వంగలపూడి అనిత కేవలం తెలుగు మహిళ అధ్యక్షురాలు మాత్రమే కాదు. తన పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత దూషణలతో రెచ్చిపోతున్నా సరే.. ఆమె ఖాతరు చేయరు. జగన్ ప్రభుత్వం మీద మహిళా అంశాల గురించి నిశిత విమర్శలతో విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ ఆమె. అనిత తాజాగా జగన్మోహన్ రెడ్డి ఏయే విషయాల్లో మహిళలకు ఇచ్చిన మాట తప్పారో, ఏ రకంగా మోసం చేశారో నిలదీస్తున్నారు.
45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు కూడా పెన్షను అందజేస్తానని అధికారంలో రాక ముందు జగన్ చేసిన వాగ్దానాన్ని అనిత ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అధికారమే లక్ష్యంగా.. అన్ని వర్గాల ప్రజలను బుట్టలో వేసుకోవడమే మార్గంగా.. జగన్ అలవిమాలిన హామీలు అనేకం తన పాదయాత్రలోను, ఎన్నికల ప్రచార సభల్లోనూ జనం మీద కురిపించారు. వాటన్నింటినీ చాలా కన్వీనియెంట్ గా పక్కకు నెట్టేసి, కేవలం అప్పట్లో తాము ప్రచురించిన సింగిల్ పేజీ మేనిఫెస్టోలోని హామీల గురించి మాత్రమే మాట్లాడుతూ.. 99 శాతం వాగ్దానాలు నెరవేర్చిన పార్టీ మాది అని వైసీపీ వారు డప్పు కొట్టుకుంటూ ఉంటారు.
ఇలాంటి నేపథ్యంలో జగన్ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలపై ఏ రీతిగా మాట తప్పారో అనిత గుర్తు చేస్తున్నారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు పెన్షనున ఇస్తానని జగన్ అప్పట్లో ప్రకటించారు. దానిని పట్టించుకోలేదు. అలాగే అమ్మఒడి పథకాన్ని ఇంట్లో చదువుకునే పిల్లలు ఎందరుంటే.. అందరికీ వర్తింపజేస్తామని కూడా జగన్ చాలా స్పష్టంగా ప్రకటించారు. అదికూడా అమలు కావడం లేదు. అనిత ప్రశ్నిస్తున్న ఈ రెండు అంశాల విషయంలో జగన్ సర్కారుపై చంద్రబాబునాయుడు పైచేయి సాధించినట్లే అనుకోవాలి. ఎందుకంటే.. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు కూడా నెలవారీగా 1500 ఇస్తాననే హామీతో చంద్రబాబు మహిళాలోకంలో హర్షాతిరేకాలు నింపారు. ఈ మాటతో, జగన్ 45 ఏళ్లు దాటిన మహిళలకు పెన్షన్ ఇస్తాననే వాగ్దానానికి కాలదోషం పట్టిపోయింది.ఆ పాత వాగ్దానాన్ని ఇప్పటికిప్పుడు ఆయన తిరిగి తెరపైకి తెచ్చినా దానికి విలువ లేకుండాపోయింది. అమ్మఒడి విషయంలో కూడా అలాగే జగన్ వాగ్దానానికి విలువ లేకుండా చేశారు చంద్రబాబునాయుడు. ఎందరు పిల్లలుంటే అందరికీ ఇస్తానని జగన్ మాటతప్పిన సమయంలో, తమ ప్రభుత్వం వస్తే ముగ్గురు నలుగురు పిల్లలున్నా సరే తప్పకుండా ఇస్తాం అంటూ ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇప్పుడు జగన్ దానిని అచ్చంగా అమలు చేసినా, చంద్రబాబు మాటలకు జడిసి చేసినట్టుగా ప్రజలు భావించే అవకాశం ఉంది.
మద్యపాన నిషేధం విషయంలో అనిత ప్రశ్నలకు బహుశా ప్రబుత్వం ఎప్పటికీ సమాధానం చెప్పలేకపోవచ్చు. సంపూర్ణ మద్యపాన నిషేధం అనే హామీ ఇచ్చిన జగన్, మహిళలను దారుణంగా వంచించారు. డమ్మీ బ్రాండ్ ధరలను అమాంతం పెంచి దోపిడీకి తెరతీసిన జగన్ ఆ దోపిడీ అంతా తాగే అలవాటు తగ్గించడానికే అని, దశలవారీగా మద్య నిషేధం వస్తుందని బుకాయించారు.
ఈ ప్రశ్నలపై , జగన్ మాట తప్పడంపై ప్రజల్లో ఆలోచన మొదలైతే పాలకపక్షానికి ఇబ్బంది తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
‘మాటతప్పడం’పై లేడీ ఫైర్ బ్రాండ్!
Tuesday, November 5, 2024