భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సంబంధించి కీలక నాయకులు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లాలూచీపడ్డారని ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కు కావడం వల్ల మాత్రమే, పార్టీ మాజీ సారథి సోమ వీర్రాజు ప్రభుత్వం మీద విమర్శలు చేయకుండా రోజుల నెట్టేస్తూ వచ్చారని అభిప్రాయం పలువురులో ఉంది. అందువల్ల ఆయనను పదవి నుంచి తప్పించాలని కూడా ప్రచారం ఉంది. కొత్తగా సారథ్యం స్వీకరించిన దగ్గుబాటి పురందేశ్వరి.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక రేంజిలో విరుచుకుపడుతున్నారు. ఆమె మీద కౌంటర్ అటాక్ చేయడంలో వైసిపి నాయకులు మంత్రులు అందరూ తలమునకలు అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. దగ్గుబాటి పురందేశ్వరి మినహా బిజెపిలోని మిగిలిన నాయకులు వైసిపి జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రలోభంలో ఉన్నారేమో అని అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.
దగ్గుబాటి పురందేశ్వరి ఏపీలో జరుగుతున్న ఇసుక కుంభకోణం గురించి, లిక్కర్ వ్యాపారం ముసుగులో జరుగుతున్న అక్రమాలు స్వాహా పర్వం గురించి పలుమార్లు నిశిత విమర్శలు చేస్తూ వస్తున్నారు. . ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే వాస్తవాలను బయటపెడుతున్నారు. పాలక పక్షం సమాధానం చెప్పడం కష్టం అవుతుంది. ఇసుక ర్యాంపుల వద్దకు పురందేశ్వరి స్వయంగా విజిట్ లు నిర్వహిస్తూ అక్కడ అక్రమాలను బయటకు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మీద ఎడతెగని విమర్శలు చేస్తున్న విజయ్ సాయి రెడ్డి తాజాగా ఒక మాట అన్నారు.
ఇసుక ర్యాంపుల వద్దకు పురందేశ్వరి విజిట్ లు నిర్వహిస్తున్నప్పుడు.. కనీసం ఒక్క బీజేపీ నాయకుడైన ఆమె వెంట ఉంటున్నారా? అని విజయసాయి ప్రశ్నిస్తున్నారు. ఆమెకు మద్దతుగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారే తప్ప.. బిజెపి నాయకులు నోరు మెదపడం లేదని ఆయన అంటున్నారు. ఆయన మాటలను గమనిస్తే పురందేశ్వరి మినహా పార్టీలో ఉన్న కీలక నాయకులు చాలామందిని విజయసాయిరెడ్డి ప్రలోభ పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా ఢిల్లీ బిజెపి పెద్దలతో అత్యంత సత్సంబంధాలు నెరపే విజయసాయి.. ఏపీ బీజేపీ లో కూడా పలువురిని ప్రలోభ పెడుతున్నారేమో అని అభిప్రాయం వినపడుతోంది. దగ్గుబాటి పురందేశ్వరి సహకరించకుండా చక్రం తిప్పుతున్నారేమో అనే వాదన పార్టీలో ఉంది. అయినా పురందేశ్వరి అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పాలి గాని.. ఆమె చేస్తున్న ఆరోపణలు అబద్ధం అని నిరూపించాలి గాని.. ఆమె వెంట ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనే విషయాలతో పసలేని ప్రత్యారోపణలు చేయడం దండగ అని విశ్లేషకులు భావిస్తున్నారు.