ఒక స్థాయిగల ప్రజాప్రతినిధిగా ఉంటూ.. అత్యంత లేకి, అసహ్యమైన భాషలో ట్వీట్లు పెట్టడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డికి అపారమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. తిరిగి ప్రస్తావించడానికి కూడా ఎవరైనా సిగ్గు పడేంత చీప్ గా విజయసాయిరెడ్డి ట్వీట్లు అనేకం ఉంటాయి. చంద్రబాబును, లోకేష్‌ను, తన సిగ్గుమాలిన అవినీతి బాగోతాలు అన్నీ ప్రజలకు తెలియజెబుతున్నందుకు రామోజీరావును ఆయన నిత్యం తన ట్వీట్లలో టార్గెట్ చేస్తుంటారు. అందులో అత్యంత ఘోరమైన భాష, విషయాలు వాడుతుంటారు. తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్.. చంద్రబాబును తిట్టడానికే ఉద్దేశించినప్పటికీ.. ఇండైరక్టుగా సీఎం వైఎస్ జగన్ మీద తన అక్కసును వెళ్లగక్కడానికి అలా రాశారనే అభిప్రాయం పలువురిలో వినిపిస్తోంది. చంద్రబాబును ఉద్దేశించిన ఒక్క పదం మారిస్తే చాలు.. అచ్చంగా ఆ ట్వీట్ లోని వెటకారం అచ్చంగా జగన్ కు సరిపోతుంది.
అసలే విజయసాయిరెడ్డిని కొంత కాలంగా జగన్మోహన్ రెడ్డి లూప్ లైన్లో పెట్టారనే ప్రచారం పార్టీలో ఉంది. వాళ్లు రాజధానిగా అనుకుంటున్న విశాఖకు ఇన్చార్జిగా ఉన్న విజయసాయిని తప్పించి.. ఆ బాధ్యతలను తన సొంత చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి చేతుల్లోపెట్టినప్పుడే.. విజయసాయికి జగన్ వద్ద ఎంత విలువ ఉన్నదో పార్టీలో అందరికీ అర్థమైంది. ఇన్చార్జి పోస్టు ఇస్తే.. విశాఖ నగర వ్యాప్తంగా తన సొంత దందాలు, కబ్జాలు నడిపించడానికి వాడుకుంటున్నాడనే ఏవగింపు.. ఆయనను దూరం పెట్టేలా చేసిందని అంతా చెవులు కొరుక్కున్నారు.
అయితే తాజాగా చంద్రబాబును వెటకారం చేస్తూ విజయసాయిరెడ్డి పెట్టిన ఒక ట్వీట్ సందర్భశుద్ధి లేకుండా ఉన్నదని, అది జగన్ కు వర్తించి చూసుకుంటే అచ్చంగా సరిపోతుందని అంతా అనుకుంటున్నారు. విజయసాయిరెడ్డి బుధవారం నాడు ఒక ట్వీట్ పెట్టారు. ‘‘చక్రవర్తులు అనుకున్న మహా మహులెవరూ జీవితకాలం పాలించలేదు. హిట్లర్ కూడా నీలాగే కలలు కన్నాడు చంద్రం అన్నయ్యా. అధికారంలో ఉన్నన్ననాళ్లు అహంతో అందరినీ వేధించావు. కాళ్ళు పట్టుకుని, కుట్రలు చేసి జైళ్లకు పంపావు. నీ పుస్తకంలోని ప్రతి అక్షరం ప్రజలకు కంఠస్తమే. ఆశలేం పెట్టుకోకు.’’ అనేది ఆ ట్వీట్.
ఈ ట్వీటులో ‘చంద్రం అన్నయ్యా’. . అనే పదం మార్చి ‘జగన్ అన్నయ్యా’ అని పెడితే సరిపోతుంది. ఈ ట్వీటు చంద్రబాబు కోసం కంటె, జగన్ కే ఎక్కువ సూటవుతుందని కూడా అనిపిస్తుంది. చంద్రబాబు తాను యింతకాలం సీఎంగా ఉండాలని ఎన్నడూ అనలేదు. అదే సమయంలో.. ‘ఒక్క చాన్స్’ అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. ఇంకో ముప్ఫయ్యేళ్లు కావాలని ఆరాటపడుతున్నాడు. విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా హిట్లర్ కూడా జగన్ లాగానే కలలు కన్నాడు. ‘అధికారంలో ఉన్నన్నాళ్లు అందరినీ వేధించావు’ అనే విజయసాయి మాట.. జగన్ కు అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది. ఆపరేషన్ చేసుకుని ఉన్న అచ్చెన్నాయుడును అరెస్టుచేసి.. కారులో గుంటూరు దాకా తరలించడం దగ్గరినుంచి.. తెలుగుదేశం నాయకులు ఎంతమందిని వేధించారో ప్రజలకు తెలుసు. ‘కుట్రలు చేసి జైళ్లకు పంపావు’ అనేది కేవలం జగన్ కు మాత్రమే సూటయ్యే సంగతి. ఎందుకంటే.. చంద్రబాబు ఎవరినీ జైలుకు పంపలేదు. జగన్ జైలుకు వెళ్లడానికి చంద్రబాబుకు సంబంధం లేదు. అది కాంగ్రెస్ నాయకుడు శంకర్రావు వేసిన కేసు. అయితే.. జగన్ మాత్రం ఎందరిని జైలుకు పంపాడో లెక్కలున్నాయి. నేరాలేమీ లేకపోయినా.. టీడీపీ నాయకులంతా నాలుగురోజులు జైల్లో ఉండి రావాల్సిందే అన్నట్టుగా.. జగన్ పనిగట్టుకుని, పగబట్టినట్టుగా అరెస్టులు చేయించారు. వీటిని ఉద్దేశించే విజయసాయిరెడ్డి ట్వీట్ చేసినట్టుగా ఉంది. చివరిగా ‘ఆశలేం పెట్టుకోకు’ అని విజయసాయి హెచ్చరిస్తున్నది కూడా జగన్ నేనా? జగన్ జీవితంలోని ప్రతిపేజీ ప్రజలకు అర్థమవుతోంది. అందుకే జనం తిప్పికొడతారని.. ఈ ట్వీట్ ద్వారా.. విజయసాయిరెడ్డి తమ అధినేతకు పరోక్షంగా సూచిస్తున్నాడా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.