తమ ప్రత్యర్థుల అంతుచూస్తాం అని.. తమ వద్ద సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయటపెడతాం అని రాజకీయ నాయకులు ఇతరులను బెదిరించడం అనేది ఇప్పుడు చాలా పాతపడిపోయింది. ‘తమ ప్రత్యర్థుల బట్టలు విప్పుతాం’ అని వార్నింగులు ఇవ్వడమే నయా ట్రెండ్ గా నడుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఇతరుల బట్టలు విప్పే ఉత్సాహాన్ని పలు సందర్భాల్లో ప్రదర్శిస్తూ ప్రజల దృష్టిలో నవ్వులపాలు అవుతున్నారు. ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చినప్పటికీ.. ఆ పార్టీ యొక్క ఫ్యూడల్ వాసనలు ఇంకా వదులుకోలేని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అదే మాదిరిగా తాను కూడా ‘వారి బట్టలు విప్పుతానని’ కొత్త సవాళ్లు విసురుతున్నారు.
వైసీపీ నాయకులు తమకు కిట్టనివారి గురించి బట్టలిప్పదీస్తాం అని బెదిరించడం ఫ్యాషన్ అయింది. తన పరిధిలో సీఐ పేరు ప్రస్తావించి మరీ.. బట్టలిప్పదీస్తానని ప్రకటించిన మాజీ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డి ఇప్పుడు పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవడానికి పరారీలో ఉన్నారు. పాపిరెడ్డి పల్లి సందర్శించినప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసుల బట్టలిప్పదీసి నిలబెడతానని సవాలు విసిరారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి అలాంటి అవకాశం వచ్చింది. లిక్కర్ స్కామ్ విషయంలో విజయసాయి ఎవరి మీదనైతే కీలక వ్యక్తిగా ఆరోపణలు చేశారో సదరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పోలీసులకు చిక్కిన తర్వాత.. విజయసాయి రెడ్డి ఓ ట్వీట్ చేశారు.
‘‘ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను.’’ అని అందులో పేర్కొన్నారు.
లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేతలు తన పేరు కూడా ప్రస్తావించే సరికి, రాజ్ కసిరెడ్డి కూడా పోలీసుల విచారణలో తన పాత్ర ఉన్నట్టుగా బయటపెడతారనే అనుమానంతో విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ చేసినట్టు అర్థమవుతోంది.
ఇటీవల విచారణకు హాజరైనప్పుడు.. విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ లో కొందరి పేర్లను దాచిపెట్టినట్టు ప్రజలు ఆయన మాటలను బట్టి అనుకున్నారు. ఈ స్కామ్ వెనక ఎవరున్నారో, బిగ్ బాస్ ఎవరో తనకు తెలియదని, అవన్నీ రాజ్ కసిరెడ్డి ద్వారానే తెలుసుకోవాలని విజయసాయి ఆరోజున ప్రెస్ మీట్ లో చెప్పారు. కానీ.. తాజా ట్వీట్ గమనిస్తే.. ఆయన తాను దాచిన పేర్లతో సహా, బిగ్ బాస్ పేరును, స్కామ్ లో వారి వారి పాత్రను, వారికి ముట్టిన వాటాలను అన్ని వివరాలనూ పూసగుచ్చినట్టుగా వెల్లడించడానికి సిద్ధమవుతున్నారేమో అనిపిస్తోంది.
