఇపుడు ప్రజలు అనుకుంటున్నారు. ఆయనకు చూస్తున్నబాఖలోనే ఇప్పుడు మూడున్నర వేల కోట్ల రూపాయల కుంభకోణం బయటపడింది. మంత్రి గనుక ఆయన సంతకం లేకుండా.. లిక్కర్ కొత్త పాలసీ అమలు అయ్యే చాన్స్ లేదు. అయితే.. తాను సంతకం పెట్టిన ఫైల్ లో ఏముందో ఆయనకు తెలుసో లేదో మరి. ఎవరి ఒత్తిడి వల్లనైనా.. అందులో ఏముందో పట్టించుకోకుండా సంతకం పెట్టినా ఆశ్చర్యం లేదు.
నారాయణస్వామి గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్ద ప్రశాంతంగా లేరు. నియోజకవర్గంలో చాలాసార్లు.. తన సన్నిహితుల వద్ద భోరున విలపించినట్టు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఈ. రెడ్ల రాజ్యంలో పడలేకపోతున్నా అంటూ.. ఆయన తన వారితో చెప్పుకున్నారు. అప్పుడే జడుసుకున్న నారాయణస్వామి కి ఇప్పుడు మరింత కష్టం వచ్చింది. గతంలోనే సిట్ నోటీసులు ఇవ్వగా అనారోగ్యం పేరు చెప్పి ఎగ్గొట్టారు. ఇప్పుడు మల్లె నోటీసులు ఇచ్చారు. అసలు ఆ కుంభకోణంతో ఎలాంటి సంబంధం లేకుండా.. ఒక్క రూపాయి కూడా తను కళ్లజూడకుండా కేసు మాత్రం తన మెడకు చుట్టుకుంటున్నదని నారాయణ స్వామి బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.
