రాజధాని అయితే తప్ప ఒక ప్రాంతం అభివృద్ధి చెందదు అనే అభిప్రాయం కలిగించేలాగా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గానీ, ఆ పార్టీ నాయకులు గానీ చిలక పలుకులు పలుకుతూ ఉంటారు. ఎంతోకాలంగా వెనకబడి ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాజధాని తీసుకురావాలని ముఖ్యమంత్రి సంకల్పిస్తే.. మీరు అడ్డుకుంటారా? అంటూ పదేపదే ఆడిపోసుకుంటూ ఉంటారు. అయితే రాజధాని రావడం ద్వారా జగన్ సర్కారు చేయగలిగిన అభివృద్ధి ఏమిటో ప్రజల జీవితాలు ఏ రకంగా వృద్ధి చెందుతాయో.. ప్రభుత్వం మంగళవారం నాడు శాంపిల్ చూపించింది. ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్స్ కు దగ్గర్లో ఉండే ప్రెవేటు వ్యక్తి భూమి (ఆంధ్రా యూనివర్సిటీ తమదే అని క్లెయిం చేస్తోంది)లో నడుస్తున్న చిరు వ్యాపారుల దుకాణాలను ధ్వంసం చేసేశారు. ఒక్కసారిగా వారి దుకాణాలనే కాదు.. వారి జీవితాలనే కుప్పకూల్చేశారు.
ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్స్ వద్ద 1.02 ఎకరాల వివాదాస్పద భూమి ఉంది. కుంచం అప్పారావు అనే వ్యక్తి ఇది తన ప్రెవేటు భూమి అని కొన్నేళ్లపాటూ అన్ని కోర్టుల్లలోనూ దావా నడిపారు. చివరకు ఆయనకు అనుకూలంగా 13 ఏళ్ల కిందట సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ.. ఇప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీ మాత్రం అది తమదే అంటోంది. తాజాగా ఏయూ వీసీ ప్రసాదరెడ్డి కూడా అదే అంటున్నారు. తాజాగా మరోమారు అధికార్లకు ఫిర్యాదు చేశారు.
సర్కారు ఇదే సాకుగా తీసుకుంది. అసలే మోడీ సభ జరగబోతోంది. ఆ సభ మిష మీద.. వాహనాల పార్కింగ్ కు అనువైన స్థలాలన్నిటినీ చదును చేస్తున్నారు. మంగళవారం నాడు హఠాత్తుగా జీవీఎంసీ అధికారులు పోలీసు బందోబస్తుతో వచ్చి జేసీబీలు, పొక్లెయిన్లతో ఈ నిర్మాణాలను కూలగొట్టడం ప్రారంభించారు. నిజానికి సుప్రీం కోర్టులో కేసు గెలిచిన కుంచం అప్పారావు వారసులు ఆ స్థలాన్ని వాటాలు పంచుకుని, అద్దెలకు ఇచ్చుకున్నారు. అందులో రకరకాల దుకాణాలు నడుస్తున్నాయి. ఆ స్థలం యజమానులకు గానీ, అద్దెకున్న దుకాణాల వారికి గానీ, ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇవ్వడం కాదు కదా.. కనీసం లోపల ఉన్న సామగ్రి తరలించుకునేందుకు పదినిమిషాల వ్యవధి కూడా ఇవ్వలేదు. పోలీసు బందోబస్తుతో వచ్చిన అధికారులు.. ఎడాపెడా దుకాణాలను కూల్చేసి, వారి జీవితాలను బుగ్గి చేశారు. శిథిలాలను అలాగే వదిలేసి వెళ్లిపోయారు.
విశాఖపట్నంను రాజధాని చేసేసి.. ఉద్ధరించేస్తా అంటున్న జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో అభివృద్ధి అంటే అర్థం ఇలాగే ఉంటుందా.. అని బాధితులు వాపోతున్నారు. తాము కన్నేసిన భూముల మీద ఏదో ఒక వివాదం సృష్టించి అయినా.. అక్కడి స్థల యజమానుల్ని ఇబ్బంది పెట్టగలరని.. జగన్ ప్రకటించే రాజధాని మోడల్ ప్రగతి ఇదేనని ప్రజలు విమర్శిస్తున్నారు.
విశాఖ రాజధాని అయితే విధ్వంసానికి సీక్వెల్!
Thursday, November 14, 2024