జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే రాజకీయాల్లో భవిష్యత్తు ఉండదని భయపడుతున్న అనేకమంది ఆ పార్టీని వదలి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అయితే ఎన్నికల్లో గెలిచిన వారికి ఒకరకంగా గత్యంతరం లేదు! అధికార కూటమి పార్టీలు అవసరానికి మించిన బీభత్సమైన మెజారిటీ కలిగి ఉన్నందువల్ల– వీరు వెళ్లి చేరాలని అనుకున్నా సరే ఆదరించే వారు లేరు. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న పదిమంది ఎమ్మెల్యేలలో పలువురు గత్యంతరం లేక అక్కడ కొనసాగుతున్నారనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది.
కేవలం తన హోదా కోసం ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ ర్యాంకు కోసం ఆరాటపడుతూ, తామెవ్వరినీ కూడా శాసనసభకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్న జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల కొందరు ఎమ్మెల్యేలలో అసంతృప్తి గురించి ఒక ప్రచారం ఉంది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఆయన చెప్పిన మాటకల్లా డూడూ బసవన్నలా తల ఊపుతూ శాసనసభకు చర్చలకు హాజరుకాకపోవడం మాత్రమే కాకుండా, కనీసం హాజరు పరంగా కూడా వెళ్లకపోతే తమ బతుకు, రాజకీయ భవిష్యత్తు రెంటికి చెడ్డ రేవడి చందంగా తయారవుతుందనే భయం వారిలో ఉంది. ఇవాళ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రస్తావించిన ఏడుగురు ఎమ్మెల్యేలు జగన్ తమను ముంచుతాడని భయంతోనే సభా కార్యక్రమాలకు వెళ్లకపోయినప్పటికీ అటెండెన్స్ రిజిస్టర్ లో మాత్రం సంతకాలు చేసి వెళ్లినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
60 రోజుల సభా సమావేశాలకు వరుసగా హాజరు కాకపోతే వారి శాసనసభ్యత్వం రద్దు అవుతుందనే రాజ్యాంగబద్ధమైన నిబంధన గురించి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు బయటపెట్టిన తర్వాత, జగన్మోహన్ రెడ్డికి కూడా భయం కలిగినట్లుగా ఉంది అందుకే అందరినీ వెంటబెట్టుకుని ఒక పూట సభకు వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఆ పార్టీ మిగిలిన ఎమ్మెల్యేలలో భయం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. దానికి సూచనే ఈ బడ్జెట్ సమావేశాల సమయంలో గవర్నర్ ప్రసంగం తర్వాత దాదాపు ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు వేరువేరు తేదీలలో వేరువేరు సమయాలలో సభ దాకా వచ్చి హాజరు పట్టిలో సంతకాలు చేసి లోపలికి రాకుండానే వెళ్ళిపోయినట్లుగా స్పీకర్ గుర్తించడం జరిగింది.
దొంగచాటుగా వచ్చి సంతకాలు దొంగల్లాగా వెళ్లిపోతున్నారని, ఎన్నుకున్న ప్రజలకు గౌరవం దక్కేలాగా సభలోనికి వచ్చి చర్చలలో కూర్చుంటే బాగుంటుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభాముఖంగా వారికి హితవు చెప్పారు. ఆ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. జగన్ ఆదేశాలను పట్టించుకోకుండా.. ఏడుగురు ఎమ్మెల్యేలు సభదాకా వచ్చి సంతకాలు చేసి వెళ్లారంటే వారిలో భయమే వారితో ఆ పని చేయించినట్టు పలువురు భావిస్తున్నారు.
వారిలో రెండు రకాల భయానికి అవకాశం ఉంది. ఒకటి– నిరంతర గైర్హాజరు కారణంగా తమ పదవి పోతుందనే భయం. ఒకవేళ తమ పార్టీలో అందరి పదవులు పోయినా సరే, జగన్ లాగా మళ్లీ ఎన్నికలు వస్తే ఆ ఖర్చులు తట్టుకోగల స్థితిలో తాము లేమని, పైగా ప్రజలు మళ్ళీ తమను ఉపఎన్నికల్లో కూడా గెలిపిస్తారని నమ్మకం కూడా లేని వారు ఒక రకమైన భయానికి గురవుతున్నారు. రెండోది ఏంటంటే– నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించకుండా ఏళ్ళు ఏళ్ళు గడిపేస్తే గెలిపించిన ప్రజలందరూ తమను అసహ్యించుకుంటారని ఆందోళన చెందుతున్నారు. అందుకే రిజిస్టరులో సంతకాలు పెట్టేసి– సభకు తమ నియోజకవర్గం గురించి కొన్ని ప్రశ్నలు ఇచ్చేసి లోపలకు రాకుండానే పారిపోతున్నారనేది విశ్లేషకుల భావన! ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి వద్దన్న తర్వాత ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరు కోసం సభకు వెళుతున్నారంటే అది పార్టీ మీద ఆయనకున్న గుత్తాధిపత్యానికి గొడ్డలి వేటు అని పలువురు అంటున్నారు.